ఖైరతా'బాద్ షా' ఎవరు ?!

2019లో కర్ణాటకలో యడ్యూరప్ప బల నిరూపణ కోసం 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకున్నారు.

Update: 2026-09-19 03:46 GMT

తెలంగాణలో మరో సారి ఉప ఎన్నికలకు తెరలేచింది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద హైకోర్టు అనర్హత వేటు వేసింది. బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ మారిన తొలి ఎమ్మెల్యే కూడా దానం నాగేందర్ కావడం గమనార్హం.

అయితే పార్టీ మారిన అనంతరం ఆయన సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అందుకే స్పీకర్ పార్టీ మారలేదని ప్రకటించినా ఆ తీర్పును కొట్టి వేస్తూ హైకోర్టు వేటు వేసింది. అదే సమయంలో ఖైరతాబాద్ స్థానం వేకెంట్ గా ప్రకటిస్తూ స్పీకర్ కు, ఈసీకి సమాచారం అందించింది.

ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని, హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, తనకు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని అనర్హత వేటు పడిన దానం నాగేందర్ ప్రకటించిన నేపథ్యంలో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక ఖాయం అయినట్లే. హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఒక్క దానం నాగేందర్ కు మాత్రమే ఉంది. ఆయన వెనక్కి తగ్గడం, ఎన్నికలు ఎదుర్కొంటానని ప్రకటించడం గమనార్హం.

ఉప ఎన్నికలు ఖాయం అన్న పరిస్థితులలో ఇప్పుడు ఏ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి దానం నాగేందర్, కాంగ్రెస్ నుండి పీజేఆర్ కూతురు విజయారెడ్డి, బీజేపీ నుండి చింతల రామచంద్రారెడ్డిలు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఈ మూడు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది.

గత ఎన్నికల్లో దానం నాగేందర్ కు 67,368 ఓట్లు, విజయారెడ్డికి 45,358 ఓట్లు, చింతల రామచంద్రారెడ్డికి 38,094 ఓట్లు వచ్చాయి. 22,010 ఓట్ల మెజారిటీతో దానం విజయం సాధించాడు. ప్రస్తుతం అనర్హత వేటు పడిన నేపథ్యంలో దానం నాగేందర్ కే కాంగ్రెస్ నుండి అవకాశం దక్కుతుందా ? లేక మరెవరికైనా అవకాశం ఇస్తారా ? అన్న ఉత్కంఠ నెలకొన్నది. గత కొన్నాళ్లుగా దానం నాగేందర్ చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహారశైలి గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి, దానం నాగేందర్ కు మధ్యన దూరం పెరిగింది అన్న చర్చ నెలకొంది.

దానం నాగేందర్ పోటీ విషయంలో మరో సంధిగ్దత కూడా నెలకొన్నది. అనర్హత వేటు పడిన నేపథ్యంలో తిరిగి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందా ? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే యాంటి డిఫెక్షన్ లా పదవ షెడ్యూలు ప్రకారం ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని కానీ, కూలింగ్ పీరియడ్ నాలుగు లేదా ఆరేళ్లు పోటీ చేయటానికి అర్హులు కాదని చట్టంలో లేదు.

2019లో కర్ణాటకలో యడ్యూరప్ప బల నిరూపణ కోసం 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకున్నారు. ఆ తరువాత స్పీకర్ రమేష్ కుమార్ ఆ 15 మంది మీద వేటు వేసి రెండేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిషేధించారు. అయితే అనర్హత వేటు పడ్డ వారు సుప్రీంకోర్టుకు వెళ్లగా వారు పోటీ చేయవచ్చని తీర్పు ఇచ్చింది. ఆ 15 మందిలో 13 మందికి బీజేపీ టికెట్ ఇవ్వగా 11 మంది విజయం సాధించారు. ఈ పరిణామాలను గమనిస్తే దానం నాగేందర్ కు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ సీనియర్ మన్నె గోవర్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నాడు. అయితే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ ను బరిలోకి దింపుతారని భావిస్తున్నారు. 2018లో సాయికిరణ్ బీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి పోటీ చేసిన బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. 2014లో ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామంచంద్రారెడ్డి 53,102 సాధించి దానం నాగేందర్ కు ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ 32,256 ఓట్లు మాత్రమే సాధించారు. 2018 ఎన్నికల్లో 34,666 ఓట్లు సాధించిన చింతల రెండో స్థానానికి పడిపోయారు. 2023 ఎన్నికల్లో 38,094 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మరోసారి చింతల పోటీ చేస్తారా ? బీజేపీ మరొకరిని రంగంలోకి దించుతుందా ? అనేది వేచిచూడాలి.

Tags:    

Similar News