ఆకలి, కన్నీళ్లు, నిరాశ, భవిష్యత్తు కోసం చేసే ప్రాణాంతక పోరాటం.. వైరల్ వీడియో
బతకడానికి పుట్టిన మనిషి... చివరికి బతుకు కోసం తన దేశాన్నే విడిచి వెళ్లాల్సి వస్తే? అలాంటి దయనీయ పరిస్థితులే ప్రస్తుతం మొరాకోలోని వేలాది కుటుంబాలను వెంటాడుతున్నాయి.
బతకడానికి పుట్టిన మనిషి... చివరికి బతుకు కోసం తన దేశాన్నే విడిచి వెళ్లాల్సి వస్తే? అలాంటి దయనీయ పరిస్థితులే ప్రస్తుతం మొరాకోలోని వేలాది కుటుంబాలను వెంటాడుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, ఆకలి, భవిష్యత్తుపై నిస్సహాయత... ఇవన్నీ కలసి లక్షలాది మందిని తమ మాతృభూమిని వదిలి యూరప్ వైపు పరుగులు పెట్టేలా చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మహిళలు, చిన్నారులు, యువకులు పెద్ద ఎత్తున స్పెయిన్‌కు చెందిన సెయుటా , మెలిల్లా సరిహద్దుల వైపు పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు. కొందరు సముద్రాన్ని ఈదుకుంటూ మరికొందరు సరిహద్దు కంచెలను దాటి యూరప్ నేలపై అడుగుపెట్టేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. వేలాది మంది ఒకేసారి సరిహద్దులను దాటడంతో అక్కడి భద్రతా బలగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఈ భారీ వలసలకు మరో కారణంగా స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక చట్టబద్ధీకరణ పథకం నిలిచింది. ఇప్పటికే స్పెయిన్‌లో పత్రాలు లేకుండా నివసిస్తున్న సుమారు 5 లక్షల మందికి చట్టబద్ధ హోదా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తమకూ అలాంటి అవకాశం దక్కుతుందనే ఆశతో వేలాది మంది మొరాకో నుంచి స్పెయిన్ సరిహద్దుల వైపు చేరుకున్నారు. అయితే ఈ పథకానికి దరఖాస్తుల గడువు జూన్ 30తో ముగిసింది. ఈ పథకం స్పెయిన్‌లో ముందుగానే నివసిస్తున్న అర్హులకే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
అయినా ఆశ చావలేదు. "ఏదో ఒకరోజు మంచి జీవితం దొరుకుతుందేమో", "పిల్లలకు ఆకలి లేకుండా చదువు చెప్పగలమేమో" అనే ఒక్క ఆశతో వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. యూరప్ గడప చేరుకోవాలనే కల కోసం సముద్ర అలలతో పోరాడుతున్నారు.
ఈ పరిణామాలతో సెయుటా ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భారీ సంఖ్యలో వలసదారులు రావడంతో ఆశ్రయ కేంద్రాలు నిండిపోయాయి. అక్రమంగా ప్రవేశించిన వారిని తిరిగి పంపించేందుకు స్పెయిన్, మొరాకో ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఒక వైరల్ వీడియో వెనుక కేవలం సరిహద్దు దాటే దృశ్యాలే కాదు... ఆకలి, కన్నీళ్లు, నిరాశ, భవిష్యత్తు కోసం చేసే ప్రాణాంతక పోరాటం దాగి ఉంది. బతుకుదెరువు కోసం వేలాది మంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యూరప్ వైపు సాగుతున్న ఈ ప్రయాణం ప్రపంచాన్ని మరోసారి ఆలోచింపజేస్తోంది.