విద్యార్థులకు పవన్ మద్దతు.. కానీ అసలు సమస్య అదే..!! నీట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న నీట్ వివాదంపై ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న నీట్ వివాదంపై ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుడిగా కొనసాగుతూ విద్యార్థుల ఆందోళనల పట్ల పవన్ స్పందించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. పవన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిపక్వతకు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నీట్ పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలు, పేపర్ లీక్ ఉదంతాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. వైద్య విద్యను అభ్యసించాలనే కలను ఈ అక్రమాలు ఛిన్నాభిన్నం చేశాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. అయితే విద్యార్థుల ఆందోళనలను సమర్థిస్తూ విపక్షం కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. అయితే అధికారంలో భాగస్వామిగా ఉన్న పవన్ కూడా ఈ సమస్యపై స్పందించి అందరి దృష్టిని ఆకర్షించారు. విద్యార్థుల ఆందోళనలను కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడలేమని, విద్యార్థుల ఆవేదనలో న్యాయాన్ని గ్రహించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సూచిస్తూ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, విద్యార్థుల పక్షాన నిలవాల్సిన అవసరాన్ని గుర్తించడంలో ఆయన చూపిన సంయమనం పరిశీలకులను ఆకర్షించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, ఇదే సమయంలో ఈ నిరసనల వెనుక జరుగుతున్న కొన్ని పరిణామాలను రాజకీయ కుట్రలను కూడా పవన్ గట్టిగా ఎత్తిచూపారు. విద్యార్థుల నిజమైన ఆందోళనలను కొన్ని విపక్షాలు, దేశ వ్యతిరేక, విభజనవాద శక్తులు హైజాక్ చేశాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, కానీ దానిని ఆసరాగా చేసుకొని దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే నినాదాలు చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, హింసకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ఆయన తేల్చిచెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని చూసే పార్టీల తీరును ఆయన తప్పుపట్టారు.
ఈ మొత్తం పరిణామాల వెనుక పవన్ కళ్యాణ్ అనుసరించిన స్టాండ్ ఎంతో వ్యూహాత్మకమైనదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ జాతీయ స్థాయిలో బీజేపీతో బలమైన మైత్రి కొనసాగిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన తరుణంలో ఆయన కేంద్రాన్ని గుడ్డిగా వ్యతిరేకించకుండా, అలాగని విద్యార్థుల వ్యతిరేక ముద్ర పడకుండా పరిణతితో ప్రకటన చేశారని అంటున్నారు. సమస్య పారదర్శకంగా పరిష్కారం కావాలి కానీ ఆందోళనల పేరుతో విధ్వంసానికి చోటివ్వకూడదు’ అనే సమతుల్య విధివిధానాన్ని పవన్ ఎంచుకోవడం ఆయన చతురతకు నిదర్శనమని అంటున్నారు.
ఇక డిప్యూటీ సీఎం ఎప్పుడూ చెప్పే నేషన్ ఫస్ట్ అనే జాతీయవాద సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారు. నిరసనల పేరుతో దేశ ఐక్యతకు, శాంతికి భంగం కలిపే శక్తులు ప్రవేశిస్తే వాటిని ఉపేక్షించకూడదనే కోణంలో ఆయన మాట్లాడారని అంటున్నారు. ఇదే సమయంలో నీట్ వివాదాన్ని అడ్డంపెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న విపక్షాలకు పవన్ వ్యాఖ్యలు ఒక రకంగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థుల ముసుగులో తెరవెనుక రాజకీయాలు నడిపే వారి అసలు నైజాన్ని ఆయన బహిర్గతం చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.