కుట్ర జరుగుతోందా? నీట్ ఇష్యూపై ఫారిన్ మీడియా కలగాపులగం వార్తల లెక్కేంటి?

ఇప్పటి వరకు దీన్ని చదువుతున్న వారంతా.. మోడీకి అనుకూలంగా ఈ కథనం ఉందన్న భావనకు రావొచ్చు.

Update: 2026-07-22 11:00 GMT

ఉన్నది ఉన్నట్లుగా.. జరుగుతున్నది జరుగుతున్నట్లుగా చెప్పటం మీడియా సంస్థలకు ఉండాల్సిన ప్రాధమిక లక్షణం. ప్రత్యేక కథనాల్లో ఎలాంటి పైత్యాల్ని ప్రదర్శించినా ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. జరుగుతున్న ఒక పరిణామం గురించి రిపోర్టింగ్ చేసేటప్పుడు.. సదరు ఉదంతంలో ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఏం జరుగుతోంది? లాంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానంగా సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష లీకేజీని నిరసిస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన అంశాన్నే తీసుకుందాం. ఇదో భారతీయ వ్యంగ్య రాజకీయ ఉద్యమన్న విషయం అందరికి తెలిసిందే.

తాజాగా దేశ రాజధానిలో నిర్వహిస్తున్న నిరసనలు.. ఆందోళనలు మొత్తం నీట్ పరీక్ష లీకేజీ.. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టటం..ఆయన ఆరోగ్యం అంతకంతకూ క్షీణించటం.. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం కావటం.. కేంద్రం స్పందించాలని కోరటం తెలిసిందే. ఆయన ఆరోగ్యం పెద్ద ఎత్తున క్షీణిస్తున్న వేళ.. ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించే వేళ.. పోలీసులు అక్కడి నిరసనకారులపై పెద్ద ఎత్తున బలప్రయోగం చేయటం.. ఈ సందర్భంగా చేపట్టిన లాఠీ ఛార్జ్ లో ఎప్పటిలానే పోలీసుల ఓవరాక్షన్ కనిపించింది.

కట్ చేస్తే.. జరిగింది ఇదైతే.. ఇప్పుడు జరుగుతున్నది.. ఈ ఆందోళనలు.. నిరసనల మీద విదేశీ మీడియా సంస్థలు తమ అంతర్జాతీయ పాఠకుల కోసం అందిస్తున్న వార్తలు ఎలా ఉన్నాయా? తమ వార్తల్ని ఎలా చెబుతున్నాయి? అందులోని అంశాలు ఏమేం ఉంటున్నాయి? వారు అందిస్తున్న వార్తలు.. కథనాల్లో వాస్తవాలు ఎన్ని? వాస్తవాలకు భిన్నమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయాన్ని తరచి చూస్తే షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. అర్థసత్యాలు.. విషయాల్ని కలగాపులగం చేస్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి.. తమ ఎజెండాను వార్తల రూపంలో వండి వారుస్తున్న తీరు చూస్తే.. ఇదంతా ఏమైనా ఒక కుట్ర? అన్న సందేహం రాక మానదు. భారతదేశం మీద ఏదైనా వ్యూహాత్మకంగా దాడి జరుగుతుందా? అన్న సందేహం కలుగక మానదు.

ఇప్పటివరకు దీన్ని చదువుతున్న వారంతా.. మోడీకి అనుకూలంగా ఈ కథనం ఉందన్న భావనకు రావొచ్చు. కానీ.. ఇక్కడ మోడీ విధానాల్ని మేం సమర్థించటం లేదు. ఆందోళకారులపై జరిగిన లాఠీ ఛార్జ్ తప్పు కాదని చెప్పటం లేదు. సోనమ్ వాంగ్ చుక్ నిరసనకు మందే మోడీ సర్కారు స్పందించి ఉంటే బాగుండేదన్న భావన మాకుంది. ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు పక్షపాత ధోరణితో వార్తల్ని అందిస్తూ.. తప్పుడు ప్రచారాలు చేసే వారి జట్టులో మేం కలవాలని అనుకోవటం లేదు. ముందే చెప్పినట్లు.. ఉన్నది ఉన్నట్లుగా.. జరుగుతున్నది జరుగుతున్నట్లుగా చెప్పటమే ఈ కథనం ఉద్దేశం.

అందుకు తగ్గట్లే.. వాస్తవాల్ని మాత్రమే మీకు అందించాలన్నది మా ఉద్దేశం. ఎందుకంటే.. తప్పుడు సమాచారాన్ని చేరవేసే ఎంత పెద్ద సంస్థ అయినా.. తప్పుడు అభిప్రాయాలు పెరిగి పెద్దయ్యేలా జరిగే కుట్రల్ని దేశ ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇక్కడో సున్నటి గీత ఒకటి ఉంది. అది మోడీ సర్కారుకు అనుకూలంగా వాదనలు వినిపించటం.. వాస్తవాల్నిమాత్రమే పాఠకులకు చెప్పటం. మేం రెండో అంశాన్ని ప్రాతిపదికన విషయాల్ని.. వివరాల్ని అందించాలని భావిస్తున్నాం. అందుకే.. ఆధారాల సహా మీ ముందు ఉంచుతున్నాం.

