ట్రెండ్ : భారతదేశానికి తిరిగి రండి !

అమెరికాలో ఉద్యోగాలపై రోజుకో ఆంక్ష, అక్కడ గ్రీన్ కార్డ్ విషయంలో, హెచ్ 1బి వీసాల విషయంలో పూటకొక నిబంధన, అక్కడి పార్ట్ టైమ్ ఉద్యోగాలపై పదే పదే ఆంక్షలు.

Update: 2026-10-14 14:30 GMT

అమెరికాలో ఉద్యోగాలపై రోజుకో ఆంక్ష, అక్కడ గ్రీన్ కార్డ్ విషయంలో, హెచ్ 1బి వీసాల విషయంలో పూటకొక నిబంధన, అక్కడి పార్ట్ టైమ్ ఉద్యోగాలపై పదే పదే ఆంక్షలు. ఇది ఒక్క అమెరికాకే కాదు. వివిధ దేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తున్న భారతీయులకు తరచుగా ఎదురవుతున్న సమస్యలు. ఈ నేపథ్యంలోనే కొత్తగా కొన్ని నినాదాలు వినిపిస్తున్నాయి. ‘మీరు వెళ్లిన దేశం వెనక్కి పొమ్మంటే, వెంటనే తిరిగి వచ్చేయండి. ఇక్కడ కోట్ల సమస్యలు పరిష్కరించాలి’ అంటూ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వంటి వారు పిలుపు ఇస్తున్నారు.

భారత దేశం నుండి ఏటా లక్షలాది మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. 2024లోనే 13 లక్షల పైచిలుకు విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లారు. దీంతో మేధోవలస పెరిగిపోయి దేశం నష్టపోతోంది అన్న వాదన వినిపిస్తున్నది. స్వదేశీ విద్య అంటున్న నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపడం, పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకులు, ఉన్నత నాణ్యత విద్య నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కుమారుడు ధ్రువ్ గోయల్ అమెరికాలోని హార్వర్డ్ లో ఎకనామిక్స్ అనంతరం బిజినెస్ స్కూల్ లో ఎంబీఎ చదివాడు. ఫోర్ లైన్ క్యాపిటల్ సీఈఓగా ఉన్నాడు. రాధికా గోయల్ యూకే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాన్ డియాగో లో ఎకనామిక్స్ లో పీహెచ్ డీ చదివింది. జైశంకర్ కుమారుడు ధ్రువ జైశంకర్, అర్జున్ జైశంకర్, నిర్మలా సీతారామన్ కుమార్తె వంగ్మయి పరకాల, శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ చౌహాన్, కునాల్ చౌహాన్, రాజ్ నాథ్ సింగ్ కుమారుడు నీరజ్ సింగ్ ఇలా అనేక మంది విదేశాల్లో చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం జరుగుతుంది.

భారతదేశంలో పెరిగిన అవకాశాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, రీసెర్చ్ సెంటర్లు, ఫాస్ట్ కెరీర్ గ్రోత్, తక్కువ జీవన వ్యయం నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన వారిని ఇప్పటికే ఆకర్షిస్తున్నాయి. దేశంలో టెక్, ఉత్పత్తి, ఎనర్జీ, అగ్రిటెక్, హెల్త్ కేర్ స్టార్టప్ లు, విద్యావ్యవస్థ, స్కిల్ డెవలప్ మెంట్ రంగాలు బలోపేతం అయ్యాయి.

వ్యవస్థను బలోపేతం చేయడానికి దేశం దాటి వెళ్లిన యువత తిరిగి దేశానికి తిరిగి రావాలని, విదేశాల్లో ఉన్న ఆంక్షలతో ఇబ్బందులు పడకుండా స్వదేశంలో సొంత కాళ్ల మీద నిలబడడమే కాకుండా, పది మందికి ఉపాధి కల్పించే అవకాశాలను పరిశీలించాలన్న చర్చ మొదలయింది. విదేశాలను ఒక అప్షన్ గా మాత్రమే చూడాలని, భారతదేశాన్ని కూడా గుర్తుంచుకోవాలి అన్న చర్చ బలంగా నడుస్తుంది. ఈ ట్రెండ్ దేశానికి ఎంత మేలు చేస్తుంది. ఎక్కడికి దారి తీస్తుంది అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News