మేఘాల కొండ...అదో అందమైన గమ్మత్తు !
ఇపుడు వంజంగి దానిని తన సొంతం చేసుకుంది. ఎక్కడి నుంచో వస్తున్న వారు అంతా వంజంగికే దారి తీస్తున్నారు. అక్కడ ప్రకృతి సోయగాలను చూస్తూ తరిస్తున్నారు.
మనకూ ఒక ఊటీ ఉంది. ఊటీ అంటే తమిళనాడుకే పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఆంధ్రా ఊటికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే చాలు పర్యాటకులు ప్రకృతితో మమేకం అవుతారు. మేఘాల కొండలను చూడొచ్చు. పాల సముద్రాన్ని తలపించే అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు. ఇంతకీ అంత అందమైన ఆంధ్రా ఊటీ ఎక్కడ ఉంది అన్నదే కదా డౌట్. అది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో పాడేరు మండలంలోని వంజంగి గ్రామం ఇపుడు టూరిస్టులను విశేషంగా అలరిస్తోంది. ఒకపుడు అరకుని ఆంధ్రా ఊటీ అనేవారు. ఇపుడు వంజంగి దానిని తన సొంతం చేసుకుంది. ఎక్కడి నుంచో వస్తున్న వారు అంతా వంజంగికే దారి తీస్తున్నారు. అక్కడ ప్రకృతి సోయగాలను చూస్తూ తరిస్తున్నారు.
బెస్ట్ టూరిస్ట్ స్పాట్ :
ఆంధ్రాలో వంజంగి ఇపుడు బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ప్రతీ రోజూ వేలాదిగా పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. దాంతో ఈ ప్రాంతం అంతా కిటకిటలాడుతోంది. సముద్రమట్టానికి మూడు వేల 400 అడుగుల ఎత్తులో ఉన్న మేఘాల కొండలని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇదంతా చూసే వారికి పాల సముద్రంగా కనిపించి కను విందు చేస్తుంది. వంజంగి మేఘాల కొండ ఇపుడు అతి పెద్ద ప్రకృతి అందంగా మారిపోయింది.
పొరుగు రాష్ట్రాల నుంచి :
వంజంగి ప్రకృతి అందాలను చూసేందుకు ఉత్తరాంధ్రా జిల్లాలు అయిన విశాఖ విజయనగరం శ్రీకాకుళం నుంచే కాదు ఒడిశా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అలాగే తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి కూడా టూరిస్టులు అధికంగా రావడం జరుగుతోంది. అందరిదీ ఒక్కటే మాట, ఒక్కటే గమ్య స్థానంగా ఉంది. అది వంజంగి గ్రామం. అక్కడ మేఘాల కొండను చూడాలన్నదే ప్రతీ ఒక్కరి ఆరాటంగా ఉంది. ఇటీవల కాలంలోనే వంగంగి కొండల గురించి అందరికీ తెలిసింది. అంతే విశేషంగా ప్రాచుర్యంలోకి కూడా వచ్చేసింది. ఆ నోటా ఈ నోటా విని తెలుసుకున్న వారంతా అక్కడికి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
వేకువ జామున అందం :
ఈ వంజంగి వద్ద ఉన్న మేఘాల కొండలను చూడాలీ అంటే తెల్లవారుజామున అయిదు గంటలకే కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. అపుడే కంటికి ఎంతో కనువిందు చేసే అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. కళ్ల ముందే మేఘాలన్నీ పాలసముద్రంలా ఒక్కసారిగా పరుచుకుంటాయి. ఈ తెల్లని కొండలన్నీ పాలసముద్రంలో ద్వీపాల్లా మెరుస్తాయి. ఆ అద్భుత దృశ్యాలను తమ కెమెరాలో బంధించేందుకు పర్యాటకులు ఉదయం మూడు గంటల నుండే కొండ ఎక్కడం ప్రారంభిస్తున్నారు అంటే ప్రకృతి ఎంతలా వారిని కట్టి పడేస్తుందో అర్ధం చేసుకోవాల్సిందే మరి. కొండలను చేరుకుంటే అక్కడ నిజంగా స్వర్గమే దిగివచ్చినట్లుగా భావన కలుగుతుంది. అంతే కాదు తాము మేఘాల పైన నిలబడినట్లుగా గొప్ప అనుభూతి కూడా కలుగుతుంది.
అలసట మరచిపోయి :
కొండలను ఎక్కాలంటే కష్టపడాల్సిందే. అది కూడా వేకువ జామున అంటే ఇంకా కష్టమే. అయితే ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నామన్న తీయని భావన ఎవరికీ ఈ కష్టాన్ని తెలియనీయదు. దాంతో తెల్లవారుజామున చలిలో కొండ ఎక్కడం ఎంతటి కష్టమైనా సరే ఒక్కసారి ఆ కొండ అంచులకు చేరాక అలసట అంతా మర్చిపోతారు. అదే అందమైన గమ్మత్తుగా పర్యాటకులు చెబుతారు. ఇక ఇక్కడికి వచ్చిన వారు అనే ఒకే ఒక మాట ఏంటి అంటే జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇదే అని. ప్రతీ రోజూ వేలాదిగా వచ్చే జనంతో వంజంగి కొండలు కళకళలాడుతుంటే ఇక వారాంతంలో అయితే ఈ తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. వీకెండ్స్ లో ఏకంగా మూడు వేల మంది దాకా పర్యాటకులు ఇక్కడికి వస్తున్నటుగా అంచనా ఉంది.
టూరిజం పరంగా చూస్తే :
అయితే ఇటీవల కాలంలో అందరినీ ఆకట్టుకుంటున్న వంజంగి కొండల విషయంలో పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. పార్కింగ్ తో పాటు టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటవీ శాఖ పర్యాటక శాఖ సంయుక్తంగా మౌలిక వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇక పర్యాటకుల రాక పెరగడంతో పాడేరు ప్రాంతంలోని స్థానిక గిరిజన యువతకు ఉపాధి బాగా లభిస్తోంది. వారంతా జీపు డ్రైవర్లుగా గైడ్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీ టూరిజం మ్యాప్ లో ఇప్పుడు వంజంగి మేఘాల కొండా హాట్ ఫేవరేట్ స్పాట్ గా నిలుస్తోంది అంటే అతిశయోక్తి లేదు.