2026లో హెచ్1బీ స్లాట్లు ఖాళీ లేవు.. భారత్‌లోనే చిక్కుకుపోయిన వీసా హోల్డర్లు

అమెరికాలో స్థిరపడి ప్రముఖ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ హెచ్1బీ వీసా హోల్డర్లకు వీసా అపాయింట్‌మెంట్ కొరత మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Update: 2026-09-18 10:30 GMT

అమెరికాలో స్థిరపడి ప్రముఖ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ హెచ్1బీ వీసా హోల్డర్లకు వీసా అపాయింట్‌మెంట్ కొరత మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సొంత ఊళ్లకు, కుటుంబ కార్యక్రమాలకు లేదా సెలవులపై భారత్‌కు వచ్చిన వేలాది మంది టెక్ నిపుణులు తిరిగి అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసా స్టాంపింగ్ స్లాట్లు దొరక్క ఇక్కడే చిక్కుకుపోయారు. 2026లో మిగిలిన కాలానికి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలోని అమెరికన్ కాన్సులేట్లలో సాధారణ ఇంటర్వ్యూ స్లాట్లు దాదాపుగా అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పోర్టల్‌ను తెరవగానే దరఖాస్తుదారులకు నిరంతరం “నో స్లాట్స్ అవైలబుల్” అనే సందేశమే దర్శనమిస్తుండటంతో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. రెడిట్ వంటి సోషల్ మీడియా వేదికల్లో కాన్సులేట్ స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సంక్షోభం వెనుక ప్రధానంగా గత ఏడాది చివర్లో జరిగిన పరిణామాలు ఉన్నాయి. డిసెంబర్ 2025లో అనేక వీసా ఇంటర్వ్యూలు అకస్మాత్తుగా రద్దుకావడం.. ఆ తర్వాత ఆ అపాయింట్‌మెంట్లను 2026లోకి రీషెడ్యూల్ చేయడంతో కొత్త స్లాట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దానికి తోడు, అమెరికా విదేశాంగ శాఖ చేపట్టిన సోషల్ మీడియా స్క్రీనింగ్ ప్రక్రియ వల్ల ఒక్కో దరఖాస్తు పరిశీలనకు ఎక్కువ సమయం పడుతుండటం వ్యవస్థపై ఒత్తిడిని పెంచింది. గతంలో భారత్‌లో స్లాట్లు దొరకనప్పుడు కెనడా, మెక్సికో లేదా ఇతర మూడో దేశాలకు వెళ్లి వీసా స్టాంపింగ్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ కొత్త ఆంక్షల వల్ల ఆ థర్డ్-కంట్రీ స్టాంపింగ్ మార్గాలు కూడా మూతపడ్డాయి. దీనికి తోడు హెచ్1బీ తో పాటు ఓ, ఎల్ వంటి ఇతర ప్రాధాన్య నాన్-ఇమిగ్రెంట్ వీసాలకు కూడా అపాయింట్‌మెంట్లు లభించకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.

ఈ అనిశ్చితి వల్ల భారతదేశంలో ఆగిపోయిన ఉద్యోగులు అమెరికాలోని తమ ప్రాజెక్టులు, ఉద్యోగాలు ఎక్కడ ప్రమాదంలో పడతాయోనని తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో అపాయింట్‌మెంట్ క్యాలెండర్లు 2027 వరకు వెళ్లిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న హెచ్1బీ హోల్డర్లు కూడా స్వదేశానికి వస్తే తిరిగి ఎప్పుడు వెళ్తామో తెలియని పరిస్థితి ఉండటంతో తమ ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారు. కాన్సులేట్ల నుంచి కొత్త స్లాట్ల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు భారత్‌కు రాకపోవడమే శ్రేయస్కరమని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారు తగిన ఆధారాలతో ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం మినహా వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

Tags:    

Similar News