హెచ్1బీ రద్దు బిల్లు : బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకోవడమే
అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఐటీ, సర్వీస్ సెక్టార్ రంగాల్లో 'హెచ్-1బీ' వీసా ఒక కీలకమైన వంతెన.;
అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఐటీ, సర్వీస్ సెక్టార్ రంగాల్లో 'హెచ్-1బీ' వీసా ఒక కీలకమైన వంతెన. దశాబ్దాలుగా ప్రపంచ మేధావులను ముఖ్యంగా భారతీయ నిపుణులను సిలికాన్ వ్యాలీకి చేరవేస్తున్న ఈ వ్యవస్థ ఇప్పుడు ఒక పెద్ద కుదుపునకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్లోరిడా రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్ట్యూబ్ ప్రతిపాదించిన "ఎక్సిల్ యాక్ట్ " (ఎండింగ్ ఎక్స్ ప్లోటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెమ్ షన్ యాక్ట్ ) ఈ చర్చను మరోసారి ప్రపంచ వేదికపైకి తెచ్చింది.
అమెరికా ప్రయోజనాల కోసమా? రాజకీయ ఎత్తుగడనా?
గ్రెగ్ స్ట్యూబ్ వాదన ప్రకారం.. కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను నియమించుకుంటూ స్థానిక అమెరికన్ల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. "అమెరికా ఫస్ట్" అనే నినాదంతో వస్తున్న ఈ బిల్లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి హెచ్-1బీ కోటాను సున్నాకు తగ్గించాలని కోరుతోంది. అంటే ఈ బిల్లు చట్టంగా మారితే కొత్తగా ఒక్క నిపుణుడు కూడా ఈ వీసా ద్వారా అమెరికాలో అడుగుపెట్టలేరు.
ప్రతిపాదిత బిల్లులోని ప్రధానాంశాలు..
కొత్త హెచ్-1బీ వీసాల జారీపై పూర్తి నిషేధం విధిస్తారు. విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గిస్తారు. స్థానిక అమెరికన్ నిపుణులకు ఉద్యోగ భద్రత కల్పిస్తారు.
గ్లోబల్ టాలెంట్ వర్సెస్ లోకల్ ప్రొటెక్షనిజం
అమెరికాలోని దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి సంస్థలు ఈ ప్రతిపాదన పట్ల ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా నేడు సాంకేతిక రంగంలో ప్రపంచాధిపత్యం చెలాయిస్తోందంటే దానికి కారణం విదేశీ నిపుణుల కృషే. సైన్స్, మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో అమెరికాలో ఇప్పటికీ తగినంత మంది స్థానిక నిపుణులు లేరు. ఈ ఖాళీలను హెచ్-1బీ నిపుణులే భర్తీ చేస్తున్నారు. విదేశీ మేధావులను దూరం చేసుకుంటే అమెరికాలో ఇన్నోవేషన్ మందగించి ఇతర దేశాలు సాంకేతిక రేసులో ముందుకు వెళ్లే ప్రమాదం ఉంది.
భారతీయులపై ప్రభావం
ఈ బిల్లు వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయులే. ఏటా జారీ అయ్యే హెచ్-1బీ వీసాల్లో సుమారు 70% కంటే ఎక్కువ మనవారే పొందుతున్నారు. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయం, లక్షలాది మంది యువత కలలు ఈ వీసాపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ కఠిన నిర్ణయం అమల్లోకి వస్తే, భారతీయ మేధాశక్తి ప్రత్యామ్నాయ దేశాల వైపు కెనడా, యూరప్ లేదా స్వదేశం మళ్లే అవకాశం ఉంది.
అమెరికా కాంగ్రెస్‌లో ఇలాంటి బిల్లులు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఇటువంటి ప్రతిపాదనలు వచ్చినా కార్పొరేట్ సంస్థల ఒత్తిడి , ఆర్థిక అవసరాల దృష్ట్యా అవి చట్టాలుగా మారలేదు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వలస విధానాలపై అమెరికా గొంతు కఠినమవుతోంది.
హెచ్-1బీ వ్యవస్థలో లోపాలుంటే వాటిని సవరించాలి కానీ వ్యవస్థనే రద్దు చేయడం అనేది "బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకోవడమే" అవుతుంది. ఈ బిల్లు చట్టంగా మారుతుందా లేక కేవలం రాజకీయ నినాదంగా మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.