గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న దానం

కొంద‌రికి కాలం ప‌రీక్ష‌లు పెడుతుంటుంది. అదే స‌మ‌యంలో వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌స‌ర‌మైన అవ‌కాశాల్ని ఇస్తుంటుంది.

Update: 2026-09-19 10:32 GMT

కొంద‌రికి కాలం ప‌రీక్ష‌లు పెడుతుంటుంది. అదే స‌మ‌యంలో వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌స‌ర‌మైన అవ‌కాశాల్ని ఇస్తుంటుంది. వాటిని గుర్తించి.. స‌ద్వినియోగం చేసుకోవ‌టం అన్న‌ది స‌ద‌రు వ్య‌క్తికి ఉండే విచ‌క్ష‌ణ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవి ఆత్మ‌హ‌త్య‌లే అన్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. ఎంద‌రో నేత‌లు చిన్న చిన్న త‌ప్పుల‌కు భారీ మూల్యాన్ని చెల్లించుకోవ‌టం క‌నిపిస్తుంది. కొంద‌రైతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డుతుంది.

అలాంటి వారితో పోలిస్తే దానం నాగేంద‌ర్ ఎంతో అదృష్టవంతుడనే చెప్పాలి. ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని చూస్తే.. త‌ప్పుల మీద త‌ప్పులు చేసిన‌ప్ప‌టికి.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆసిఫ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం (నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వ‌భ‌జ‌న‌కు ముందు) నుంచి నాలుగుసార్లు..ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు విజ‌యం సాధించారు. స‌మ‌యం.. సంద‌ర్భానికి త‌గ్గ‌ట్లు నిర్ణ‌యాలు తీసుకొని రాజ‌కీయాల్లో ల‌బ్థి పొందే నేత‌ల్ని చూస్తాం. కానీ.. దానం నాగేంద‌ర్ అందుకు భిన్నం. పార్టీ మారే విష‌యంలో ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం ప్ర‌తిసారి ఆయ‌న‌కు మ‌రో ప‌రీక్ష పెట్టేలా మారుతుంది.

1994, 1999 రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ రెండు సంద‌ర్భాల్లోనూ టీడీపీనే అధికారంలో ఉంది. 2004లో ఆయ‌న టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఆయ‌న ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలుస్తారో.. ఆయ‌న్ను విజ‌యం వ‌రిస్తుంది కానీ ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించే పార్టీ ఓడుతుంద‌న్న పేరు ఆయ‌న‌కు అప్ప‌ట్లో ఉండేది. ఈ ప్ర‌చారానికి త‌గ్గ‌ట్లే.. 1994, 1999, 2004లోనూ అలానే జ‌రిగింది.

2004లో టీడీపీలోకి చేరిన ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు కానీ తెలుగుదేశం పార్టీ ఓడింది. దీంతో దానం ఎంత‌గానో అభిమానించే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌టంతో.. వెంట‌నే టీడీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయ‌న రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కావ‌టం.. అందులో అనూహ్య రీతిలో ఆయ‌న ఓడిపోయారు. ఆయ‌న ఓడినా.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన పార్టీ మాత్రం అధికారంలో ఉండ‌టంతో.. దానం మీద ఏ సెంటిమెంట్ ను చెబుతారో అదే నిజ‌మైన ప‌రిస్థితి.

ఈ సెంటిమెంట్ కు 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున విజ‌యం సాధించ‌ట‌మే కాదు.. దానం ప్రాతినిధ్యం వ‌హించిన పార్టీ కూడా అధికారంలోకి వ‌చ్చింది. ఆయ‌న‌కు డ‌బుల్ థ‌మాకా అన్న‌ట్లు మంత్రి ప‌ద‌వి కూడా వ‌రించింది. అప్ప‌టివ‌ర‌కు ఆయ‌న మీద ఉన్న ముద్ర చెరిగిపోయింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ‌..కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థి చింత‌ల రామ‌చంద్రారెడ్డి చేతిలో ఓడారు. ఆ త‌ర్వాత అప్ప‌టి టీఆర్ఎస్ ఇప్ప‌టి బీఆర్ఎస్ లో చేరారు. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. అనంత‌రం 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. ఇక్క‌డే ట్విస్టు చోటు చేసుకుంది. దానం గెలిచారు కానీ ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన‌ బీఆర్ఎస్ ఓడింది. మొద‌ట్నించి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన కాంగ్రెస్ విజ‌యం సాధించి అధికారంలోకి రావ‌టం.. త‌న‌కు బాగా తెలిసిన రేవంత్ సీఎం కావ‌టంతో ఆయ‌న చూపు అధికార పార్టీ మీద ప‌డింది. ఇదేమీ త‌ప్పు కాదు. ఇంత‌వ‌ర‌కు ఆయ‌న వేసిన అడుగులు ఒక ఎత్తు అయితే.. ఇక్క‌డి నుంచి ఆయ‌న న‌డ‌క మారింది.

ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌టం వ‌ర‌కు ఓకే కానీ.. 2024లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. నిబంధ‌న‌ల‌ను పూర్తిగా విస్మ‌రించి దానం చేసిన అతి పెద్ద త‌ప్పు ఇదే. ఈ తీరును ఏ న్యాయ‌స్థానం అంగీక‌రించ‌ద‌న్న విష‌యాన్ని ఆయ‌న ప‌ట్టించుకోలేదు. రెండింటికి చెడ్డ రేవ‌డి మాదిరి.. ఓవైపు అంత రిస్క్ తీసుకొని ఎంపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్ప‌టికి ఆయ‌న విజ‌యం సాధించ‌లేదు. దీంతో.. ఎమ్మెల్యే ప‌ద‌విని అలానే ఉంచేసుకున్నారు. ఈ సంద‌ర్భంలో ఆయ‌న స‌న్నిహితులు ప‌లువురు ఆయ‌న్ను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం మంచిద‌న్న సూచ‌న చేశారు. చూస్తూ.. చూస్తే ఎప్పుడో కోర్టు నుంచి వ‌చ్చే తీర్పు చూసుకొని.. తీరిగ్గా స్పందించాల‌న్న ఆయ‌న నిర్ణ‌యం తాజా ఇబ్బందికి కార‌ణంగా చెప్పాలి.

ఇక్క‌డే మ‌రో విష‌యాన్ని ప్ర‌స్తావించాలి. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిన దానం.. అన‌ర్హ‌త వేటు అంశంపై బీఆర్ఎస్ నేత‌లు చాలా సీరియ‌స్ గా ఉన్నారు.ఇలాంటి వేళ‌.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ స‌మ‌యంలోనే దానం స‌న్నిహితులు ప‌లువురు.. ఆయ‌న్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. నేరుగా ఎన్నిక‌ల గోదాలోకి దిగితే బాగుంటుంద‌న్న మాట‌ను ప‌లువురు చెప్పినా.. దానం మాత్రం చెవికెక్కించుకోలేద‌ని చెబుతారు. కోర్టులో తీర్పు త‌న‌కు అనుకూలంగా వ‌స్తుంద‌న్న అతిన‌మ్మ‌కం ఇప్పుడు కోర్టులో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి వ‌చ్చేలా చేసుకున్నారు.

నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స‌మ‌యంలోనే ఆయ‌న కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి ఉంటే.. ఆయ‌న విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క‌లా మారుతుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుంటుంది. దీనికి కార‌ణం.. బీఆర్ఎస్ కు బ‌ల‌మైన అభ్య‌ర్థి లేక‌పోవ‌టమే. మ‌రోవైపు బీజేపీ అభ్య‌ర్థి బ‌రిలోకి దిగినా గాలి త‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌ని ప‌లువురు స‌న్నిహితులు చెప్పిన మాట‌ల్ని దానం లెక్క చేయ‌లేదు. కోర్టు ఆదేశం ఇప్ప‌టిమాదిరి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌న్న అతి విశ్వాసం ఇప్పుడు అన‌ర్హ‌త వేటు వ‌ర‌కు వెళ్లింది. ఒక‌వేళ అప్పుడే త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ఉంటే.. ఇప్ప‌టి ప‌రిస్థితి ఆయ‌న‌కు ఎదుర‌య్యేది కాద‌నే చెప్పాలి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ‌లోనే.. దానం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ఉంటే.. ఇప్పుడు ఎదురైన ప‌రిస్థితి ఉండేది కాద‌న్న మాట రాజకీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. బంగారం లాంటి అవ‌కాశం వ‌చ్చినా.. దాన్ని గుర్తించి స‌కాలంలో స్పందించ‌ని దుస్థితి దానం సొంతం. కోర్టు నుంచి ప్ర‌తికూల తీర్పు మాత్ర‌మే కాదు.. ఉప ఎన్నిక‌ను ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి. ఇదంతా చూసిన‌ప్పుడు స‌రైన స‌మ‌యంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఉండి ఉంటే.. దానం ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రేం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News