భీమవరం డీఎస్పీపై బదిలీ వేటు.. 'పవర్' పని చేసిందా..!
అవును... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్.జీ. జయసూర్య వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.;
ఇటీవల కాలంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జయసూర్య పేరు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈయన ప్రవర్తనపై పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పైగా అవి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జయసూర్యపై బదిలీ వేటు పడింది!
అవును... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్.జీ. జయసూర్య వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈయన వ్యవహారంపై పలువురు జనసేన ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన పవన్.. ఎస్పీ నయీం అస్మీకి ఫోన్ చేసి.. డీఎస్పీపై తనకు నివేదిక పంపాలని కోరారు.
ప్రధానంగా... భీమవరం సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని.. ఇదే సమయంలో సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని పలువురు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేశారన్ని చెబుతున్నారు. ఇదే సమయంలో.. కొంతమంది పట్ల పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని.. మొదలైన ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. దీనిపై పవన్ సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు!
ఇందులో భాగంగానే.. వెంటనే ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడిన పవన్ కల్యాణ్.. డీఎస్పీపై నివేదిక కోరారు. ఇదే సమయంలో.. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని ఎస్పీకి సూచించారు. అదే విధంగా... ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని అన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. భీమవరం డీఎస్పీ జయసూర్యను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ సమయంలో భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. త్వరలో నూతన సంవత్సర వేడుకలు.. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల నేపథ్యంలో భీమవరం డీఎస్పీ ట్రాన్స్ ఫర్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కాగా... భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం చర్చనీయాంశంగా మారడం, దీనిపై స్వయంగా ఉప ముఖ్యమంత్రి స్పందించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తనకు తెలిసినంతవరకూ జయసూర్య మంచి అధికారే అని వ్యాఖ్యానించారు!