మొండి తనం మోడీ కొంప ముంచుతోందా?

సుదీర్ఘ కాలం తర్వాత భారత ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన బలమైన ప్రధానిగా నరేంద్ర మోడీ అవతరించారు.

Update: 2026-07-22 11:06 GMT

రెండు రోజుల తక్కువ 25 నెలలు. అర్థం కాలేదా? అదేనండి రెండేళ్ల ఒక నెల. కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉందా? సూటిగా చెప్పాలంటే ముచ్చటగా మూడోసారి భారత దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని కొలువు తీర్చింది 2024 జూన్ 24. అంటే.. ఈ రోజుకు (జులై 22) రెండు రోజులు తక్కువగా 25 నెలలు. తిరుగులేని అధిక్యతతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరుతుందన్న అంచనాలకు భిన్నంగా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావటం.. బీజేపీ సొంతంగా సాధిస్తుందని భావించిన లోక సభ సీట్లకు భిన్నంగా..తొలిసారి మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన అరుదైన సందర్భం అప్పట్లో చోటు చేసుకుంది.

సుదీర్ఘ కాలం తర్వాత భారత ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన బలమైన ప్రధానిగా నరేంద్ర మోడీ అవతరించారు. అయితే.. ఆయనకు హ్యాట్రిక్ హానర్ తో పాటు.. ఒక హెచ్చరికను సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో భారత ఓటర్లు ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. ఆయనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని ఇస్తూనే.. గత ఫలితాలకు భిన్నంగా తమకున్న అసంతృప్తిని స్పష్టంగా చెప్పేస్తూ.. పాలనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

మొదటి రెండు ప్రభుత్వాల సమయంలో మోడీకి ఎదురైన సవాళ్లకు భిన్నంగా మూడోసారి ప్రభుత్వ హయాంలో ఎదురవుతున్నాయి. ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. నిజానికి వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అరుదైన అవకాశం అందరికి రాదు. అలా వస్తే మరింత అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది. వరుస ప్రభుత్వాలను ఏర్పాటు చేసే వారికి ఒక వెసులుబాటు ఉంటుంది. వారికంటూ ఒక టీం ఏర్పడటంతో పాటు.. తమదైన ఎజెండాతో ముందుకు సాగే వీలు ఉంటుంది. మధ్యలో వేరే ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రాధాన్యతలు మొదలు.. అధికార యంత్రాంగాన్ని ఒక దారికి తేవటానికి చాలా సమయం పడుతుంది.

అలాంటి తలనొప్పులు తగ్గుతాయి. అయితే.. ఏ పార్టీ అయినా బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు.. ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అందునా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. ప్రజల్లో కనిపించనట్లుగా ఉండే అసంత్రప్తికి.. విపక్షాలు సరైన అంశాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడిని ఇన్ స్టెంట్ గా పెంచే ముప్పు పొంచి ఉంటుంది. ఈ విషయాలన్నీ మోడీకి తెలియనివి కావు. గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానిగా ఆయన ప్రయాణం అందరికి తెలిసిందే.

2001లో గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ అనారోగ్య కారణాలతో తప్పుకోవటం.. ఆయన స్థానంలో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిని చేశారు. స్వల్ప వ్యవధిలోనే ఆయన సీఎం హోదాలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన ఆయన.. మొత్తంగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొని పార్టీని విజయ తీరాలకు చేర్చారు. నాలుగుసార్లు నాన్ స్టాప్ గా గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. నాలుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నరేంద్ర మోడీ.. తన సొంత రాష్ట్రాన్ని వీడినా.. ఆ రాష్ట్రంలో బీజేపీకి కంచుకోటగా నిలపటంలో సక్సెస్ అయ్యారు.

ఇదంతా చూస్తే.. విజయాన్ని సాధించటం.. దాన్ని నిలుపుకోవటం.. కొనసాగించే విషయంలో మోడీ ట్రాక్ రికార్డు తిరుగులేని రీతిలో ఉంటుందని చెప్పాలి. కానీ.. ఆయనలోని కొన్ని లోపాలు.. వ్యక్తిత్వ తీరు కొత్త తలనొప్పులకు కారణమవుతున్నాయని చెప్పాలి. తన వారు ఎవరైనా సరే.. వారిపై వచ్చే విమర్శలు.. ఆరోపణల విషయంలో చర్యలు తీసుకోవటానికి మోడీ ససేమిరా అనేసేలా వ్యవహరిస్తుంటారు. నిజానికి సంఘ్ పరివార్ తీరు కూడా ఇలానే ఉంటుంది. ఏమైనా నాలుగు గోడల మధ్య విషయం ఉండాలే కానీ.. బయటకు వచ్చి రచ్చ అయిన తర్వాత ఆ విషయంలో వెనక్కి తగ్గే తత్త్వం ఉండదంటారు.

ఇందు కు నిదర్శనంగా 2021లో ఢిల్లీ శివారులో పంజాబ్ రైతులు చేపట్టిన రైతు ఉద్యమాన్నే తీసుకుంటే.. నెలల తరబడి సాగినా.. వెనక్కి తగ్గకపోవటమే కాదు మొండిగా వ్యవహరించారు. నిజానికి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎదుర్కొన్న అత్యంత గడ్డు పరిస్థితి ఇదే. కొవిడ్ లో సమస్యలు ఎదుర్కొన్నా.. ఆయన ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. అందుకు భిన్నంగా రైతు ఉద్యమంతో మోడీ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ పరంపర ఒకటి తర్వాత ఒకటి చొప్పున పెరుగుతూ పోతోంది. 2023లో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కం బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ మోడీ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసింది. ఈ సందర్భంలోనూ మోడీ అంతులేని మౌనాన్ని ప్రదర్శించారు.

