భాను వ‌ర్సెస్ రోజా.. న‌గ‌రి రాజ‌కీయాలు మారుతున్నాయ్‌..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి.

Update: 2026-09-19 11:24 GMT

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా.. పున‌ర్వైభ‌వం కోసం పాకులాడుతున్నారు. ప్ర‌స్తుత ఎమ్మె ల్యే భాను ప్ర‌కాష్‌రెడ్డి త‌న హ‌వాను పెంచుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అభివృద్ధి అస్త్రంతో ఆయ‌న దూసుకుపోతూ.. తండ్రి పేరు నిల‌బెట్టే దిశ‌గా ప‌ని చేస్తున్నారు. దీంతో న‌గ‌రి రాజ‌కీయాలు మ‌రో సారి ఆస‌క్తిగా మారాయి.

వ్య‌తిరేక వ‌ర్గంపై వేటు..!

నగరి నియోజకవర్గంలో త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న‌వారిపై రోజా ఇటీవ‌ల వేటు వేయించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఆమె భారీ తేడాతో ఓడిపోవడం, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు వైసిపికి ఇక్కడ పెద్ద పరీక్షగా మారాయి. నగరి వైసిపి రాజకీయాల్లో కొన్నాళ్లుగా తీవ్రమైన గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. రోజా వర్గానికి, స్థానిక ఇతర ముఖ్య నేతలకు(మండల స్థాయి నాయకులకు) మధ్య తీవ్ర విభేదాలు కొన‌సాగుతున్నాయి. ఎన్నికలకు ముందే రోజా వ్యతిరేక వర్గం ఆమెకు టికెట్ ఇవ్వద్దంటూ బహిరంగంగానే నిరసనలు తెలిపింది.

ఎన్నికల సమయంలో కొందరు కీలక నేతలు పార్టీ మారడం, మ‌రి కొంద‌రు రోజాకు సహకరించకపోవడం ఆమె ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కార‌ణంతో ఎన్నికల అనంతరం నగరి నియోజకవర్గానికి చెందిన పలువురు అసంతృప్త కీలక నేతలపై సస్పెన్షన్ వేటు వేసేలా రోజా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌ల కూడా కొంద‌రు నాయ‌కుల‌ను త‌ప్పించారు. ఇక‌, ఓటమి తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న మాజీ మంత్రి రోజా, తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అవినీతికి పాల్పడుతున్నారంటూ సవాళ్లు విసురుతున్నారు.మున్సిపల్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఆమె సవాలుగా తీసుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్యాడర్‌ను తిరిగి బలోపేతం చేయడం రోజాకి పెద్ద టాస్క్‌గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ ఇక్కడ బలంగా దూసుకుపోతుండటంతో, రోజా తన పట్టును నిలుపుకోవడానికి గ్రూపులను చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది.

అభివృద్ధి మంత్రం..

కూటమి ప్రభుత్వం తరఫున నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను, మౌలిక సదుపాయాల పనులను ఎమ్మెల్యే విస్తృతంగా చేపడుతున్నారు. రహదారుల నిర్మాణం: గ్రామీణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల విజయపురం మండలం కోసలనగరం నుండి మిట్టూరు వరకు సుమారు కోటిన్న‌ర రూపాయ‌ల ఖ‌ర్చుతో నిర్మించిన నూతన తారు రోడ్డును ప్రారంభించి ప్రజల దీర్ఘకాలిక రవాణా సమస్యను పరిష్కరించారు.

అలానే.. పారిశ్రామికాభివృద్ధి , ఉపాధికి పెద్ద‌పీట వేస్తున్నారు. నియోజకవర్గంలోని కోసలనగరం పారిశ్రామిక కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే భాను భావిస్తున్నారు. కీల‌క‌మైన నీటి ప్రాజెక్టులు: గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి, పుత్తూరు పరిధిలో పెండింగ్‌లో ఉన్న వేణుగోపాల సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. దీనికితోడు అటు ప్ర‌జ‌ల‌కు.. ఇటు పార్టీ కేడ‌ర్‌కు కూడా ఆయ‌నఅందుబాటులో ఉంటున్నారు. ఫ‌లితం గా స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని భావిస్తున్నారు.

Tags:    

Similar News