దానం ఔట్ .. రోహిన్ రెడ్డి ఇన్ !
దీంతో ప్రస్తుతం ఖైరతాబాద్ శాసనసభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది చర్చానీయాంశంగా మారింది.
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అయినట్లే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ హఠాన్మరణం నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక రాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ నుండి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకుని అనర్హత వేటు వేసింది.
దీంతో ప్రస్తుతం ఖైరతాబాద్ శాసనసభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది చర్చానీయాంశంగా మారింది. 2004 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరిన దానం నాగేందర్ అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ ముఖ్యమంత్రి కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు.
అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖైరతాబాద్ నుండి దానం నాగేందర్ కు కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలుస్తాడా ? అన్న చర్చ బయలుదేరింది. అందుకే ఆయన స్థానంలో కొత్తవారికి టికెట్ ఇచ్చి, దానంను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 1994, 1999, 2004, 2009, 2018, 2023లలో దానం అసిఫ్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల నుండి గెలుస్తూ వస్తున్నాడు. అయితే పార్టీ మారిన నేపథ్యం మూలంగా ప్రజల నుండి ఆదరణ ఉండకపోవచ్చని ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ తరపున పీజేఆర్ కూతురు విజయారెడ్డి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అప్పుడు ఈ స్థానం నుండి పోటీ చేయాలని రేవంత్ సన్నిహితుడు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఆశించినా అవకాశం రాలేదు. దాంతో అంబర్ పేట నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
దీంతో ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దానంను తప్పించి తన సన్నిహితుడు రోహిన్ రెడ్డికి అవకాశం ఇస్తారని అంటున్నారు. దీనికి బదులుగా దానం నాగేందర్ కు త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలలో అవకాశం కల్పించి, మంత్రి పదవి కట్టబెడతారని, ఆ తర్వాత ఖైరతాబాద్ ఎన్నికల్లో గెలుపు బాద్యతలు దానంకే అప్పగిస్తారని అంటున్నారు.
హైదరాబాద్ నారాయణ గూడ ప్రాంతానికి చెందిన రోహిన్ రెడ్డి 23 ఏళ్లుగా ఎన్ఎస్ యూఐ నుండి ఆయన ప్రస్తానం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది. అయితే 30 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డితో అనుబంధం ఉంది. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులలో ఒకరిగా రేవంత్ రెడ్డికి పేరుంది. దేశంలో, విదేశాల్లో రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటే ఉంటారు. ‘తాను ఇప్పుడూ, ఎప్పుడూ రేవంత్ అన్నతోనే ఉంటాను’ అని రోహిన్ రెడ్డి తరచూ చెబుతుంటారు. ఆ అనుబంధం నేపథ్యంలోనే రోహిన్ రెడ్డికి ఈసారి అవకాశం కల్పించడం ఖాయం అని అంటున్నారు.