ప్రతి చిన్న అంశానికి వెంటనే స్పందించే తీరుతో మోడీ దేశ ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అంతకుముందు ప్రధానమంత్రులుగా పని చేసిన వారంతా జాతీయస్థాయి అంశాలపైనే స్పందించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో మోడీ.. ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో చోటు చేసుకున్న అంశంపై స్పందించటం.. ఆ అంశాల గురించి వివరాలు సేకరించాలని ఆదేశించటం..ఆరా తీయటం లాంటివి పెద్ద ఎత్తున వినిపించేవి. ఆయన ముందు పదేళ్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ మౌన ప్రధానిగా చూసి.. చూసి విసిగిపోయిన దేశ ప్రజలకు మోడీ స్పందన అత్యద్భుతమన్నట్లుగా ఉండేది.

అయితే.. తన ఇమేజ్ ను పెంచే అంశాల మీద వేగంగా స్పందించే ఆయన.. ఏదైనా తీవ్రమైన ఆరోపణ.. సమస్యలపై నిరసన వ్యక్తం చేసే వారి విషయంలోనూ.. న్యాయం కోసం రోడ్డెక్కే వారి విషయంలో ఆయన తీరు భిన్నంగా ఉండేది. ఇది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తున్న పరిస్థితి. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఉదంతంలో ఒలింపిక్ విజేతలు సాక్షి మాలిక్.. బజరంగ్ పునియా.. వినేష్ ఫోగట్ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మహిళా క్రీడాకారులు సైతం న్యాయం కోసం.. చర్యల కోసం నెలల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటం చేయాల్సి రావటం..మోడీ ఇమేజ్ ను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పాలి.

చివరకు తమ వంతుగా దేశానికి సాధించుకు తీసుకొచ్చిన పతకాల్ని మహిళా క్రీడాకారులు గంగా నదిలో పారేసేందుకు హరిద్వార్ కు వెళ్లటం.. వారు పెట్టుకున్న కన్నీరు దేశ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బాధితులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ముందుకు రాలేదు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే కేసు నమోదు చేయటం లాంటి అంశాలు మోడీ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించేలా మారాయి.

సీఏఏ వ్యతిరేక ఆందోళనలు మోడీ సర్కారును ఇబ్బంది పెట్టినా.. దేశం మొత్తం కదిలే పరిస్థితి లేదు. దీనికి భిన్నంగా ఆపరేషన్ సింధూర్ ఎపిసోడ్ లో ప్రభుత్వానికి రావాల్సినంత ఇమేజ్ రాకపోగా.. కొత్త సందేహాలకు తెర తీసి.. మిశ్రమ చర్చకు తెర తీసింది. నిజానికి ఇదో పెద్ద ఎదురుదెబ్బగా పలువురు విశ్లేషించిన పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. నీట్ పరీక్ష లీకేజీపై చర్యలు తీసుకోవాలని.. అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మంద్రే ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ చూస్తుండగానే చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ ఉదంతంపై పోరు సుదీర్ఘంగా సాగటమే కాదు.. నీట్ పరీక్ష మరోసారి నిర్వహించి.. ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా పూర్వపు పరీక్ష లీకేజీ మీద దేశ రాజధానిలో జరుగుతున్న రగడ.. దానికి యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకు రావటం చూసినప్పుడు.. దీనంతటికి మోడీ కారణమన్న భావన కలుగక మానదు.

తన జట్టులోని వారిపై వచ్చే ఆరోపణలు.. విమర్శలకు స్పందించటం.. వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడని తీరు.. మోడీ సర్కారుకు ఒక బలహీనతగా మారిందని చెప్పాలి. చివరకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని విపక్ష కాంగ్రెస్ గొంతు సవరించుకునే వరకు వెళ్లింది. సుదీర్ఘ మౌనాన్ని విడిచి.. నీట్ పేపర్ లీక్ మహాపాపం అంటూ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించటం చూస్తే.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమన్న సామెత గుర్తుకు రాక మానదు.

నిజానికి.. ఇదే మాట ముందే చెప్పేసి.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఏకరువుపెట్టి ఉంటే.. ఈ రోజున కాక్రోచ్ పార్టీకి కానీ.. విపక్షాలకు కానీ నిరసనలకు అవకాశమే ఉండేది కాదు. తన ప్రభుత్వంపై పోరాటానికి ఎజెండా సిద్ధం చేసుకునే అవకాశం మోడీ తన మొండితనం.. తన వారిపై ఈగ వాలొద్దన్నట్లుగా వ్యవహరించటంతో పాటు.. ఎవరో ఏదో అడిగితే.. నా వాళ్ల మీద చర్యలు ఎందుకు తీసుకోవాలన్న తీరు.. చివరకు ఆయనకే ఎసరు పెట్టేలా మారటం గమనార్హం. అదే పనిగా చేస్తున్న తప్పులను మోడీ గుర్తించి సరి చేసుకుంటారా? లేదంటే.. తాను మినహా మరెవరూ లేరన్న భావన కలిగించే విషయంలో సక్సెస్ అయిన మోడీ.. అందుకు భిన్నంగా కాక్రోచ్ పార్టీ లాంటి సరికొత్త రాజకీయ పార్టీ స్థాపనకు తానే అవకాశం కల్పిస్తారా? అన్నది ప్రశ్న. అందుకు కాలమే సరైన సమాధానం చెబుతుంది.

Tags:    

Similar News