ప్రశ్నించే గొంతులు ఏమయ్యాయి? నీట్ పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వీడియో!

నీట్ ప్రశ్నపత్రం లీక్, అనంతర పరిణామాలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు.

Update: 2026-07-22 10:41 GMT

నీట్ ప్రశ్నపత్రం లీక్, అనంతర పరిణామాలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ పై జాతీయస్థాయిలో నిరసనలు జరుగుతుంటే, మన ఏరియా (రాష్ట్రం)లో ఎందుకు అలాంటి నిరసనలు జరగడం లేదో తనకు అర్థం కావడం లేదంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మన వాళ్లకు బెనిఫిట్ షోలపై చూపినంత ఉత్సాహం, నీట్, సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీక్ అయినప్పుడు చూపించడం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. నీట్ పై ప్రత్యేకంగా కేతిరెడ్డి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నీట్ పరీక్షలపై కేతిరెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కేవలం 30 సెకెన్ల వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. దీంతో కేతిరెడ్డి వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. నేను మాట్లాడతాను, ప్రశ్నిస్తాను అన్నవారు కూడా ఈ విషయంలో ప్రశ్నించడం లేదని కేతిరెడ్డి ఆరోపించారు. బెనిఫిట్ షోలపై చూపుతున్న ఉత్సాహం పేపర్ లీకేజీలపై ఉండటం లేదని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, కేతిరెడ్డి తన వీడియోలో ఏ రాజకీయ పార్టీ, నాయకుడి పేరు ప్రస్తావించకపోయినా, జాతీయ స్థాయి పరీక్షల వైఫల్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడకపోవడాన్ని పరోక్షంగా నిలదీశారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే ప్రశ్నిస్తానంటూ చెప్పే పవన్ మాటలను ఉటంకిస్తూ ‘ప్రశ్నించే గొంతు’ ఏమైందంటూ కేతిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు భావిస్తున్నారు. కేతిరెడ్డి ఏ ఉద్దేశంతో వీడియో చేసినా, ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు ఆయన మాట్లాడరని, అందుకే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోందని అంటున్నారు.

నీట్ ప్రశ్నపత్రం లీకైన తర్వాత రీనీట్ నిర్వహించడం, దాని ఫలితాలు వెల్లడైనా ‘కాక్రోచ్ పార్టీ’ ఆందోళనలతో నీట్ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని అంటున్నారు. అంతేకాకుండా గత రెండు రోజులుగా నీట్ లీకేజీనే జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు. 20వ తేదీన నీట్ పరీక్ష వైఫల్యాన్ని నిరసిస్తూ కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించగా, 21న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ నివాసం ఎదుట మెరుపు ధర్నా జరిగింది. దీంతో ప్రస్తుతం ఏ నోట విన్నా నీట్ పైనే చర్చ జరుగుతోంది.

అయితే జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న ఈ అంశంపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ మాట్లాడకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు. అయితే రాష్ట్రంలో అధికార పక్షంలోని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించకపోవడం ఏంటంటూ కేతిరెడ్డి విమర్శలకు దిగితే, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. ఏదిఏమైనా కేతిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఉండటంతో ఆయన ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు.



Tags:    

Similar News