ఢిల్లీలో చంద్రబాబు.. కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని, అమిత్ షా
ముఖ్యమంత్రి చంద్రబాబు దేశరాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు దేశరాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. నీట్ పేపరు లీక్ పై విపక్షాలు నిరసనలు ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ఒకసారి విపక్షాల వ్యతిరేకతతో వీగిపోయిన ఈ బిల్లులను ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం లభించేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు.
గత ఏప్రిల్ లో నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 2/3 వంతు మెజార్టీ లేక మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాల అనంతరం జాతీయస్థాయిలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో కేంద్రం లోక్ సభలో 2/3 వంతు మెజార్టీకి చేరువ అయిందని అంటున్నారు. అయితే ఈ మ్యాజిక్ మార్కును చేరుకోడానికి కేంద్రానికి ఇంకా 11 మంది సభ్యులు అవసరం అవుతారని చెబుతున్నారు. కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్న వైసీపీకి చెందిన 4 ఎంపీలు బిల్లులకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఇంకా ఏడుగురి మద్దతు అవసరం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మద్దతు ఇస్తున్న వారు వైఖరి మార్చుకోకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకోవాలని కేంద్రం భావిస్తోందని చెబుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సేవలు, అనుభవం ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భావిస్తున్నారని సమాచారం.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం విషయంలో విపక్షంలోని కొన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో జనాభా ఆధారంగా కాకుండా ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు ఆధారంగా 50 శాతం పెంచేలా బిల్లు రూపొందిస్తే ఆమోదించే విషయంలో విపక్షంలోని కొన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని అంటున్నారు. దీంతో కేంద్రం వైఖరిని వివరించి విపక్షాలను ఒప్పించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ విషయమై సమాజ్ వాది, శరద్ పవార్ ఎన్సీపీతో చర్చించాలని కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర పెద్దల పిలుపుతో బుధవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం తిరిగి అమరావతికి వెళతారని చెబుతున్నారు.
మరోవైపు ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక వచ్చేనెల 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారని చెబుతున్నారు. అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతారని సమాచారం. ఈ ఇద్దరితో భేటీలో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ, గవర్నర్ల నియామకంపైనా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రానికి మరో మంత్రి పదవి కేటాయించడంతోపాటు అదనంగా గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్ర పెద్దలను సీఎం చంద్రబాబు కోరనున్నారని చెబుతున్నారు. ఇక ప్రధాని, హోంమంత్రితోపాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలుస్తారని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ కట్టర్ తో సీఎం అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తోనూ సీఎం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.