ఏపీలో మరో మెగా ప్రాజెక్ట్: దుగరాజపట్నంలో రూ.15 వేల కోట్లతో నౌకా నిర్మాణ క్లస్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నాయి.

Update: 2026-09-18 10:23 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ప్రధానంగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొత్త ప్రాజెక్టులకు ఏపీ గమ్యస్థానంగా మారుతోంది. ఇందుకు నిదర్శనంగా.. తాజాగా తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన 'మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్' రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ షిప్‌యార్డ్ నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్తంగా 'నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్- ఏపీ' పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేశాయి. దేశంలోని అగ్రశ్రేణి షిప్‌బిల్డర్లలో ఒకటైన, నవరత్న డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌గా ఉన్న మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ను ప్రతిపాదిత క్లస్టర్ కోసం యాంకర్ షిప్‌యార్డ్‌గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.




దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్ఫీల్డ్ షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయాలని మజగావ్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) భావిస్తోంది. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం దశలవారీగా రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా పెడుతోంది. ఈ ఎండీఎల్ షిప్‌యార్డ్ ద్వారా సుమారు 45 వేల మందికి ఉపాధి లభించనుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ తాజా ప్రాజెక్టు ఒప్పందంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో చక్కని సమన్వయం కొనసాగిస్తున్న ఏపీ ప్రభుత్వం.. వరుసగా అతిపెద్ద ప్రాజెక్టులను దక్కించుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీకి దశాబ్దాలుగా మిత్రపక్షంగా అనుబంధం ఉంది. అయితే, గతం కొన్నిసార్లు రెండు పార్టీల మధ్య తలెత్తిన విభేదాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా, టీడీపీ నాయకత్వం కూడా రాజకీయంగా సమస్యలను చవిచూసిందని గుర్తు చేస్తున్నారు. కానీ, 2024 ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తు, ఆ తర్వాత టీడీపీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం కొనసాగాల్సిన రాజకీయ పరిస్థితులు ఏర్పడటంతో.. ఇప్పుడు ఏపీ కేంద్ర ప్రభుత్వానికి మొదటి ఛాయిస్‌గా మారినట్లు కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని చెబుతున్నారు. ప్రైవేటు రంగ పరిశ్రమలతో పాటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలకు కూడా ఏపీని ప్రధాన కేంద్రంగా మారుస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

గతంలో రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమతో పాటు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కూడా అడుగులు పడ్డాయి. ఇప్పుడు తాజాగా మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ షిప్‌బిల్డింగ్-కమ్-పోర్ట్ క్లస్టర్‌ను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడాన్ని విశేషంగా చెబుతున్నారు. కంటైనర్ షిప్‌లు, ట్యాంకర్లు, ఎల్‌ఎన్‌జీ క్యారియర్లు వంటి పెద్ద వాణిజ్య నౌకల నిర్మాణానికి ఇది ప్రధాన వేదిక కానుంది.

Tags:    

Similar News