అరెస్ట్ అయిన ఎన్నారై మోసం 336 కోట్లు.. బాధితుల్లో టేల‌ర్ స్విఫ్ట్ భ‌ర్త

అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత పాప్ సెన్సేషన్ టేలర్ స్విఫ్ట్ భర్త, ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ ట్రావిస్ కెల్స్‌ను ఒక భారతీయ సంతతి వ్యక్తి భారీ ఆర్థిక మోసానికి గురిచేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది

Update: 2026-09-18 10:08 GMT

అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత పాప్ సెన్సేషన్ టేలర్ స్విఫ్ట్ భర్త, ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ ట్రావిస్ కెల్స్‌ను ఒక భారతీయ సంతతి వ్యక్తి భారీ ఆర్థిక మోసానికి గురిచేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. టెక్సాస్ కేంద్రంగా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ నడిపిన సిద్ధార్థ్ జవహర్ అనే 38 ఏళ్ల వ్యక్తి పాంజీ స్కీమ్ ద్వారా సుమారు 35 మిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ మోసంలో ట్రావిస్ కెల్స్ కూడా బాధితుడిగా నష్టపోగా.. ఈ కేసుకు సంబంధించి నిందితుడికి అమెరికన్ ఫెడరల్ కోర్టు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు భారీ జరిమానాను కూడా ఆదేశించింది.

ఇలాంటి ఆర్థిక నేరాలు -మోసపూరిత ఘటనలు తాత్కాలికంగా మొత్తం ప్రవాస భారతీయ (ఎన్నారై) సమాజంపై, వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ప్రతిష్టపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వ్యక్తి చేసే తప్పులకు యావత్ జాతిని ముడిపెట్టే ధోరణి స్థానిక మీడియాలో అధిక‌మ‌వ్వ‌డం వల్ల.. దశాబ్దాలుగా ఎన్నారైలు కష్టపడి సంపాదించుకున్న నమ్మకానికి ఒక్కసారిగా తూట్లు పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రగామి సంస్థలను నడిపిస్తూ.. అత్యున్నత ప్రమాణాలతో జీవిస్తున్న కోట్లాది మంది భారతీయుల నిజాయితీని కూడా ఇలాంటి ఘటనలు ప్రశ్నార్థకం చేసే పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే కొద్దిమంది వ్యక్తులు చేసే ఇలాంటి చట్టవిరుద్ధమైన పనుల ఆధారంగా కోట్లాది మంది ప్రవాస భారతీయుల నిజాయితీని అంచనా వేయలేము. విదేశీయులతో పోలిస్తే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలలో భారతీయ ఎన్నారైలు అత్యంత జాగ్రత్తగా చట్టబద్ధంగా, పద్ధతిగా జీవిస్తున్నారనడానికి ఎన్నో బలమైన ఆధారాలున్నాయి. అడపా దడపా జరిగే ఇలాంటి చెదురుముదురు మోసపూరిత ఘటనలు మినహాయిస్తే.. ప్రవాస భారతీయుల జీవన విధానం స్థానిక సమాజానికి ఎప్పుడూ సురక్షితమైన వాతావరణాన్నే అందిస్తుంది.

స్థానిక చట్టాలను గౌరవిస్తూ ఉన్నత విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా .. అలాగే పారిశ్రామికవేత్తలుగా ఎదిగే లక్షలాది మంది భారతీయుల అచంచలమైన విజయాలు ఇలాంటి అరుదైన మోసపూరిత ఘటనల నీడను సులభంగా అధిగమిస్తాయి. కొద్దిమంది చేసే అసాంఘిక పనుల కంటే మెజారిటీ భారతీయుల నిబద్ధత, నైతిక విలువలు ..దేశాభివృద్ధికి వారు ఇస్తున్న సహకారమే సమాజంలో బలమైన ముద్ర వేస్తుంది. వ్యక్తిగత స్వార్థంతో కూడిన నేరాలు కొందరికే పరిమితమని.. ఎన్నారైల సమష్టి కృషి , క్రమశిక్షణే ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తుందని వారి విజయాలు నిరూపిస్తుంటాయి.

సమగ్రంగా పరిశీలిస్తే.. విదేశాలలో భారతీయ ఎన్నారైలు పద్ధతిగా, చట్టప్రకారంగా జీవిస్తూ ఆయా దేశాల ప్రగతికి వెన్నెముకగా నిలుస్తున్నారనేది కాదనలేని సత్యం. వ్యక్తిగత తప్పులను జాతికి ఆపాదించడం సరైన పద్ధతి కాదని.. మెజారిటీ భారతీయుల కష్టించే తత్వమే ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి నిజమైన కీర్తిని తెచ్చిపెడుతోందని చెప్పవచ్చు.

336 కోట్ల మోసం గ‌నుక‌నే ఇంత‌టి ప్ర‌చారం:

అమెరికాలో జరిగిన సుమారు 35 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 336 కోట్లు) భారీ పాంజీ స్కీమ్ కుంభకోణంలో ప‌లువురు అథ్లెట్లు మోస‌పోయారు. టెక్సాస్ కేంద్రంగా `స్విఫ్టార్క్ క్యాపిటల్` పేరుతో ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని నడిపిన సిద్ధార్థ్ జవహర్ (38) అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి అమెరికన్ ఫెడరల్ కోర్టు నిందితుడికి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు.. బాధితులకు మొత్తం 31.35 మిలియన్ డాలర్లు రికవరీ కింద చెల్లించాలని ఆదేశించింది.

ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన కోట్లాది రూపాయలను సరైన వ్యాపారాల్లో పెట్టకుండా.. కేవలం కొద్ది మొత్తాన్ని మాత్రమే పెట్టుబడి పెట్టి మిగతా డబ్బును లగ్జరీ జీవితం కోసం నిందితుడు దుర్వినియోగం చేశాడు. కొత్త ఇన్వెస్టర్ల నుంచి వచ్చే డబ్బుతో పాత వారికి లాభాలు ఇస్తున్నట్లు నమ్మిస్తూ ఈ పాంజీ స్కీమ్‌ను నడిపాడు. 2021 నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ట్రావిస్ కెల్స్‌తో పాటు పలువురు ప్రముఖ అథ్లెట్లు ఈ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టగా.. ఈ కుంభకోణంలో ట్రావిస్ కెల్స్‌కు ఎలాంటి ప్రమేయం లేదని.. ఆయన కేవలం మోసపోయిన ఇన్వెస్టర్లలో ఒకరని అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News