చంద్రయాన్ 4 దిగే ప్లేస్ డిసైడ్: ఎంపిక ఎలా? ఎందుకు చేశారు?

చంద్రయాన్ సిరీస్ లో భాగంగా చంద్రయాన్ 4ను 2028లో ప్రయోగించే లక్ష్యంగా ఇస్రో పని చేస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-02-10 06:30 GMT

చంద్రయాన్ సిరీస్ లో భాగంగా చంద్రయాన్ 4ను 2028లో ప్రయోగించే లక్ష్యంగా ఇస్రో పని చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రయాన్ 2 వైఫల్యాన్ని అధిగమిస్తూ.. చంద్రయాన్ 3ను 2023లో సక్సెస్ ఫుల్ చేసిన ఇస్రో.. రెట్టించిన ఉత్సాహంతో తాజా ప్రయోగానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్ ప్రత్యేకత ఏమంటే చంద్రుని దక్షిణ ప్రాంతం నుంచి మూడు కేజీల బరువున్న మట్టి.. రాళ్ల నమూనాను సేకరించి.. తిరిగి భూమికి తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సీరియస్ గా పని చేస్తున్నారు.

ఈ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.2104 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ ద్వారా చంద్రుడి పై నుంచి నమూనాల్ని తీసుకొచ్చిన నాలుగో దేశంగా అవతరించాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఈ పనిని చేసిన దేశాలుగా అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చేశాయి. నాలుగో దేశంగా భారత్ ఉండాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యమని చెప్పాలి. చంద్రయాన్ 3 విజయంలో కీలకభూమిక పోషించిన ప్రధాన శాస్త్రవేత్తలంతా చంద్రయాన్ 4కు పని చేస్తున్నారు. ఈ మిషన్ గత మిషన్ ల కంటే సంక్లిష్టమైనది కావటంతో.. తమ అనుభవాన్ని కొత్త టెక్నాలజీకి జోడించి పని చేస్తున్నారు.

చంద్రయాన్ 3కు ప్రాజెక్టు డైరెక్టర్ గా వ్యవహరించిన పి.వీరముత్తువేల్ తాజా మిషన్ కు స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. చంద్రయాన్ 3 వేళ ఇస్రో ఛైర్మన్ గా ఉన్న సోమనాథ్.. తాజా మిషన్ కు తన అనుభవాన్ని జోడిస్తున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్ గా డాక్టర్ వి. నారాయణ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రయాన్ 3 ల్యాండర్ పరీక్షలో కీలకభూమిక పోషించిన ఎం.శంకరన్ యూఆర్ఎస్ సీ డైరెక్టర్ గా చంద్రయాన్ 4లోని ఐదు వేర్వేరు మాడ్యూల్స్ తయారీని పర్యవేక్షిస్తున్నారు. చంద్రయాన్ 3కు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ గా వ్యవహరించిన కల్పనా కాళహస్తి.. తాజా మిషన్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రయాన్ 3 వేళ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్ర డైరెక్టర్ గా ఉన్న ఆయన తాజా మిషన్ లోనూ రాకెట్ మెరుగుదల మీద వర్కు చేస్తున్నారు.

చంద్రయాన్ 4 మిషన్ కోసం చంద్రుడిపై ల్యాండింగ్ ప్రదేశాన్ని తాజాగా డిసైడ్ చేశారు. అదెలా చేశారంటే.. చంద్రయాన్ 2 ఆర్బిటార్ పంపిన అత్యంత స్పష్టమైన చిత్రాలను విశ్లేషించటం ద్వారా చంద్రయాన్ 4 ఎక్కడ ల్యాండ్ అవ్వాలన్న దానిని డిసైడ్ చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న పర్వత ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. ఇందులో ఎంఎం1 నుంచి ఎంఎం5 వరకు పరిశీలించి.. ఎంఎం4 ప్రాంతం అత్యంత సురక్షితమైనదిగా గుర్తించారు.

ఈ ప్రదేశం ప్రత్యేకత విషయానికి వస్తే..ఈ ప్రాంతంలో రాళ్ల పరిణామం.. లోయల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీన్ని డిసైడ్ చేశారు. ఎంఎం4 (మాన్స్ మౌటన్) ప్రాంతంలో సగటు వాలు(స్లోప్) కేవలం 5 డిగ్రీలు మాత్రమే. 1 కిలోమీటరు x 1 కిలోమీటరు విస్తీర్ణంలో ల్యాండింగ్ జోన్ గా డిసైడ్ చేశారు. ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు అనుకూలం. ల్యాండర్ అనుకున్నట్లుగా దిగేందుకు 10 డిగ్రీల కంటే తక్కువ వాలు చాలా ముఖ్యం. తాజాగా ఎంపిక చేసిన ప్లేస్ లో వాలు 5 డిగ్రీలు మాత్రమే. అంతేకాదు.. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్లు.. లోతైన గుంటలు తక్కువగా ఉండటం మరో ప్రధాన కారణం.

ఇంకో కీలక అంశం ఏమంటే.. ఇక్కడ వరుసగా 11 నుంచి 12 రోజుల పాటు నిరంతరం సూర్యరశ్మి లభిస్తుంది. దీంతో.. ల్యాండర్ లోని సోలార్ ప్యానెల్స్ కు తగినంత శక్తి అందుతుంది. ఈ ప్రాంతం పర్మినెంట్ గా నీడ ఉన్న లోయలకు అంటే సూర్యరశ్మి తగలని లోయలకు దగ్గరగా ఉండటం లాభిస్తుంది. ఈ ప్రాంతంలో గడ్డ కట్టిన రూపంలో నీటి మంచు ఉంటుందన్నది అంచనా. ఈ ప్రాంతం నుంచి భూమితో నేరుగా రేడియో సంబంధాలు జరిపేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.

చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టిని సేకరించటంతో పాటు.. డ్రిల్లింగ్ యంత్రం ద్వారా ఉపరితలంలో ఉన్న నమూనాలను సేకరిస్తారు. ఆ నమూనాలను ల్యాండర్ నుంచి అసెండర్ మాడ్యూల్ లోకి.. అక్కడి నుంచి అంతరిక్షంలోనే రీ ఎంట్రీ క్యాఫ్యూల్స్ లోకి బదిలీ చేసి.. భూమి మీదకు చేరుస్తారు. ఈ తరహా ప్రయోగం భారత్ కు ఇదే తొలిసారి. ఇస్రో చరిత్రలో ఈ మిషన్ అత్యంత సంక్లిష్టమైన.. సాహసోపేతమైన ప్రయోగంగా చెప్పాలి. గతంలో ఉన్న అనుభవంతో ఈ కీలక ప్రయోగానికి భారత్ తెర తీసింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. చాలా తక్కువ విడి భాగాలుతప్పించి.. 95 శాతం పరికరాల్ని దేశంలోనే తయారు చేసేలా ఈ మిషన్ ను ప్లాన్ చేశారు. ఈ మిషన్ కు అవసరమైన కీలక పరికరాల్ని టాటా గగ్రూపు, ఎల్ అండ్ టీ, గోద్రెజ్ ఏరోస్పేస్ లాంటి పలు కంపెనీలు ఈ మిషన్ లో పాలు పంచుకుంటున్నాయి.

Tags:    

Similar News