ఆ పనిచేయకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ కు ఎసరు..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారులలో డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానానికి సంబంధించి ఒక తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారులలో డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానానికి సంబంధించి ఒక తీవ్రమైన చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 25వ తేదీ నాటికి డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేయకపోతే లైసెన్స్ ఆటోమేటిక్‌గా రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తా సంస్థల్లో వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ కేవలం జేబులో ఉంటే సరిపోదని.. ఈ-చలాన్లు ఇతర డిజిటల్ సేవల కోసం తప్పనిసరిగా నంబర్ లింక్ చేసుకోవాలని అధికారులు ఆదేశించినట్లు కథనాలు వస్తుండటంతో వాహనదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో అసలు రవాణా శాఖ నిబంధనలు ఏమి చెబుతున్నాయో సమగ్రంగా తెలుసుకోవడం చాలా అవసరం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న "సెప్టెంబర్ 25 గడువు , లైసెన్స్ రద్దు" అంశానికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్లలో ఎలాంటి దేశవ్యాప్త నోటిఫికేషన్ ధృవీకరించబడలేదు. కాబట్టి గడువు ముగిసిపోతుందని లేదా లైసెన్స్ రద్దవుతుందని వస్తున్న పుకార్లను నమ్మి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారిక నోటిఫికేషన్ లేనంత వరకు వీటిని ఖచ్చితమైన నిబంధనలుగా భావించకూడదు. అయితే లైసెన్స్ రద్దు కాకపోయినప్పటికీ మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాల్లో ఒక యాక్టివ్ మొబైల్ నంబర్ నమోదై ఉండటం వాహనదారులకు అన్ని విధాలా శ్రేయస్కరం.
డ్రైవింగ్ లైసెన్స్‌తో మొబైల్ నంబర్ అనుసంధానం కావడం వల్ల అనేక రవాణా సేవలు సులభతరం అవుతాయి. ముఖ్యంగా ఈ-చలాన్ వ్యవస్థలో పారదర్శకత కోసం అధికారులు మొబైల్ నంబర్ ఆధారిత ధ్రువీకరణను ఉపయోగిస్తున్నారు. మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడినప్పుడు లేదా పెండింగ్ చలాన్ల వివరాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు సమాచారం వెంటనే ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రిన్యూవల్, చిరునామా మార్పు, డ్యూప్లికేట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి ఆర్టీఓ డిజిటల్ సేవలను పొందడానికి ఓటీపీ ధ్రువీకరణ అవసరం అవుతుంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిగేటప్పుడు కూడా డిజిటల్ రికార్డుల వెరిఫికేషన్ వేగవంతం కావున మొబైల్ నంబర్ సరైనదిగా ఉండటం మంచిది.
ఈ అనుసంధాన ప్రక్రియ కోసం వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ అధికారిక సారథి పారివాహన్ పోర్టల్‌లోకి వెళ్లి ఉచితంగా, సొంతంగా ఇంట్లోనే ఉండి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వెబ్‌సైట్‌లో మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, డ్రైవింగ్ లైసెన్స్ సేవల్లో "అప్‌డేట్ మొబైల్ నంబర్" విభాగానికి వెళ్లాలి. అక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ , ఇతర వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత, మీ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసి ఆన్‌లైన్‌లోనే నంబర్‌ను నవీకరించవచ్చు.
మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోండి అంటూ వచ్చే అనధికారిక లింకులు, వాట్సాప్ మెసేజ్‌లు అపరిచిత వెబ్‌సైట్ల పట్ల వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకింగ్ వివరాలు దొంగిలించే సైబర్ ముఠాలు సంచరిస్తున్నందున, అధికారిక ఈ-చలాన్ , పారివాహన్ పోర్టల్‌లు కూడా వాహనదారులను హెచ్చరిస్తున్నాయి. కాబట్టి మీ లైసెన్స్‌లో మొబైల్ నంబర్ ఉందో లేదో ఒకసారి అధికారిక పోర్టల్‌లో సరిచూసుకోవడం మంచిదే కానీ, సెప్టెంబర్ 25 తర్వాత లైసెన్స్ రద్దవుతుందనే ప్రచారాలను అధికారిక ప్రకటనలు లేకుండా నమ్మకండి.