దానంపై అన‌ర్హ‌త వేటు.. త‌ర్వాత‌ ఏం జ‌రుగుతుంది?

రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడితే వెంటనే పదవి కోల్పోతారు. తాజాగా దానం విష‌యంలో హైకోర్టు ఇదే చెప్పింది.

Update: 2026-09-19 02:49 GMT

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై నేరుగా హైకోర్టే అన‌ర్హ‌త వేటు వేసిన నేప‌థ్యంలో ఆయ‌న ఏం చేస్తారు? త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. నిజానికి ఈ తీర్పు ఇచ్చింది.. హైకోర్టే కాబ‌ట్టి.. సుప్రీంకోర్టు వ‌ర‌కుదానం వెళ్లే అవ‌కాశం ఉంది. అయితే.. హైకోర్టు చెప్పిన‌ట్టుగా.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున దానం పోటీ చేసిన నేప‌థ్యం, దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు.. గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసి, ప్ర‌చారం చేసిన వీడియోలు వంటివి ఉన్న నేప‌థ్యంలో దానం అన‌ర్హ‌త వేటుపై సుప్రీంకోర్టు కూడా `స్టే` ఇచ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని న్యాయ‌వాదులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో దానం ప‌రిస్థితి ఏంటి? ఏం జ‌రుగుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇదీ.. జ‌రిగేది?

రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడితే వెంటనే పదవి కోల్పోతారు. తాజాగా దానం విష‌యంలో హైకోర్టు ఇదే చెప్పింది. ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే సీటు ఖాళీ అయింద‌ని ప్ర‌క‌టించింది. ఇక‌, అనర్హత వేటు పడిన క్షణం నుంచే సదరు ఎమ్మెల్యే కు జీతం, భ‌త్యం, ప్రొటోకాల్ వంటివి వ‌ర్తించ‌వు. ఎమ్మెల్యేగా ఉన్న అన్ని అధికారాలు, సౌకర్యాలు రద్దవుతాయి. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఆరు మాసాల్లో ఉప ఎన్నిక నిర్వ‌హిస్తారు.(సుప్రీంకోర్టు క‌నుక స్టే ఇస్తే.. మ‌రింత గ‌డువు పెర‌గ‌వ‌చ్చు.)

ఎన్నికల్లో పోటీపై నిషేధం..

అనర్హత వేటు పడటానికి గల కారణాన్ని బట్టి (ఉదాహరణకు కోర్టు ద్వారా శిక్ష పడటం వంటివి), సదరు నేత‌ రాబోయే ఆరు సంవత్సరాల పాటు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోతారు. అనర్హత వేటుకు గురైన నాయకుడు ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. దానం విష‌యంలో హైకోర్టే తీర్పు ఇచ్చింది. సో.. మిగిలింది సుప్రీంకోర్టే. ఈ కేసులో కోర్టు స్టే విధిస్తే తప్ప, అనర్హత వేటు నిర్ణయం అమల్లోనే ఉంటుంది.

రెండు సందర్భాల్లో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూల్) ప్ర‌కారం.. పార్టీ టికెట్‌పై గెలిచి, వేరే పార్టీలోకి మారినప్పుడు అన‌ర్హ‌త ప‌డుతుంది. ఇప్పుడు అదే జ‌రిగింది. దీనికి బ‌ల‌మైన కార‌ణం కూడా క‌నిపిస్తోంది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో దానం పోటీ చేయ‌డం. పార్టీ విప్‌ను ధిక్కరించినప్పుడు స్పీకర్ అనర్హత వేటు వేయవచ్చు. లేదా ఏదైనా క్రిమినల్ కేసులో కోర్టు 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు పడుతుంది. దానం విష‌యంలో పార్టీ మార‌డం.. కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేయ‌డం వంటివి కార‌ణాలుగా ఉన్నాయి.

Tags:    

Similar News