స్కిన్ కలర్ చూసి ఆపేశారు.. అమెరికా ఎయిర్ పోర్టులో భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యాపారవేత్తకు షాక్..

అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టడమంటే ఒకప్పుడు ఎన్నో ఆశలు, మరెన్నో కలలు.

Update: 2026-09-09 06:48 GMT

అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టడమంటే ఒకప్పుడు ఎన్నో ఆశలు, మరెన్నో కలలు. కానీ అదే అమెరికా మాతృభూమి అయినప్పటికీ.. చర్మం రంగును బట్టి గుర్తింపును, దేశభక్తిని శంకించే పరిస్థితులు వస్తే? ఆ వేదన.. ఆవేదన ఎలా ఉంటుందో వర్ణించలేం. సరిగ్గా అలాంటి ఒక నిరాశజనకమైన, ఆందోళనకరమైన సంఘటనే భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యాపారవేత్త, ప్రముఖ రచయిత నెయిల్ బక్షి కి ఎదురైంది.

అమెరికాలోనే పుట్టి పెరిగిన బక్షికి ఆ దేశ పౌరసత్వం ఉంది. అంతేకాదు అమెరికా సరిహద్దుల్లో ముందస్తు భద్రతా అనుమతులు పొందిన అత్యంత నమ్మకమైన ప్రయాణికులకు ఇచ్చే ‘గ్లోబల్ ఎంట్రీ’ సదుపాయం కూడా ఆయనకు ఉంది. ఇటీవల ఆయన గ్రీన్‌లాండ్‌లో హాలిడే ముగించుకుని ఎంతో ఉత్సాహంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. కానీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. బోర్డర్ సెక్యూరిటీ అధికారులు ఆయనను అడ్డుకున్నారు.

సాధారణంగా జరిగే ‘రాండమ్ సెక్యూరిటీ చెక్’ అని అధికారులు కొట్టిపారేసినా అక్కడ జరిగిన పరిణామాలు మాత్రం బక్షి మనసును తీవ్రంగా గాయపరిచాయి. ఆయనను ప్రత్యేకంగా ఫ్రిస్కింగ్ చేసి, ఒక రకమైన అనుమానితుడిలా ప్రత్యేక గదికి తీసుకెళ్లారు. గంటల తరబడి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత జీవితం, కొన్ని సంస్థలతో ఆయనకున్న సంబంధాలపై నిలదీశారు. టీనేజ్ వయసు నుంచి తనిఖీలు ఎదుర్కొంటున్నా ఈసారి అధికారుల ప్రవర్తనలో కనిపించిన అసహనం, అనుమానం ఆయనను తీవ్రంగా కలచివేశాయి.

"నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేశారు? కేవలం నా జాతి, నా చర్మం రంగు కారణంగానేనా?" అని బక్షి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కమ్యూనిటీని ఆలోచనలో పడేసింది. నిజంగానే అగ్రరాజ్యంలో బ్రౌన్ స్కిన్ ఒక నేరంగా మారుతోందా? గ్లోబల్ ఎంట్రీ కార్డు ఉన్నప్పటికీ నిష్కళంకమైన రికార్డు ఉన్నప్పటికీ కేవలం రూపురేఖలను చూసి వివక్ష చూపించడం ఎంతవరకు న్యాయం?

అధికారులు చివరకు ఆయనను విడిచిపెట్టినప్పటికీ ఆ క్షణంలో ఆయన ఎదుర్కొన్న మానసిక వేదన, అవమాన భారం మాత్రం అలాగే ఉండిపోయాయి. అమెరికాను సొంత దేశంగా భావించి బతుకుతున్న ఎందరో మైనారిటీలకు.. ముఖ్యంగా భారతీయ మూలాలున్న పౌరులకు ఈ ఘటన ఒక రకమైన అభద్రతా భావాన్ని కలిగించింది.

ఒక వ్యక్తి చేసిన ఆరోపణలతోనే బోర్డర్ అధికారుల వ్యవస్థ మొత్తాన్ని తప్పుపట్టలేము..అధికారిక వివరణ వస్తేనే ఇందులో నిజానిజాలు స్పష్టమవుతాయి. కానీ, ఎయిర్‌పోర్టుల్లో భద్రత పేరుతో జరిగే ఇలాంటి సంఘటనలు సదరు ప్రయాణికుల మనసుపై తీరని ముద్ర వేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News