మీగణేషుడిది హిందీ.. వాళ్లది తమిళం.. మద్రాస్ హైకోర్టు చురక
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో వినాయక నిమజ్జనం కోసం వీహెచ్ పీకి 19వ తేదీని.. హిందూ మున్నానికి 20వ తేదీని స్థానిక పోలీసులు అవకాశం కల్పించారు.
వినాయక నిమజ్జనం తేదీపై వీహెచ్ పీకి స్థానిక పోలీసులు నిర్ణయించిన తేదీకి మధ్య పంచాయితీ తమిళనాడులో చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో వీహెచ్ పీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా హైకోర్టు వేసిన చురకను అభినందించాల్సిందే. అధిక్యతను ప్రదర్శించటం కోసం అనవసర అంశాల కోసం కోర్టును ఆశ్రయించటంలో అర్థం లేదు. ఇదే విషయాన్ని హైకోర్టు తనదైన రీతిలో రియాక్టు అయిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో వినాయక నిమజ్జనం కోసం వీహెచ్ పీకి 19వ తేదీని.. హిందూ మున్నానికి 20వ తేదీని స్థానిక పోలీసులు అవకాశం కల్పించారు. అయితే.. తమకు 24 విగ్రహాలు ఉంటే.. హిందూ మున్నాని సంస్థకు ఏడు వినాయక విగ్రహాలే ఉన్నాయని.. అందుకు తమకు ఇరవయ్యో తేదీని కేటాయించాలని కోరుతూ వీహెచ్ పీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. ఒకే సైద్ధాంతిక నేపథ్యం కలిగిన రెండు సంస్థలు తేదీల విషయంలో ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నాయని సూటిగా ప్రశ్నించింది.
ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం వారి వినాయకులు మాట్లాడే భాష మాత్రమేనంటూ ధర్మాసనం చురక వేసింది. ‘‘మీ గణేషుడు హిందీ మాట్లాడతాడు.. వారి వినాయకుడు తమిళం మాట్లాడతారు. అదే తేడా. అనవసర రాజకీయాలతో పోలీసులపై ఒత్తిడి పెంచకండి. ఇదంతా ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే పోటీ మాత్రమే’’అంటూ మద్రాస్ హైకోర్టు ధర్మాసనం అసంత్రప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారంపై చివరి నిమిషంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసిన జస్టిస్ లక్ష్మీనారాయణ నేత్రత్వంలోని ధర్మాసనం వ్యాఖ్య అందరిని ఆకర్షిస్తోంది. నిమజ్జనంలోని తేదీ పంచాయితీకి హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉందా? ఆ మాత్రం సర్దుబాటు చేసుకోలేవా? అన్న వ్యాఖ్యలు పలువురి నోటి నుంచి వినిపిస్తున్నాయి.