వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ కొత్త రూల్ తెలిస్తే షాకే!

ఇందులోని క్యాన్సిలేషన్ ప్రక్రియ కఠినంగా మార్చటమే కాదు.. ప్రయాణికుల జేబులకు చిల్లులు పడేలా మారిందని చెబుతున్నారు.;

Update: 2026-01-24 06:30 GMT

మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకు వస్తున్న వందేభారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించిన తాజా అప్డేట్ ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ స్లీపర్ ట్రైన్ గురించి ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా.. ట్రైన్ లోని ఇంటీరియర్ గురించి.. ప్రయాణికులకు కల్పించే వసతుల గురించి మాత్రమే. తాజాగా వందేభారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ టికెట్ ను క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయన్న దానిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇందులోని క్యాన్సిలేషన్ ప్రక్రియ కఠినంగా మార్చటమే కాదు.. ప్రయాణికుల జేబులకు చిల్లులు పడేలా మారిందని చెబుతున్నారు

సాధారణ రైళ్ల టికెట్ల క్యాన్సిలేషన్ కు భిన్నంగా వందేభారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ల క్యాన్సిలేషన్ ప్రక్రియ ఉందంటున్నారు. దీని కోసం ఇప్పుడున్న నిబంధనల్లో మార్పులు చేసినట్లుగా చెబుతున్నారు. సాధారణ రైళ్లతో పోలిస్తే ప్రీమియం రైళ్లలో క్యాన్సిలేషన్ ఛార్జీలను రైల్వే శాఖ భారీగా పెంచేసింది. ఎందుకిలా? అంటే అధికారులు ఇస్తున్న వివరణ సాకుల షాకులుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ప్రీమియం రైళ్లకు టికెట్ల ధరల్ని భారీగా పెంచేసిన రైల్వేశాఖ.. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జీలు భారీగా పెంచేయటం గమనార్హం.

సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రైలు బయలుదేరటానికి నాలుగు గంటల ముందు వరకు రీఫండే పొందే అవకాశం ఉంది.వందేభారత్ స్లీపర్ లో ఆ గడువును 8 గంటలకు పెంచారు. ఫలితంగా వందేభారత్ టికెట్ ను రద్దు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అంటున్నారు. తొందరపడి టికెట్ చేసుకున్నా.. చివరి నిమిషయంలో ప్రయాణాన్ని రద్దు చేసుకునే వారి మీద భారం విపరీతంగా పడుతుంది. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ఈ మధ్య వరకు కూడా సాధారణ రైళ్ల మాదిరే వందేభారత్ కు నాలుగు గంటల ముందే రైలు చార్ట్ ను సిద్ధం చేసేవారు. కానీ.. కొత్తగా వచ్చిన నిబంధనలతో 8 గంటల ముందే ఫైనల్ చార్ట్ ను విడుదల చేయనున్నారు.

ప్రయాణానికి 72 గంటల కంటే ముందే రద్దు చేసుకుంటే టికెట్ ధరల్లో 25 శాతం కోత విధిస్తారు. అదే 72 గంటల నుంచి 8 గంటల్లోపు రద్దు చేసుకుంటే మాత్రం 50 శాతం కోత విధిస్తారు. అదే ప్రయాణ సమయానికి 8 గంటల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకుంటే మాత్రం ఒక్క పైసా కూడా తిరిగి రాదు. అంటే.. వంద శాతం కోత విధిస్తారన్నమాట. ఇప్పటికే వందే భారత్ లో ప్రయాణమంటేనే ఖర్చుతో కూడుకున్న పని అన్న పరిస్థితి.

ఇక.. వందే భారత్ స్లీపర్ రైళ్లలో కనీస ఛార్జీ 400 కి.మీ. వర్తిస్తుంది. అలాంటిది క్యాన్సిలేషన్ ఛార్జీల విధింపులో తీసుకొచ్చిన మార్పులు ప్రయాణికుల్ని మరింత నష్టపోయేలా చేస్తాయని చెప్పాలి. మారిన నిబంధనలతో భారం ఎంత భారీగా ఉందనటానికి ఒక్క ఉదాహరణతో చెప్పేయొచ్చు. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వచ్చే వందే భారత్ రైలులో ఎగ్జిక్ూటివ్ క్లాస్ టికెట్ ను చివరి 8 గంటల్లోపు టికెట్ రద్దు చేస్తే నష్టపోయే మొత్తం రూ.1868గా చెబుతున్నారు. కరోనాను సాకుగా తీసుకొని సీనియర్ సిటిజన్లకు గతంలో రైల్వే శాఖ ఇచ్చే 50 శాతం రాయితీని రద్దు చేసిన మోడీ సర్కార్.. రైల్వేల్లో సంస్కరణల పేరుతో భారం భారీగా మోపుతుందని చెప్పకతప్పదు.

Tags:    

Similar News