యుద్ధాల్లో రూ.3.60 లక్షల కోట్ల ఖర్చు.. అమెరికా సైనికుల మరణాలపై ట్రంప్ సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తూనే.. మరోవైపు ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ వ్యయం.. అమెరికా సైనికుల మరణాలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ట్రంప్ చేసిన తాజా ప్రకటనలు భారత ఫార్మా పరిశ్రమతో పాటు అమెరికా విదేశాంగ, రక్షణ విధానాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రంప్ ప్రకటించిన వివరాల ప్రకారం.. 2028 నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ ఔషధాలపై 100 శాతం టారిఫ్ విధిస్తారు. ఆ తర్వాత ఏడాది నుంచి దాన్ని 200 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జనరిక్ మందుల దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు లేకపోవడంతో ఈ నిర్ణయం ఫార్మా రంగానికి పెద్ద షాక్‌గా భావిస్తున్నారు. విదేశీ ఫార్మా కంపెనీలు వచ్చే రెండేళ్లలో అమెరికాలోనే తమ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే భారీ ఆర్థిక భారం ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
ఈ నిర్ణయం ముఖ్యంగా అమెరికాకు భారీ ఎత్తున జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన అనేక భారతీయ ఔషధ సంస్థలు ఇప్పుడు తమ వ్యూహాలను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.
ఇక ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన ఖర్చులపై అమెరికా రక్షణ శాఖ కూడా కీలక వివరాలు వెల్లడించింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ సెనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ ఎదుట మాట్లాడుతూ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 37.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.60 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ఖర్చు అవసరమేనని సమర్థించుకున్న ఆయన.. భవిష్యత్ సైనిక అవసరాల కోసం అదనంగా 67 బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేయాలని కాంగ్రెస్‌ను కోరారు.
మరోవైపు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో అమెరికా పాల్గొన్న వివిధ యుద్ధాల్లో సైనికుల మరణాలను పోల్చుతూ ఒక పోస్టు చేశారు. అఫ్గానిస్థాన్ యుద్ధంలో 20 ఏళ్లలో 2 వేల మంది, ఇరాక్ యుద్ధంలో 9 ఏళ్లలో 4,600 మంది, వియత్నాం యుద్ధంలో 19 ఏళ్లలో 58,220 మంది, కొరియా యుద్ధంలో మూడేళ్లలో 36,574 మంది మరణించారని పేర్కొన్నారు. అలాగే వెనిజులా విషయంలో ఒక్క రోజులో ఎవరూ మరణించలేదని, ఇరాన్‌తో నాలుగు నెలల వ్యవధిలో 18 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
తన నాయకత్వంలో జరిగిన సైనిక చర్యల్లో అమెరికా సైనికుల ప్రాణనష్టం తక్కువగా ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ పోస్టు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫార్మా రంగంపై కఠిన టారిఫ్‌లు, యుద్ధ ఖర్చులపై స్పష్టమైన వ్యాఖ్యలు, సైనిక మరణాలపై గణాంకాలతో చేసిన ప్రచారం.. ఈ మూడు అంశాలు ట్రంప్ రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ చేస్తున్న ఇలాంటి ప్రకటనలు రానున్న రోజుల్లో మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది.