అమెరికాలో హత్య చేసి.. పారిపోయి ఇండియాకొచ్చి.. 8 నెలలుగా దాగుడు మూతలు.. చివరకు దొరికాడిలా..
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఎనిమిది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు అర్జున్ శర్మను తెలంగాణ పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో 27 ఏళ్ల నిఖితా రావు గోదిశాలను హత్య చేసిన కేసులో అర్జున్‌పై అమెరికా అధికారులు ఇప్పటికే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలు మోపారు. తాజాగా అతడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా నుంచి వచ్చిన అప్పగింత అభ్యర్థనపై తదుపరి ప్రక్రియ కొనసాగుతోంది.
న్యూ ఇయర్ వేళ దారుణం
2025 డిసెంబర్ 31 రాత్రి మేరీల్యాండ్‌లోని కొలంబియా ప్రాంతంలో నిఖితా హత్యకు గురైనట్లు అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖితా అదృశ్యమైనట్లు జనవరి 2న అర్జున్ శర్మే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను చివరిసారిగా డిసెంబర్ 31న తన అపార్ట్‌మెంట్‌లో చూసినట్లు అతడు పోలీసులకు తెలిపాడు.
అయితే మరుసటి రోజే పోలీసులు అర్జున్ అపార్ట్‌మెంట్‌లో నిఖితా మృతదేహాన్ని గుర్తించారు. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిఖితా అదృశ్యంపై ఫిర్యాదు చేసిన రోజే అర్జున్ అమెరికా నుంచి భారత్‌కు విమానంలో వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఆర్థిక వివాదమే కారణమా?
నిఖితా కుటుంబ సభ్యుల ప్రకారం.. అర్జున్‌తో ఆమెకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. అర్జున్, అతడి కుటుంబ సభ్యులు నిఖితా కుటుంబం నుంచి డబ్బు తీసుకున్నారని ఆమె తండ్రి ఆరోపించారు. డబ్బు తిరిగి చెల్లించే విషయంలో విభేదాలు తలెత్తినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అమెరికా పోలీసులు అర్జున్‌ను నిఖితా మాజీ బాయ్‌ఫ్రెండ్‌గా పేర్కొన్నప్పటికీ.. నిఖితా తండ్రి మాత్రం ఆ వాదనను ఖండించారు. అర్జున్ ఆమె మాజీ ఫ్లాట్‌మేట్ మాత్రమేనని తెలిపారు. ఇద్దరూ గతంలో ఇతర స్నేహితులతో కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసించారని ఆ తర్వాత నిఖితా ప్రత్యేకంగా మరో అపార్ట్‌మెంట్‌కు మారిందని చెప్పారు.
అమెరికా నుంచి భారత్‌కు పరార్
నిఖితా మృతదేహం లభించిన తర్వాత అమెరికా అధికారులు అర్జున్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతడిపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలు నమోదు చేశారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో అతడి కోసం గాలింపు కొనసాగింది.
ఈ క్రమంలో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు, అమెరికా అధికారుల నుంచి వచ్చిన సమాచారంతో తెలంగాణ పోలీసులు అర్జున్ ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. చివరకు అతడు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు గుర్తించి ఆగస్టు 24న అరెస్ట్ చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
అమెరికాకు అప్పగింతకు రంగం సిద్ధం
అరెస్టు అనంతరం అర్జున్ శర్మను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. భారత్-అమెరికా ఎక్స్‌ట్రడిషన్ ఒప్పందం ప్రకారం అమెరికా అధికారులు అతడిని తమ దేశానికి అప్పగించాలని కోరుతున్నారు. ఈ కేసులో అమెరికా సమర్పించిన అభియోగాలు, ఆధారాలపై తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగనుంది.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిఖితా
హైదరాబాద్‌కు చెందిన నిఖితా 2021-22 ప్రాంతంలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసిన అనంతరం మేరీల్యాండ్‌లోనే డేటా అనలిస్ట్‌గా ఉద్యోగం చేసింది. ఆమె కెరీర్‌లో మంచి స్థాయికి ఎదుగుతున్న సమయంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.
నిఖితా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అర్జున్ ప్రస్తుతం భారత అధికారుల కస్టడీలో ఉన్నాడు. అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ పూర్తయితే.. మేరీల్యాండ్‌లో అతడిపై నమోదైన హత్య కేసులో అక్కడి కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాదాపు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ కేసులో అర్జున్ అరెస్టు కీలక మలుపుగా మారింది.