పలు విదేశీ మీడియా సంస్థలు తమ హెడ్ లైన్ లో మాత్రం భారత విద్యార్థుల నిరసనలు.. మోడీ సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి అని పేర్కొంటూ.. సదరు కథనంలో మాత్రం జరుగుతున్న విషయాల్ని కలగాపులగం చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీని రాజీనామా చేయాలన్న డిమాండ్ పై ఆందోళనలు జరుగుతున్న అభిప్రాయం కలిగేలా వార్తలు ఉండటం గమనార్హం.

అల్ జజీరా టీవీ రిపోర్టింగ్ కు సంబంధించి చూస్తే.. ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చిన విజువల్స్ ను చూపిస్తూ.. దాని బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లోనూ.. హెడ్ లైన్స్ లోనూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా కోసం వేలాది మంది విద్యార్థుల నిరసన అంటూ ప్రసారం చేయటంలో ఉద్దేశం ఏంటి? నిజానికి మంగళవారం మధ్యాహ్నం తర్వాతనే కాంగ్రెస్ ఈ అంశంపై నిరసనలు చేపడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం తెలిసిందే. దానిని.. వెంటనే తాను ప్రసారం చేసే వార్తల్లో నిరసన చేపట్టే విద్యార్థుల డిమాండ్ గా చెప్పటం దేనికి నిదర్శనం?

బ్రిటన్ కు చెందిన బీబీసీ విషయాన్నే తీసుకుందాం. అంతర్జాతీయంగా ఈ మీడియా సంస్థకు ఉన్న విశ్వసనీయతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆచితూచి వార్తల్ని ఇస్తుందన్న పేరున్న ఈ మీడియా సంస్థ.. తాజా ఉదంతాన్ని ఎలా చూపిస్తుందన్న విషయంలోకి వెళితే.. ‘భారత పరీక్షల కుంభకోణం విస్తృత నిరసనలకు, రాజకీయ సంక్షోభానికి దారి తీసింది’ అని పేర్కొంటూ.. తన రిపోర్టింగ్ లో మాత్రం.. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు.. పోలీసుల లాఠీ ఛార్జ్ ను చూపిస్తూ.. భారతదేశంలోని మొత్తం నిరుద్యోగ సంక్షోభం..వ్యవస్థాగత వైఫల్యంగా జనరలైజ్ చేయటం ద్వారా వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం జరిగిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గార్డియన్ లాంటి మీడియా సంస్థలకు చెందిన కొన్ని కథనాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్య అణిచివేతగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది.

ఇంతేనా.. ఇంతకు మించి చాలానే జరుగుతున్నది. ఒక విదేశీ మీడియా అనుబంధ ఇన్ స్టా హ్యాండిల్ లో విచిత్రమైన కథనం ఒకటి ప్రసారమై.. వైరల్ అయ్యింది. దాని సారాంశం..కాక్రోచ్ మూవ్ మెంట్ నిరసనకారులపై బ్లడీ క్రాక్ డౌన్ (అంటే రక్తపాతం) చేయాల్సిందిగా హోం మంత్రి అమిత్ షా .. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఆదేశించారన్న దుర్మార్గమైన నెరేషన్ ను అసోసియేటెడ్ ప్రెస్ పేరును తప్పుగా కోట్ చేస్తూ.. ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయతను వాడుకుంటూ తన దుర్మార్గమైన ఎజెండాతో రాసేసిన వైనం చూస్తే.. బరితెగింపు ఎంతగా ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా చేస్తుంది. వాస్తవానికి అలాంటి ఆదేశాలు ఏవీ లేవన్న విషయం తెలిసిందే.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని సీజేపీ ప్రతినిధి టీం కలిసి చర్చలు జరిపిన విషయాల్ని దేశీయ మీడియా కవర్ చేయగా.. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని విదేశీ మీడియా దాదాపుగా దాచేయటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. ఢిల్లీ వీధుల్లో జరిగిన ఆందోళనలు.. లాఠీ ఛార్జ్.. రాహుల్ గాంధీ అరెస్టు విజువల్స్ ను గ్లోబల్ స్క్రీన్స్ మీద హైలెట్ చేయటం దేనికి నిదర్శనం? అన్నది ప్రధాన ప్రశ్న.

