సిద్దిపేటలో హరీష్‌రావుకు.. చిక్కుముళ్లు.. రీజనేంటి?
దీనికితోడు గత ఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు కోలుకుని ముందుకు సాగాలని.. వచ్చే ఎన్నికల్లో బలంగా పుంజుకోవాలని నిర్ణయించుకుంది.
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు తన్నీరు హరీష్‌రావు రాజకీయాలు ఎలా ఉన్నా.. ఆయన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మాత్రం అప్రమత్తంగా ఉండక తప్పదని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అధికార కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య తీవ్రంగా మారాయి. దీనికితోడు గత ఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు కోలుకుని ముందుకు సాగాలని.. వచ్చే ఎన్నికల్లో బలంగా పుంజుకోవాలని నిర్ణయించుకుంది.
వీరికితోడు.. తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కవిత సైతం.. తన టార్గెట్ సిద్దిపేటేనని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తానేపోటీ చేస్తానని కూడా కవిత కొన్నాళ్ల కిందట ప్రకటించారు. దీంతో హరీష్‌రావుకు అటు కాంగ్రెస్, బీజేపీలతో పాటు.. ఇటు కవిత ప్రభావాన్ని కూడా ఎదుర్కొనక తప్పదని అంటున్నారు పరిశీలకులు. నిజానికి సిద్దిపేటనియోజకవర్గం హరీష్ రావు కంచుకోట. పార్టీ ఓడినా.. ఆయన మాత్రం విజయం దక్కించుకున్నారు. ఆమాటకొస్తే.. సిద్దిపేట నియోజకవర్గం మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీకి కూడా గట్టి మద్దతుగా నిలుస్తోంది.
అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బీఆర్ ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే హరీష్ రావు నియోజకవర్గంపైనా దృష్టి పెట్టింది. తరచుగా కీలక నాయకులు, మంత్రులు ఇక్కడ పర్యటిస్తున్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఇక్కడ భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇక్కడి నుండి వచ్చే ఎమ్మెల్యేకు రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హరీష్ పనితీరు ఇదీ..
ఎమ్మెల్యేగా హరీష్ రావు సాదాసీదాగా ఉండడంతోపాటు.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తూ, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ తన పట్టును కాపాడుకుంటున్నారు. ఇక, బీజేపీ 2023 ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానానికే పరిమితమైనప్ప టికీ.. ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. ఇటీవల భూ సమస్యలు, 22A నిబంధనలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్దిపేటలో భారీ ధర్నాలు నిర్వహించి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో హరీష్‌రావుకు వచ్చే ఎన్నికల నాటికి ఈ చిక్కుముళ్లు మరింత పెరగనున్నాయని అంటున్నారు పరిశీలకులు.