ఫిబ్రవరి వరకు ప్రయాణికులకు ఇండిగో షాక్?

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిగో సేవలు సాధారణ స్థాయికి చేరటానికి ఎంత సమయం పడుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.;

Update: 2025-12-05 04:56 GMT

దేశంలోని విమాన సర్వీసుల్లో ఏకంగా 64 శాతం వాటాతో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే ఇండిగో.. గడిచిన నాలుగు రోజులుగా తన తీరుతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. నిర్వాహణపరమైన లోపాల కారణంగా భారీ ఎత్తున విమాన సర్వీసుల్ని రద్దు చేస్తోంది. ఇండిగో తీరుతో హైదరాబాద్.. బెంగళూరు.. ఢిల్లీ.. ముంబయి విమానాశ్రయాల్లో ఆ విమానాల్లో టికెట్లు కొనుగోలు చేసిన వారంతా తీవ్ర అవస్థలకు గురయ్యారు.

గురువారం పరిస్థితే తీసుకుంటే.. ఇండిగోకు చెందిన ప్రతి మూడు విమానాల్లో రెండు ఆలస్యంగా నడిచాయి. మొత్తంగా 550కు పైగా జాతీయ.. అంతర్జాతీయ విమానాలు రద్దు కావటం గమనార్హం. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. హైదరాబాద్ లో 79, ఢిల్లీలో 172, ముంబయిలో 118, బెంగళూరులో 100, కోల్ కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు కావటం.. ఆలస్యం కావటం అప్పుడప్పుడు జరిగేదే. ఇండిగో విషయంలో వచ్చిన సమస్య ఏమంటే.. చెకిన్ పూర్తై లోపలకు వెళ్లిన తర్వాత సదరు విమాన సర్వీసు రద్దు అయ్యిందని చెప్పటం. ఇలాంటి పరిస్థితిని బాధ్యతారాహిత్యానికి మించిన పెద్ద మాటను అనాల్సి ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిగో సేవలు సాధారణ స్థాయికి చేరటానికి ఎంత సమయం పడుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు పక్కాగా.. తాము అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలని భావించే ప్రయాణికుల్లో అత్యధికులు ఇండిగోను ప్రయారిటీగా తీసుకొని అందులోనే ప్రయాణించేలా ప్లాన్ చేసుకునే వారు.ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

తాజాగా ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ చేసిన ప్రకటన చూస్తే.. నోటి వెంట మాట రాకుండా పోతుంది. ఎందుకుంటే.. ఇండిగో సమస్య పూర్తిగా సమిసిపోవటానికి ఫిబ్రవరి పది వరకు పడుతుందని చెబుతున్నారు. విమాన సేవల్ని సాధారణ స్థితికి తేవటమే తమ తక్షణ లక్ష్యంగా పేర్కొన్న ఆయన.. సమయపాలన మీద పని చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అదంత తేలిక కాదని చెబుతూ.. ఈ నెల ఎనిమిది నుంచి విమానాల సంఖ్యను తగ్గించనున్నట్లుగా చెబుతున్నారు.

ఇండిగో విమాన గందరగోళంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో అతి త్వరగా విమానాల్ని సాధారణ స్థితికి తీసుకురావాలని.. ఛార్జీలను పెంచే చర్యలకు పాల్పడొద్దని చెబుతున్నారు. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం ఇండిగో మీద పెట్టుకున్న నమ్మకం.. విశ్వాసం ప్రయాణికుల్లో కచ్ఛితంగా మారే పరిస్థితి ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News