ఒక అధికారికి ఒకే వాహనం...కేంద్రం కీలక నిర్ణయం
ఒక అధికారికి ఒకే వాహనం. ఇది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యతను కేంద్ర మంత్రుల మీద ప్రభుత్వం పెట్టింది.
ఒక అధికారికి ఒకే వాహనం. ఇది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యతను కేంద్ర మంత్రుల మీద ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వం నిధులు, అలాగే వనరుల దుర్వినియోగం అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం వెల్లడించించింది. ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది.
ఎవరికీ మినహాయింపు లేదు :
ఎంతటి సీనియర్ అధికారి అయినా ఈ ఉత్తర్వులు అమలు చేయాల్సిందే అని ఎవరికీ మినహాయింపు లేదని కేంద్రం పేర్కొంది. ఈ విధానం ఎందుకు అంటే కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆర్థిక క్రమశిక్షణను పెంచేందుకు ఒక అధికారికి ఒకే అధికారిక కారు అన్న నిబంధన తీసుకుని వచ్చామని తెలియచేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం ఈ మేరకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అంతే కాదు ఒకే అధికారికి అదనపు మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల బాధ్యతలు ఉన్నప్పటికీ కొత్తగా మరో అధికారిక వాహనాన్ని కేటాయించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. వారు తమకు కేటాయించిన మునుపటి వాహనాన్నే కొనసాగించాలని సూచించింది.
పీఎస్‌యూ వాహనాలపై ఆంక్షలు:
మరో వైపు కేంద్ర ప్రభుత్వ అధికారులు పీఎస్‌యూలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు చెందిన వాహనాలను సాధారణ వ్యక్తిగత పనులకు వాడకూడదని ఈ ఉత్తర్వులలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను కేవలం అధికారిక పర్యటనలకు మాత్రమే ఉపయోగించాలని వెల్లడించింది. వినియోగంలో లేని లేదా అదనంగా ఉన్న ప్రభుత్వ వాహనాలను ఇతర అనధికార అవసరాలకు వాడకుండా సురక్షితంగా భద్రపరచాలని కూడా సూచించింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, రవాణా వృథాను నివారించడం పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడం ఈ ఆదేశాల ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమలు సాధ్యమేనా :
ఒక ప్రభుత్వ అధికారికి ఒకే వాహనం అన్నది కేంద్రం తీసుకున్న కఠిన నిర్ణయం. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఇటీవల కాలంలో ఎంత కష్టపడి దిగుమతి చేసుకుంటున్నదీ అందరికీ తెలిసిందే. అంతే కాదు వీటి కోసమే విదేశీ మారక ద్రవ్యం కూడా అధిక మొత్తంలో ఖర్చు అవుతోంది. పొదుపు పాటించమంటే ఎవరూ అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ కారణం చేతనే ఈ విధానం తెచ్చింది. అయితే అదనపు బాధ్యతలు తీసుకునే వారికి వాహనాలు అదనంగా ఉంటాయి. అయినా వారు ఒక్కటే వాడాలని కోరుతున్నారు. ఇక వ్యక్తిగత పనుల కోసం వాడవద్దు అని స్పష్టంగా పేర్కొంటున్నారు. మరి ఇవన్నీ సాధ్యమేనా అన్నది కూడా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈ ఉత్తర్వుల పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అంటే సేవ అని గుర్తు చేస్తున్నారు. అది అధికారులు అయినా ప్రజా ప్రతినిధులు అయినా ఇలాంటి నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ప్రభుత్వ వ్యయం వనరుల దుర్వినియోగం తగ్గుతాయని పౌర సమాజం అభిప్రాయపడుతోంది.