ఎమ్మెల్సీలపై వేటు ఖాయమేనా ?!
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఈ రోజు తాతా మదు, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో తీర్మానం చేశారు.
శాసనసభ సమావేశాల ప్రారంభోత్సవాల సంధర్భంగా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలు పోలీసుల పట్ల, స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలో వారిని శాసనమండలి సభ్యత్వాల నుండి తొలగించాలని ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తుంది. ఈ విషయమై నిన్ననే తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఈ రోజు తాతా మదు, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో తీర్మానం చేశారు. ఈ కాపీని మండలి చైర్మన్ కు పంపాలని, అక్కడ ఆమోదం పొందితే వారి పదవుల మీద వేటు ఖాయం అని అంటున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వారు బాద్యతగా ఉండాలని ఈ సంధర్భంగా దామోదర రాజనర్సింహ అన్నాడు.
స్పీకర్, పోలీసుల విషయంలో అనుచితంగా ప్రవర్తించడం, వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల మీద కేసులు నమోదు చేసి ఈ ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వారికి రిమాండ్ విధించాలని పోలీసులు కోరినా న్యాయమూర్తి తిరస్కరించి బెయిలు మంజూరు చేశారు.
బెయిలు మంజూరైన తరువాత ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలు నేరుగా శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేయడంతో ఇద్దరినీ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఇలా ఏకపక్షంగా ఓటింగ్ లేకుండా సస్పెండ్ చేయడం తప్పు అని సమాచారం. ఈ నేపథ్యంలో సభ్యులు కోర్టును ఆశ్రయిస్తారని భావిస్తున్నారు.
ఇక స్పీకర్ మీద వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీల మీద వేటు వేయాలని చేసిన తీర్మానం కూడా కోర్టు పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాతా మధు నేరుగా స్పీకర్ ను ఉద్దేశించి తాను అనలేదని అంటున్నారు. లేదు స్పీకర్ ను ఉద్దేశించే అన్నాడు అని కాంగ్రెస్ వాదిస్తున్నది. దీంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరడం ఖాయమని అంటున్నారు. దీంతో పాటు నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ చర్యలు ఆ వివాదంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో తదుపరి హైకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయి అన్నది కీలకంగా మారింది.