అమెరికా కు చెందిన ది న్యూయార్క్ టైమ్స్.. వాషింగ్టన్ పోస్ట్ లాంటి మీడియా సంస్థల రిపోర్టింగ్ ను ఓవరాల్ గా చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. నీట్ పై ఢిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసనలు, ఆందోళనలను రాజకీయ అంశాలతో కలగలిపి కలగాపులగం చేయటానికి నిదర్శనంగా చెప్పే క్రమంలో అమెరికాకు చెందిన మీడియా సంస్థల రిపోర్టింగ్ చూస్తే విషయం అర్థమవుతుంది. ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో 'ఈ పరీక్షల లీకేజీ నిరసనలు మోదీ సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభంగా మారి, దేశంలోని లోతైన వ్యవస్థాగత అవినీతిని ఎండగడుతున్నాయి' అని రాసింది.

అదే సమయంలో వాషింగ్టన్ పోస్ట్ ఒకడుగు ముందుకు వేసి.. 'విద్యార్థుల ఆవేదన ప్రతిపక్షాల డిమాండ్లతో కలిసిపోయి, మోదీ అధికారానికి తక్షణ ముప్పుగా మారింది' అని పేర్కొనటం దేనికి నిదర్శనం? విద్యార్థుల ఆవేదనను, ప్రతిపక్షాల పొలిటికల్ స్టేట్‌మెంట్లను కలిపేసి రిపోర్టు చేయటం.. మోడీ సర్కారు తీవ్రమైన సంక్షోభంలో ఉందని చెప్పటం వెనుక ఉద్దేశం ఏంటి? నీట్ నిరసనలకు సంబంధించి మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడిందన్న వాస్తవాల్ని దాచటం మా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. అదే సమయంలో లేని అంశాల్ని తెర మీదకు తీసుకొస్తూ.. భారతదేశంలో వ్యవస్థాగతమైన అవినీతి.. మానవహక్కుల ఉల్లంఘనలతో ముడిపెట్టి వ్యాసాలు రాయటంతో పాటు.. ప్రతిపక్షాల పొలిటికల్ స్టేట్ మెంట్లను.. విద్యార్థుల ఆవేదనను కలిపేసి రిపోర్టు చేయటం దేనికి నిదర్శనం? విద్యార్థులు కావొచ్చు.. మరే ఇతర రంగానికి చెందిన వారి నిరసన ర్యాలీలను.. మోడీ అధికారానికి ముంచుకొస్తునన ముప్పుగా పేర్కొనటం వెనుక ఉద్దేశమేంటి?

జర్మనీ కి చెందిన డాయిష్ వెల్లె మీడియా రిపోర్టింగ్ చూస్తే.. శాంతియుత నిరసనకారులపై ప్రభుత్వ నియంతృత్వ దాడి అన్న నెరేషన్ లో వార్తలు చెప్పటం కనిపిస్తుంది. జర్మనీ ప్రభుత్వ నిధులతో నడిచే ఈ మీడియా సంస్థ పోలీసు చర్యలను అత్యంత క్రూరమైనవిగా చిత్రీకరించే ప్రయత్నం కనిపిస్తుంది. ఫ్రాన్స్ 24 లాంటి మీడియా సంస్థ ప్రసారం చేసే వార్తల్ని పరిశీలిస్తే.. యువత మొత్తం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందన్నభావన కలిగేలా రిపోర్టు చేయటం కనిపిస్తుంది. నీట్ పై జరిగిన నిరసనలు.. ఆందోళనల్ని జాతీయ రాజకీయ సంక్షోభంగా మార్చేయటం కనిపిస్తుంది. ఎందుకిలా చేస్తాయన్న విషయంలోకి వెళితే.. భారతదేశంలోని విద్యాశాఖ అంతర్గత లోపాల కంటే కూడా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు.. భారతదేశంలో అల్లర్లు అనే భావన కలిగించేలా వార్తల వంటకంతో అంతర్జాతీయ వీక్షకులను ఆకర్షించేలా.. సంచలనంగా మారేలా ప్రయత్నిస్తున్నాయని చెప్పక తప్పదు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్ని చూస్తే.. భారతదేశం ఆర్థికంగా.. రాజకీయంగా ఎదురుగుతున్న తరుణంలో దేశంలో అంతర్గత శాంతిభద్రతలపై కొత్త సందేహాలు కలిగేలా.. దేశ ప్రతిష్టను తగ్గించేలా తమ రిపోర్టింగ్ ఉండేలా చేస్తున్నాయన్న విమర్శ ఉంది. మొత్తంగా చూస్తే.. నీట్ నిరసనలు.. ఆందోళనకారులపై పోలీసులు చేసిన లాఠీ ఛార్జ్ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు భారత ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన తాజా డిమాండ్ ను అసరాగా చేసుకొని.. పలు విదేశీ మీడియా సంస్థలు వండి వార్చేస్తున్న కథనాలు.. అందిస్తున్న వివరాల్ని చూస్తే..కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News