కూటమి గెలుపు... ఆ ఇద్దరు ఎంపీల మీదేనా ?

విశాఖ అనకాపల్లి జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమిని విజయ తీరాలకు చేర్చే బాధ్యతలను ఇద్దరు ఎంపీలు స్వీకరించారా అన్న చర్చ సాగుతోంది.

Update: 2026-09-19 04:30 GMT

విశాఖ అనకాపల్లి జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమిని విజయ తీరాలకు చేర్చే బాధ్యతలను ఇద్దరు ఎంపీలు స్వీకరించారా అన్న చర్చ సాగుతోంది. విశాఖ మేయర్ తో పాటు జెడ్పీ చైర్మన్ ఎన్నికలు ఉన్నాయి. ఇక అనకాపల్లిలో కొంత భాగం జీవీఎంసీలో ఉంది. అలా అక్కడ కూడా మేయర్ ఎన్నికతో పాటు జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. మరి ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఎన్నికల్లో కూటమిని కో ఆర్డినేట్ చేస్తూ ముందుకు నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్న దానికి జవాబుగా ఇద్దరు ఎంపీలు కనిపిస్తున్నారు. విశాఖ జిల్లా ఎన్నికల సారథ్యాన్ని ఎంపీ శ్రీ భరత్ వహిస్తారని అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ పగ్గాలు అందుకుంటారని అంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ఎంపీలు రంగంలోకి దిగిపోయి తమ వ్యూహాలను అమలులో పెట్టేస్తున్నారు.

పెద్ద బాధ్యతలుగానే :

కూటమి పార్టీలను కలుపుకుంటూ ముందుకు సాగాలి. అలాగే నూరు శాతం స్ట్రైక్ రేట్ ని సాధించాలి. ఇలా విశాఖ జిల్లా విషయంలో చూసుకుంటే ఎన్నికలు అంటే చాలానే ఉన్నాయి. అన్నింటి కంటే ఎక్కువగా మేయర్ అభ్యర్ధిని ఎంపిక చేయడం. ఈ పదవి కోసం మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. అలాగే జీవీఎంసీకి వార్డులు 98 నుంచి 120 దాకా పెరిగాయి. దాంతో ఈ వార్డులలో ఎవరికి ఎన్ని అన్నది చూసుకోవాలి. ఇలా విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు సమిష్టిగా వ్యూహ రచన చేయాలి. ఈ విషయంలో ఎంపీ శ్రీ భరత్ అందరితో చర్చిస్తూ అన్ని పార్టీలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు.

వైసీపీతో సవాల్ :

ఇక విశాఖలో అయితే కూటమికి నల్లేరు మీద నడకలా స్థానిక సంస్థల ఎన్నికల సన్నివేశం ఉంది. ఎలాగూ విశాఖ సిటీలో కూటమికి పూర్తి మొగ్గు ఉంది. దానికి తోడు వైసీపీలో సరైన నాయకత్వం లేదు అన్నది విమర్శగా ఉంది. అయితే అనకాపల్లి జిల్లాలో అలా కాదు వైసీపీలో గట్టి నాయకులు నియోజకవర్గాలలో ఉన్నారు. దాంతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ వైసీపీని ఎన్నికల రంగంలో గట్టిగా నిలపాలని చూస్తున్నారు. ఆయనకు వైసీపీ అధినాయకత్వం అండగా ఉంది. దీంతో అనకాపల్లిలో కూటమి వర్సెస్ వైసీపీ గట్టిగానే తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడగా మాటల మంటలు అపుడే రాజుకుంటున్నాయి.

అంగబలంతో పాటు :

ఇక అనకాపల్లి ఎంపీగా చివరి నిముషంలో నామినేషన్ వేసి భారీ మెజారిటీతో గెలిచిన సీఎం రమేష్ జిల్లా రాజకీయాలను పూర్తిగా అవగాహన చేసుకున్నారని అంటున్నారు. కూటమిలో టీడీపీ జనసేనను ఆయన కలుపుకుని ముందుకు సాగుతున్నారు. అంగబలం అర్ధబలంలో సీఎం రమేష్ ని వైసీపీ ఢీ కొట్టే పరిస్థితి లేదని అంటున్నారు. దాంతో పాటు ఆయన వ్యూహాలు రాజకీయ చాతుర్యం కూడా మరోసారి వైసీపీని పరీక్షించబోతున్నాయని అంటున్నారు. గత కొద్ది రోజులుగా సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాలో మకాం వేసి ప్రతీ చోటా అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో అందరితో సమావేశాలు నిర్వహిస్తూ సెంట్ పర్సెంట్ విజయం కూటమికి దక్కాలని గట్టిగా చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే విశాఖ జిల్లాకు మంత్రి లేరు దాంతో ఎంపీ శ్రీ భరత్ ఎంపీగా ఉన్నా అక్కడ కీలకం అయ్యారు, అనకాపల్లి విషయానికి వస్తే బిగ్ షాట్ గా ఉన్న సీఎం రమేష్ కూటమికి అన్ని విధాలుగా తాను అండ అంటున్నారు. దాంతో ఈ ఇద్దరు ఎంపీల సారధ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. మరి ఫలితాలు ఏ విధంగా వస్తాయన్నదే ఆసక్తిగా ఉంది.

Tags:    

Similar News