స్థానిక సమరం : హీట్ పెంచనున్న పవన్ ?

తమ పార్టీకి ప్రస్తుతం ఉన్న బలాబలాల దృష్ట్యా 30 శాతం సీట్లు ఇవాలని జనసేన కోరుతోంది అన్నది గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.

Update: 2026-09-08 14:53 GMT

స్థానిక సంస్థలకు ఎన్నికలు అక్టోబర్ లో జరుగుతాయని అంటున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ అంతా సాగుతోంది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇక రాజకీయ పార్టీలు కూడా స్థానిక ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. కూటమి అధికారంలో ఉండటంతో స్థానిక ఎన్నికలను స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. కూటమిలో టీడీపీ అయితే పార్టీ మొత్తానికి దిశా నిర్దేశం చేస్తోంది. ప్రజలలో సానుకూలత ఉందని దానిని సొమ్ము చేసుకోవాలని కోరుతోంది. మరో వైపు చూస్తే బీజేపీ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని చూస్తోంది. జనసేన సైతం స్థానిక ఎన్నికల మీద పెద్ద ఆశలనే పెట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకంగా భావిస్తోంది. అందుకే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కూడా కోరుతోంది.

సర్దుబాటలోనే :

తమ పార్టీకి ప్రస్తుతం ఉన్న బలాబలాల దృష్ట్యా 30 శాతం సీట్లు ఇవాలని జనసేన కోరుతోంది అన్నది గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా చర్చలు మొదలు కాలేదు. కూటమి పార్టీల మధ్య సర్దుబాటు అన్నది సాఫీగా జరుగుతుందని మిత్ర పక్షాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో అంతా కలిసి కూర్చుంటే సరిపోతుందని కూడా ఆలోచిస్తున్నాయి. కాస్తా అటూ ఇటూ అయినా కూటమి ఐక్యత చాలా ముఖ్యమని కూడా భావిస్తున్నాయని అంటున్నారు. అందుకే కూటమి పార్టీలు తమ శ్రేణులకు కూడా సంయమనం పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఉమ్మడి రాజకీయ ప్రత్యర్ధిగా వైసీపీ ఉందని పోరాటం అక్కడ చేయాలని, మిత్ర పార్టీల మీద సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం వంటివి వద్దు అని కూడా సూచిస్తున్నాయి.

కీలకంగానే ఎన్నికలు :

ఈ నేపథ్యంలో నుంచి చూసినపుడు 2024 ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కీలకంగా మారబోతున్నాయని అర్ధం అవుతోంది. ఇక్కడ గెలిచే సీట్లు దక్కే ఓట్లతోనే 2029 ఎన్నికల రాజకీయం ముడిపడి ఉంటుందని అంటున్నారు. దాంతో టీడీపీ అయితే అన్ని స్థాయిలలోనూ పార్టీ తరఫున ఇంచార్జిలను రంగంలోకి దించింది. పార్టీ తరఫున ప్రచారం నుంచి అన్ని ఎలా చేయాలన్నది కూడా ఆ పార్టీ అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేస్తోంది. జనసేన విషయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ సెంటర్ ఎట్రాక్షన్ అన్నది తెలిసిందే. ఆయన ఈసారి ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తున్న విషయం.

రంగంలోకి దిగితేనే :

పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి దిగుతారా అన్నది కూడా ఇపుడు ఆసక్తిని కలిగిస్తున్న అంశంగా ఉంది. పవన్ కనుక ప్రచారానికి వస్తే జనసేనకు మంచి ఊపు వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు క్యాడర్ కూడా ఉత్సాహం మీద పని చేస్తుందని చెబుతున్నారు. జనసేన కోరుకున్నట్లుగా నూటికి నూరు శాతం ఫలితాలు కూడా ఆ పార్టీకి దక్కుతాయని కూడా చెబుతున్నారు. ఈ విషయంలో జనసేన అధినాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. పవన్ అయితే ప్రస్తుతం కేరళంలో ప్రకృతి వైద్యం తీసుకుంటున్నారు. దాంతో ఆయన ప్రచారం పెద్ద ఎత్తున చేస్తారా లేదా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. టీడీపీ అయితే బడా నేతలను రంగంలోకి దింపుతోంది అని అంటున్నారు. ఇక చంద్రబాబు నారా లోకేష్ సైతం ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ తరఫున జగన్ ప్రచారం చేపడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News