జగన్ తో షేక్ హ్యాండ్... సోషల్ మీడియా షేక్
ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే అదేదో పాత సినిమా యమగోలలో రావు గోపాలరావు పాత్ర చెప్పినట్లుగా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలరాదు.;
ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే అదేదో పాత సినిమా యమగోలలో రావు గోపాలరావు పాత్ర చెప్పినట్లుగా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలరాదు. పొరపాటున వాలినా మొత్తం షేక్ అయిపోతుంది. ఇపుడు అలాగే సీన్ ఉంది. ఒకపుడు రాజకీయం అలా లేదు, ఒకరింట్లో శుభ కార్యాలకు మరొకరు వెళ్లేవారు, అంతే కాదు ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించుకునేవారు. ఇపుడు బరులు పేర్చుకుని గిరులు గీసుకుని అటూ ఇటూ మోహరించి ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.
టీడీపీ ఎంపీ మీద :
చెన్నైలో జరిగిన వైఎస్ జగన్ సోదరుడి కుమారుడి వివాహ వేడుకకు ఒంగోలుకు చ్నెదిన ఎంపీ మాంగుంట శ్రీనివాసులు రెడ్డి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఇద్దరూ కొంత సేపు మాట్లాడుకున్నారు. అంతే క్షణాలలో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మాగుంట రూట్ మార్చేస్తున్నారు అన్న ప్రచారమూ ఊపందుకుంది. చేతిలో ఇంకా మూడేళ్ళకు పైగా ఎంపీ పదవి ఉంది, అధికార పార్టీలో ఆయన ఉన్నారు, అలా ఎందుకు పార్టీ మారుతారు అన్నది ఆయన అనుచరుల మాట. అయితే ఎంపీ ఇష్యూ మాత్రం పొలిటికల్ గా హీట్ ని పెంచేసింది.
అసలే వేడిగా ఉంది :
ఏపీలో రాజకీయం చూస్తే అసలే వేడిగా ఉంది. లడ్డూలను కల్తీ చేశారు అన్న విషయంలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా డిబేట్ సాగుతోంది. అదే విధంగా జగన్ ఒకే వారంలో రెండు సార్లు రాజధాని ప్రాంతంలో పర్యటించడంతో హీట్ ఇంకా పెరిగింది. ఈ క్రమంలో అధికార కూటమి నుంచి ఒక ఎంపీ జగన్ తో చనువుగా వ్యవహరించడం కూటమి వర్గాలు ప్రత్యేకించి టీడీపీ నుంచి అయితే తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. దాంతో అసలు ఏమి జరుగుతోంది అన్న చర్చ కూడా మొదలైంది.
రిటైర్మెంట్ దిశగా :
ఇక మాగుంట అయితే మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇపుడు మళ్ళీ టీడీపీ ఇలా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఇక ఆయన ఆ వివాహ వేడుకకు హాజరైంది మర్యాదపూర్వకంగానే అని ఆయన అనుచర వర్గం చెబుతోంది. ఆయన ఎంపీ మాత్రమే కాదని పారిశ్రామికవేత్త అని గుర్తు చేస్తున్నారు. ఇక జగన్ తో పలకరింపులు అన్నవి మర్యాదపూర్వకమే అని ఆయన వర్గం అంటోంది.
తప్పుడు సంకేతాలు :
అయితే మాగుంట ఈ విధంగా జగన్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల పార్టీలోని క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీడీపీలో చర్చ సాగుతోందిట. దాంతో ఢిల్లీ టూర్ లో ఉన్న చంద్రబాబు కూడా ఇదే విషయం మీద మాగుంటకు చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే మాగుంట తనయుడు మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంటున్నారు. మరి ఆయన ఏ పార్టీ నుంచి అన్నది తెలియదు. మాగుంట రాజకీయంగా రిటైర్ అవుతారనే అంటున్నారు. జగన్ తో షేక్ హ్యాండ్ ని ఒక మామూలు విషయంగా చూడాలని మాగుంట వర్గం అంటున్నా సీనియర్ ఎంపీ, దిగ్గజ నేత విషయంలోనే ఇలా జరిగితే ఎలా అన్నది పార్టీలో తమ్ముళ్ళు కొందరు అంటున్న మాటగా ఉందిట.