లోకేశ్, జగన్ పై ఏబీవీ సెటైర్లు..!! ఆ విషయంలో ఇద్దరూ ఒకటే అంట..

రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సోషల్ మీడియా అస్త్రంగా చేసుకుని సంధిస్తున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశంగా అవుతున్నాయి.

Update: 2026-09-18 10:15 GMT

రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సోషల్ మీడియా అస్త్రంగా చేసుకుని సంధిస్తున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశంగా అవుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడిగా ముద్రపడిన ఆయన గత కొంతకాలంగా అనుసరిస్తున్న విధానం ద్వారా తనకు ప్రభుత్వ పెద్దలకు మధ్య ఏ సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో తన ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై కాస్త మెతక వైఖరి తీసుకున్నారని జరుగుతున్న ప్రచారంలో పసలేదని సంకేతాలిస్తున్నారు. సందర్భం దొరికితే చాలు తనకు ఎవరైనా ఒకటేనన్న వైఖరి ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి ఇచ్చినా తీసుకోని ఏబీవీ.. సొంతంగా రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో కానీ, ప్రస్తుతం ఆయన ప్రజాసమస్యలను వెలుగులోకి తేవడంలో బిజీగా ఉంటున్నారు.

రాష్ట్రంలోని పలు సమస్యలను సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెస్తున్న ఏబీవీ అధికార, విపక్షాల తప్పులను ఎత్తిచూపుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకున్న ఓ విషయంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలతోపాటు రాష్ట్రంలోని రెండు ప్రధాన పత్రికల పనితీరును ఎండగడుతూ ఏబీవీ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాష్ట్రానికి చెందిన ఒక కాంట్రాక్టు సంస్థపై ఈడీ సోదాలు జరిగితే పత్రికల్లో వార్తలు రాయలేదని, ఈ విషయంలో క్రెడిట్ ఎవరు తీసుకుంటారని మంత్రి లోకేశ్, విపక్ష నేత జగన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఏబీవీ తన ఎక్స్, ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్టు పెట్టారు. అంతేకాకుండా తాను మూడు ముక్కల్లో చెప్పిన అంశానికి సంబంధించి ఒక ఆన్ లైన్ పేపరులో సమగ్ర కథనం ఉందని చెబుతూ ఆ లింకు షేర్ చేశారు.

దీంతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కొన్ని కాంట్రాక్టు సంస్థల విషయంలో ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని, ప్రజా సమస్యలు కన్నా, కాంట్రాక్టు సంస్థల ప్రయోజనాలు కాపాడేందుకు పోటీ పడుతున్నాయని రిటైర్డ్ డీజీ ఏబీవీ చెబుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 12న ఓ కాంట్రాక్టు సంస్థపై హైదరాబాద్, కోల్ కత్తా కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగితే ఆ సమాచారం ఇటు అధికార పార్టీకి చెందిన ఓ పత్రికలోనూ, అటు విపక్షం యాజమాన్యంలో నడుస్తున్న పత్రికలోనూ కవర్ అవ్వలేదని ఏబీవీ చెబుతున్నారు. దీనిపై క్రెడిట్ ఎవరు తీసుకుంటారంటూ మంత్రి లోకేశ్, విపక్ష నేత జగన్ రెడ్డిని ఆయన తన ట్వీటులో ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఏ పని జరిగిన క్రెడిట్ మాదంటే మాదని వాదులాడుకునే మంత్రి లోకేశ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ విషయంలో ఏం చెబుతారని ఏబీవీ సంధించిన ప్రశ్న తీవ్ర ఆసక్తి రేపుతోందని అంటున్నారు. ‘‘దీన్ని గురించి జగన్ గారి ప్రెస్ మీట్, లోకేష్ గారి బస్తీ మే సవాల్, ఇరువైపులా భక్త జనుల హోరా హోరీ చూడాలని ప్రజల ఉత్సుకతతో ఉన్నారంటూ ఏబీవీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘‘మరి వారి సంతృప్తి స్థాయి ని ఒక IVRS కాల్ ద్వారా అంచనా వేస్తారా? అంటూ సెటైర్ పేల్చారు. అభివృద్ధి పనుల విషయంలో రకరకాల ప్రకటనలు చేసే మంత్రులు, విపక్ష నేతలు ఒక కాంట్రాక్టు సంస్థకు దాసోహమయ్యారా? అనేలా ఏబీవీ పరోక్షంగా ప్రశ్నించారని అంటున్నారు. మొత్తానికి తనకు ఇద్దరూ ఒకటేనని ప్రజల కోసం తన గొంతు వినిపిస్తానని ఏబీవీ మరోసారి స్పష్టం చేశారని అంటున్నారు.

Tags:    

Similar News