చీపురుపల్లి నుంచి బొత్స రెడీ...చిన్న శ్రీను అక్కడ నుంచేనా ?

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే ఇక నుంచి మరో ఎత్తు అని అంటున్నారు.

Update: 2026-09-19 03:28 GMT

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే ఇక నుంచి మరో ఎత్తు అని అంటున్నారు. టీడీపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం రంజుగా దశాబ్ద కాలం పైగా సాగింది. అపుడు వైసీపీలో బొత్స చిన్న శ్రీను ఒక బలమైన నాయకత్వంగా ఉంటూ రాజకీయ సమరం సాగించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది బొత్స కుడి భుజం లాంటి చిన్న శ్రీను టీడీపీలోకి వెళ్ళారు. దాంతో మామ వర్సెస్ అల్లుడుగా జిల్లా రాజకీయం మారనుంది అని అంటున్నారు. పది రోజుల క్రితం చిన్న శ్రీను వైసీపీని వీడినా జిల్లా రాజకీయాల్లో ఆ ప్రకంపనలు అలాగే కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా బొత్స 2029 ఎన్నికల్లో తాను పోటీ చేసేది ఎక్కడో చెప్పేశారు. దాంతో బొత్స వర్సెస్ చిన్న శ్రీను అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

సంచలన ప్రకటన :

బొత్స నిజానికి 2029 ఎన్నికల్లో పోటీ చేయరు అన్నది నిన్నటిదాకా నడిచిన టాక్. తన వారసులను ఆయన రంగంలోకి దించుతారు అని కూడా ప్రచారంలో ఉంది. ఆయన కుమారుడు కానీ కుమార్తె కానీ చీపురుపల్లి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తారు అని కూడా అనుకున్నారు. కానీ తాజాగా బొత్స చేసిన సంచలన ప్రకటనతో జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చీపురుపల్లి లో జరిగిన నియోజకవర్గం పార్టీ సమావేశంలో బొత్స కీలక ప్రకటన చేశారు. తాను 2029లో చీపురుపల్లి నుంచి పోటీ చేస్తాను అని ఆయన బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాంతో వైసీపీ నుంచి జిల్లాలో తొలి సీటు ప్రకటన అయిపోయింది అని అంటున్నారు.

వ్యూహాత్మకమా :

బొత్స చీపురుపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తాను అని చెప్పడం వ్యూహాత్మకమైన ప్రకటనగానే చూస్తున్నారు. ఆయన వారసులను వచ్చే ఎన్నికల్లో దింపాలని చూస్తే కనుక చీపురుపల్లి వైసీపీలో భారీ చీలిక వస్తుందని చిన్న శ్రీను వైపు నేతలు క్యాడర్ జారిపోయే అవకాశం ఉందని భావించే ఈ ప్రకటన చేశారు అని అంటున్నారు. అంతే కాదు రేపటి రోజున అవతల నుంచి ఎవరు పోటీ చేసినా బొత్స అయితే బిగ్ షాట్ గా రంగంలో ఉంటారని దాంతో గెలుపు సులువు అవుతుందని కూడా భావించి ముందస్తుగా ప్రకటించారు అని అంటున్నారు. ఈ ప్రకటనతో పాటు బొత్స మరిన్ని వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని తిరిగి జగన్ సీఎం అవుతారని చెప్పారు. తాను మంత్రి అయితే నియోజకవర్గం ప్రజలు అంతా మంత్రి అయినట్లే అని అన్నారు. అలా వచ్చేది మన ప్రభుత్వమే అధికారం మనదే అని కూడా ఆయన చీపురుపల్లి పార్టీ క్యాడర్ కి బలమైన సందేశం పంపించారు అని అంటున్నారు.

చిన్న శ్రీను ఫోకస్ :

ఇక టీడీపీలో చేరిన చిన్న శ్రీను కూడా వచ్చే ఎన్నికల నాటికి చీపురుపల్లి నుంచి పోటీకి దిగుతారు అని అపుడే ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీలో చిన్న శ్రీనుకు టికెట్ దక్కాలంటే చాలా దశలు దాటాలి. అక్కడ కిమిడి నాగార్జున రేసులో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. దాంతో చిన్న శ్రీను టికెట్ తెచ్చుకోవడం అన్నది ఎన్నికల ప్రకటన దాటి నామినేషన్ల పర్వం కీలక దశకు చేరుకున్నాకే క్లారిటీ వస్తుంది. ఒక వేళ టీడీపీ వ్యూహాత్మకంగా ఆయనని బొత్స మీదకు పోటీకి దించితే మాత్రం ఈసారి చీపురుపల్లి అసెంబ్లీ సీటులోనే రాజకీయ యుద్ధం యమ రంజుగా సాగుతుంది అని అంటున్నారు. ఇవన్నీ ముందే ఊహించిన బొత్స తన రాజకీయ చాణక్యం తోనే తానే బరిలో ఉంటాను అని ప్రకటించారు అని అంటున్నారు. బొత్స వారసులు పోటీ అంటే చిన్న శ్రీను అవతల ఉంటే తట్టుకోవడం కష్టమే అన్న ఆలోచనతోనే పెద్దాయనే బరిలోకి దిగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి చిన్న శ్రీను ఫోకస్ టీడీపీలో ఏ వైపు ఉంటుందో ఏ సీటు నుంచి ఆయన రంగంలోకి దిగుతారో.

Tags:    

Similar News