అజిత్ పవార్ మరణం వెనుక కుట్ర కోణం ఉందా... షాకింగ్ కామెంట్స్!
ప్రధానంగా సీఐడీ సీసీటీవీ ఫుటేజ్ లను మాత్రమే సేకరిస్తుందని.. దర్యాప్తు ముందుకు సాగలేదని.. ఈ దర్యాప్తును వేగవంతం చేయకుంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.;
గత నెలలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మరో నలుగురు విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన బారామతిలోని ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఆ విమాన ప్రమాదం వెనుక కుట్ర ఉందని, ఆయన మరణించడం పెద్ద కుట్రలో భాగమంటూ ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది! ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు సంచలన సందేహాలు వ్యక్తం చేశారు!
అవును... ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చాలామంది సామాన్యుల మాదిరిగానే తాను కూడా ఈ ప్రమాదంలో కుట్ర అవకాశాన్ని అనుమానించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా... తాను సీఐడీ ఉద్దేశాలను అనుమానించడం లేదు కానీ.. వారు తగినంత సమర్ధులు కాదని అన్నారు. ఎందుకంటే... ఆ అధికారులకు ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలోకి పూర్తి ప్రవేశ కూడా అనుమతించబడదని పేర్కొన్నారు.
ప్రధానంగా సీఐడీ సీసీటీవీ ఫుటేజ్ లను మాత్రమే సేకరిస్తుందని.. దర్యాప్తు ముందుకు సాగలేదని.. ఈ దర్యాప్తును వేగవంతం చేయకుంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే లియర్ జెట్ ను నడుపుతున్న కెప్టెన్ సుమిత్ కపూర్ ను ప్రస్తావించిన రోహిత్... అతను గతంలో మద్యం సేవించినందుకు మూడేళ్లు సస్పెండ్ చేయబడ్డారని.. ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని.. ఇది పరిశీలించాల్సిన అంశమని నొక్కి చెప్పారు.
ఇదే క్రమంలో... ఈ విషాదాన్ని కేవలం ప్రమాదం అని తాము నమ్మడం లేదని.. అనుమానించడానికి అవకాశం ఉందని చెప్పిన రోహిత్ పవార్... అజిత్ దాదా విమాన ప్రమాదం నిజంగానే ప్రమాదమా లేక కుట్రనా అని మహారాష్ట్రం మొత్తం ప్రశ్నిస్తోందని.. ఈ సమయంలో తనకు అనిపించింది అందరితోనూ పంచుకుంటున్నానని.. కొంతమంది ఇప్పటికీ దాదా ఎక్కడి నుంచో వస్తాడని ఆశిస్తున్నారని.. మరికొంతమందైతే ఆ విమానంలో ఆరుగురు ఉన్నారని.. అది అజిత్ దాదా మృతదేహం కాదని నమ్ముతున్నారని తెలిపారు!
ఇదే క్రమంలో... సంక్షోభ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో అసాధారణ సంభాషణను కూడా ఆయన హైలైట్ చేశారు. ఇందులో భాగంగా... సాధారణంగా సమస్య వచ్చినప్పుడు "మే డే" కాల్ కు బదులుగా "ఓహ్ ఎస్" అనే పదాలు ఉపయోగించబడ్డాయని.. వాటినీ దర్యాప్తు చేయాలని రోహిత్ సూచించారు! దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మరణంపై పవార్ కుటుంబం నుంచి తొలిసారి సందేహాలు తెరపైకి వచ్చాయని అంటున్నారు!!
కాగా... జనవరి 28న పూణే జిల్లాలోని బారామతిలోని ఎయిర్ స్ట్రిప్ వద్ద ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో చార్టర్డ్ లియర్ జెట్ విమానం కూలిపోవడంతో అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన వక్తిగత భద్రతా అధికారి, పైలట్, కో-పైలట్, విమాన సహాయకురాలు ఒకరు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంపైనే తాజాగా రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇంతకుముందు దీనిలో కుట్ర కోణాన్ని శరద్ పవార్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే!