అంతర్గ‌త పోరు త‌గ్గితే.. రెడ్డ‌మ్మ‌దే రాజ‌కీయం.. !

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతి డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై కేడర్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

Update: 2026-09-19 11:43 GMT

క‌డ‌ప రెడ్డ‌మ్మ‌గా టీడీపీ నాయ‌కులు పిలుచుకుంటున్న క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి రాజ‌కీయాలు దూకు డుగా ఉన్నాయి. అయితే.. ఈ దూకుడు కేవ‌లం ప్ర‌త్య‌ర్థుల‌పైనే కాకుండా.. సొంత నేత‌ల‌పై కూడా ఆమె చూపిస్తుండ‌డంతో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌ను కైవ‌సం చేసుకుని స‌త్తాచాటాల‌ని భావిస్తున్న‌రెడ్డ‌మ్మ‌కు.. అంత‌ర్గ‌త పోరు ముమ్ముతిప్ప‌లు పెడుతోంది. దీనిని త‌గ్గించుకుని అంద‌రితోనూ క‌లివిడిగా ముందుకు సాగితే.. అప్పుడు రెడ్డ‌మ్మ రాజ‌కీయాలకు తిరుగు ఉండ‌ద‌ని అంటున్నారు.

కడప ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి దూకుడు వ్యూహాత్మకంగా సాగుతోంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కంచు కోటగా ఉన్న కడప స్థానాన్ని దక్కించుకున్న ఆమె, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అసెంబ్లీలోనూ ప్రభుత్వ విప్‌గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కడప రాజకీయాల్లో ఆమె శైలి, తాజా పరిణామాలు గ‌మ‌నిస్తే.. మిశ్ర‌మ స్పంద‌నే క‌నిపిస్తోంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ నుండి హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఆమె తన భర్త, టీడీపి జోనల్ కోఆర్డినేటర్ ఆర్. శ్రీనివాస రెడ్డితో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతి డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై కేడర్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కడప నగరం గత 20 ఏళ్లుగా సరైన అభివృద్ధికి నోచుకోలేదని, గత పాలకుల అసమర్థత వల్లే నగరం వెనుకబడిందని ఆమె పదే పదే విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా గళం వినిపిస్తూ వార్తల్లో నిలిచారు. అయితే.. ఆమె మాట‌ల‌కే ప‌రిమితం అయ్యార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

కడప మేయర్ సురేష్ బాబు- ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మధ్య చెత్త పన్ను, తాగునీరు, నగర అభివృద్ధి నిధుల విషయాలపై తీవ్ర స్థాయిలో విభేదాలు సాగాయి. "ఎమ్మెల్యే వర్సెస్ మేయర్" రాజకీయం కడపలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సురేష్‌బాబుపై వేటు ప‌డింది. ఇది కొంత మేర‌కు ఎమ్మెల్యేకు క‌లిసి వ‌చ్చినా.. పార్టీ ప‌రంగా అంతర్గత పోరును ఆమె ఎదుర్కొంటున్నారు. కడప మేయర్ పీఠం కోసం భవిష్యత్తులో జరగబోయే పోటీపై టీడీపిలోనే అంతర్గత విబేధాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా మాధవీ రెడ్డి వర్గానికి, పుత్తా నరసింహారెడ్డి కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిని త‌గ్గించుకునే దిశ‌గా అడుగులు వేస్తే.. రెడ్డ‌మ్మ రాజ‌కీయాల‌కు తిరుగు ఉండ‌ద‌ని చెబుతున్నారు. కానీ, దీనికి ఆమె స‌సేమిరా అంటున్నారు.

Tags:    

Similar News