10 ఏళ్ల జైలు, రూ.కోటి జరిమానా.. పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం..

ఈ మేరకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్రమ పద్ధతుల నివారణ చట్టం’లో విప్లవాత్మక సవరణలు తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది.

Update: 2026-07-24 07:46 GMT

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక ప్రక్రియల విశ్వసనీయతను దెబ్బతీస్తున్న పేపర్ లీకేజీ ముఠాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పారదర్శకతను కాపాడేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్రమ పద్ధతుల నివారణ చట్టం’లో విప్లవాత్మక సవరణలు తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది.

ప్రతిపాదిత మార్పుల ప్రకారం పరీక్షా పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే రూ.1 కోటి వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై సోమవారం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అమల్లో ఉన్న 2024 నాటి ప్రవేశ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్టం ప్రకారం వ్యక్తిగతంగా పేపర్ లీక్‌కు పాల్పడిన వారికి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడితే 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. అయితే తాజా సవరణలతో ఈ శిక్షలు, జరిమానాలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. లీకేజీలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల వీడియో సందేశంలో వెల్లడించారు.

పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు కూడా కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీలో తొలి ప్రత్యేక కోర్టు ఏర్పాటు కాగా.. మరో నాలుగు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ కోర్టుల ద్వారా పేపర్ లీక్ కేసుల విచారణను ఏడాది లోపే పూర్తిచేసి దోషులకు శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం.

ఈ ప్రతిపాదిత సవరణలకు శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం వచ్చే వారంలో సంబంధిత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. రాజ్యాంగ క్లబ్‌లో జరిగే ఈ సమావేశంలో పేపర్ లీక్‌ల నివారణకు తీసుకోబోయే చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. జులై 20న జరిగిన హింసాత్మక నిరసనల అనంతరం ఇరు పక్షాల మధ్య ఇది రెండో సమావేశం కానుంది.

లీకేజీలపై సమగ్ర చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడంతో ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేసింది. ఈ నిరసనల కారణంగా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయగా.. ఇదే అంశంపై పార్లమెంట్‌లో కూడా ప్రతిపక్షం నిరసనలు కొనసాగిస్తోంది.

Tags:    

Similar News