సౌదీకి మరో షాక్.. హౌతీలతో అమెరికా డైరెక్ట్ డీల్‌కు ప్లాన్?

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న వేళ సౌదీ అరేబియాకు అమెరికా నుంచి అనూహ్య పరిణామం ఎదురైనట్లు తెలుస్తోంది.

Update: 2026-09-18 13:30 GMT

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న వేళ సౌదీ అరేబియాకు అమెరికా నుంచి అనూహ్య పరిణామం ఎదురైనట్లు తెలుస్తోంది. యెమెన్‌లో హౌతీల దాడులను ఎదుర్కొంటున్న సౌదీకి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వడంపై అమెరికా వెనుకడుగు వేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా అమెరికా అధికారులు హౌతీ ప్రతినిధులతో ఒమన్‌లో రహస్యంగా చర్చలు జరిపినట్లు రౌటర్స్ సంస్థ వెల్లడించింది.

రిపోర్టుల ప్రకారం.. అమెరికా అధికారులు, యెమెన్‌కు చెందిన హౌతీ ప్రతినిధుల మధ్య ఒమన్ రాజధాని మస్కట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో ఈ చర్చలు జరిగాయి. ఒమన్ ప్రభుత్వం ఈ సమావేశానికి మధ్యవర్తిత్వం చేసినట్లు ఐదు వర్గాలను ఉటంకిస్తూ రౌటర్స్ తెలిపింది. సెప్టెంబర్ 16న ఈ చర్చల విషయం బయటకు వచ్చింది.

అమెరికా-హౌతీల మధ్య ఏం చర్చ జరిగింది?

సమావేశంలో హౌతీ ప్రతినిధులు అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం తమకు లేదని చెప్పినట్లు సమాచారం. అలాగే 2025లో అమెరికా-హౌతీల మధ్య కుదిరిన కాల్పుల విరమణను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని వారు హామీ ఇచ్చినట్లు రౌటర్స్ వర్గాలు వెల్లడించాయి. ఒక వర్గం ప్రకారం.. ఇజ్రాయెల్ నౌకలు, అంతర్జాతీయ వాణిజ్య నౌకలను కూడా లక్ష్యంగా చేసుకోబోమని హౌతీలు చెప్పినప్పటికీ సౌదీకి చెందిన నౌకల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని పేర్కొంది.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ సమావేశాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఎర్ర సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, సముద్ర భద్రతను నిర్ధారించడం అమెరికా ప్రధాన ప్రయోజనాల్లో భాగమని తెలిపింది.

సౌదీకి ఎందుకు ఆందోళన?

యెమెన్‌లో హౌతీలతో సౌదీ మద్దతు ఉన్న బలగాల మధ్య పోరు తీవ్రతరం అవుతోంది. ఇటీవల హౌతీలు యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతంలో కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడుల ముప్పు కొనసాగుతోంది. సౌదీ తన క్షిపణి రక్షణ వ్యవస్థల్లో ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటూ ఇతర దేశాల నుంచి కూడా సాయం కోరుతున్నట్లు తెలిసింది..

ఈ నేపథ్యంలో అమెరికా నేరుగా సౌదీ తరఫున హౌతీలపై సైనిక చర్యకు దిగకుండా.. హౌతీలతో చర్చల ద్వారా తమ నౌకలు, అంతర్జాతీయ నౌకాయానానికి రక్షణ కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అమెరికా-హౌతీల మధ్య పూర్తిస్థాయి కొత్త ఒప్పందం కుదిరిందని అధికారిక ప్రకటన ఇంకా లేదు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చినది రహస్య చర్చలు, కాల్పుల విరమణ కొనసాగింపుపై హామీలకు సంబంధించిన సమాచారం మాత్రమే.

ఇక సౌదీ మాత్రం హౌతీల నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొంటోంది. దీంతో అమెరికా-హౌతీల మధ్య నేరుగా చర్చలు జరగడం.. అదే సమయంలో సౌదీకి ప్రత్యక్ష సైనిక జోక్యం విషయంలో వాషింగ్టన్ జాగ్రత్తగా వ్యవహరించడం.. మధ్యప్రాచ్యంలోని మారుతున్న దౌత్య సమీకరణాలకు సంకేతంగా మారింది.

Tags:    

Similar News