గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మరో షాక్..

అమెరికాలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని.. గ్రీన్‌కార్డ్‌తో తమ జీవితాల్లో స్థిరత్వం లభిస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై మళ్ళీ నల్లటి మేఘాలు అలుముకున్నాయి.

Update: 2026-09-09 11:42 GMT

అమెరికాలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని.. గ్రీన్‌కార్డ్‌తో తమ జీవితాల్లో స్థిరత్వం లభిస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై మళ్ళీ నల్లటి మేఘాలు అలుముకున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి కంపెనీల పురోగతికి ప్రాణం పెట్టే టెక్కీలకు.. అమెరికా డ్రీమ్ అంత తేలికగా నెరవేరేలా కనిపించడం లేదు. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు అమెరికా కార్మిక శాఖ (యూఎస్.డీఓఎల్) తీసుకున్న తాజా నిర్ణయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

కాగ్నిజెంట్‌కు చెందిన కొత్త పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (పీఈఆర్ఎం) దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై ఆంక్షలు విధించినట్లు వార్తలు వెలువడటంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంపెనీకి చెందిన హెచ్1బీ, పీఈఆర్ఎం నియామక ప్రక్రియలపై విచారణ పూర్తయ్యే వరకు కొత్త పీఈఆర్ఎం ఫైలింగ్స్ ముందుకు సాగవని తెలుస్తోంది. గ్రీన్‌కార్డ్ వైపు పడే మొదటి అడుగు 'పీఈఆర్ఎం'. ఆ తొలి అడుగే పడకుండా ఆగిపోతే తాము అమెరికాలో మరిన్ని ఏళ్లు అనిశ్చితి మధ్య గడపాల్సి వస్తుందని టెక్కీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ పన్నులు చెల్లిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ శ్రమను ధారపోస్తున్నప్పటికీ.. ప్రతి చిన్న మార్పుకూ తమ భవిష్యత్తు తలకిందులవుతుండటంపై టెక్కీల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థల సరసన నిలిచే కాగ్నిజెంట్ నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలోనే వేలాది మందికి హెచ్1బీ అనుమతులు లభించాయి. అందులో మెజారిటీ నిపుణులు భారతీయులే కావడం వల్ల ఈ తాజా పరిణామం నేరుగా వారి జీవితాలపైనే తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇది కేవలం ఒక్క కాగ్నిజెంట్ కథ మాత్రమే కాదు. 'క్లౌడెరా' అనే మరో టెక్ కంపెనీపై కూడా అమెరికా ప్రభుత్వం 180 రోజుల పాటు పీఈఆర్ఎం దరఖాస్తులను నిలిపివేస్తూ చర్యలు తీసుకుంది. స్వదేశంలో ఉన్న కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎప్పటికైనా గ్రీన్‌కార్డ్ వస్తుందనే ఒక్క చిన్న ఆశతో ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలకు ఇటువంటి వార్తలు చావుదెబ్బలా మారుతున్నాయి. ఇప్పటికే పీఈఆర్ఎం ప్రక్రియలో ఉన్నవారి పరిస్థితి ఏంటనే దానిపై కూడా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

సంస్థల నిబంధనల విచారణల నడుమ.. ఏ పాపం ఎరుగని సాధారణ భారతీయ ఉద్యోగుల జీవితాలు, వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం తీవ్ర విచారకరం. కాగ్నిజెంట్ యాజమాన్యం త్వరితగతిన స్పందించి ఈ సమస్యకు ఒక స్పష్టమైన పరిష్కారం చూపుతుందని, తమ కలల ప్రాసెస్ మళ్లీ పట్టాలెక్కుతుందని వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News