టికెట్ ధరలపై CM విజయ్ ముందు చూపు మనవాళ్లకు ఏదీ?
| ఒక వస్తువును కొనాలంటే సగటు వినియోగదారుడు ముందుగా చూసేది దాని ధరనే. ఆ ధర అందుబాటులో ఉండి నచ్చితేనే కొనుగోలు చేస్తాడు.
ఒక వస్తువును కొనాలంటే సగటు వినియోగదారుడు ముందుగా చూసేది దాని ధరనే. ఆ ధర అందుబాటులో ఉండి నచ్చితేనే కొనుగోలు చేస్తాడు. వ్యాపార సూత్రాలన్నింటికీ వర్తించే ఈ నియమం సినిమా టికెట్లకు కూడా వర్తిస్తుంది. కానీ.. ఎంత ధర విధించినా ప్రేక్షకులు టికెట్లు కొని థియేటర్లకు వస్తారనే అత్యాశ, విచ్చలవిడిగా టికెట్ ధరలను పెంచే ధోరణి చివరికి సినిమా పరిశ్రమకే తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. టికెట్ ధరలు .. వాటితో పాటు థియేటర్లలో తిండి పదార్థాల (పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్) ధరల భారం లేకుండా ఉంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అమాంతం పెరుగుతుందని కూడా విశ్లేషిస్తున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడ పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. వందల రూపాయల మేర టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు త్వరితగతిన జీవోలు జారీ చేస్తున్నాయి. ఇక్కడ ధరలు పెంచడం సులభమే కావచ్చు.. కానీ ఈ భారీ ధరల భారం సగటు కుటుంబాల మైండ్‌సెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పెరిగిన ధరలతో జనం థియేటర్లకు దూరమై ఓటీటీల వైపు మళ్లుతున్నారనే నిజాన్ని సినీ పెద్దలు, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరం.
ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని టీవీకే సీఎం విజయ్ ప్రభుత్వం తీసుకున్న ముందుచూపు నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ఎక్కువ మంది సాధారణ ప్రజలను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా విజయ్ సర్కార్ సరికొత్త జీవోను జారీ చేసింది. పెరిగిన టికెట్ ధరల వల్లే జనం థియేటర్లకు రావడం లేదని గ్రహించిన దళపతి విజయ్.. ప్రేక్షకుల సంక్షేమం కోణంలో ఆలోచించి ఏ సినిమాకీ టికెట్ ధరలను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ అభ్యర్థనలను తిరస్కరించారు.
అయితే నిర్మాతలు నష్టపోకుండా ఉండేందుకు ఒక ప్రత్యామ్నాయ అవకాశాన్ని విజయ్ ప్రభుత్వం కల్పించింది. కొత్త జీవో ప్రకారం.. సినిమాలు విడుదలైన మొదటి వారంలో ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2:30 గంటల వరకు ప్రదర్శించుకోవచ్చు. వారాంతాలు, పండుగలు.. ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుకు ఆరు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. చాలా కాలం తర్వాత ఉదయం 6 గంటల షోల సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్న మొదటి కోలీవుడ్ భారీ చిత్రంగా సూర్య నటించిన `సీన్` నిలవనుంది.
ధరలు పెంచకుండా షోల సంఖ్యను పెంచడం ద్వారా ఇటు నిర్మాతలకు కలెక్షన్లు పెరిగి.. అటు సగటు ప్రేక్షకుడికి రీజనబుల్ ధరకే సినిమా వినోదం అందుతుంది. తమిళనాడు ప్రభుత్వం చూపిన ఈ దార్శనికతను తమిళ సినీ అభిమానులు హర్షిస్తున్నారు. మరి ఈ తరహా ప్రజానుకూల.. ఇండస్ట్రీ-ఫ్రెండ్లీ నిర్ణయాలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, సినీ ప్రముఖులు ఎప్పుడు తీసుకుంటారు? మనవాళ్లకు ఈ ముందుచూపు ఎప్పుడు వస్తుంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.