కూటమిలో మెగాస్టార్ కి పెరుగుతున్న ప్రాధాన్యం.. పెద్ద కుమార్తెకు కీలక పదవి

ఈ పదవిలో ఆమెకు ఎలాంటి అధికారాలు లేకపోయినప్పటికీ దుర్గ గుడికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా సుష్మితను ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించడం హాట్ టాపిక్ అవుతోంది.

Update: 2026-09-08 12:19 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అగ్రతాంబూళం వేస్తోందనే అన్న చర్చ ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వంలో మెగాస్టార్ చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తుండగా, ఆయన ఇంకో సోదరుడు నాగబాబు ఇటీవల ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా కేబినెట్ హోదా ఉన్న పదవిని కైవసం చేసుకున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ పెద్ద కుమార్తె, సినీ నిర్మాత కొణిదల సుష్మిత విజయవాడ దుర్గ గుడి ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమెకు ఎలాంటి అధికారాలు లేకపోయినప్పటికీ దుర్గ గుడికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా సుష్మితను ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించడం హాట్ టాపిక్ అవుతోంది.

కూటమి ప్రభుత్వంలో టీడీపీ-జనసేన మధ్య భేదాభిప్రాయాలు రాకపోతాయా? అని ఎదురుచూస్తున్న వారికి సుష్మిత నియామకం నిరాశను కలిగిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలో రెండు పార్టీల మధ్య విభేదాలు మొదలవుతున్నాయంటూ ప్రత్యర్థులు ఉధృతంగా ప్రచారం చేసేలా ప్రయత్నాలు చేస్తుంటే, వారి ఆశలపై నీళ్లు జల్లేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి బౌన్సర్లను సంధిస్తోందని అంటున్నారు. మెగాస్టార్ కుమార్తెకు అరుదైన గౌరవం కల్పించేలా చేపట్టిన ఈ నియామకంతో జనసేన కార్యకర్తలతోపాటు మెగాస్టార్ అభిమానులను ఆనందానికి గురిచేసిందని అంటున్నారు.

వాస్తవానికి ఏపీ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవికి పెద్ద పీట వేసేలా కీలక నియామకం జరుగబోతోందని గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తారని కొందరు, టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ చేస్తారని మరికొందరు ప్రచారం చేశారు. టూరిజం శాఖ కూడా జనసేన పరిధిలో ఉండటం, ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి దుర్గేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగానూ ఉండటంతో చిరంజీవికి కీలక పదవి ఇవ్వనున్నారనే వార్తలు ఎక్కువగా షికారు చేశాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు కూటమిలోని టీడీపీ, జనసేన మాత్రం స్పందించలేదని అంటున్నారు. కానీ, ఇదే సమయంలో జనసేన పార్టీకి ప్రాధాన్యం పెరిగేలా మెగాస్టార్ కుటుంబ సభ్యులకు వరుస పదవులు దక్కుతుండటం విశేషంగా చెబుతున్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవికి ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడానికి తాజా నియామకం నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు. జూలై నెలలో మెగాస్టార్ సతీమణి సురేఖను తెలంగాణలోని యాదాద్రి ఆలయ ట్రస్టుబోర్డు సభ్యురాలుగా నియమించారు. అక్కడికి కొద్దిరోజుల్లోనే చిరంజీవి సోదరుడు నాగబాబు కేబినెట్ హోదాలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు చిరంజీవి కుమార్తె సుష్మిత కూడా దుర్గ గుడి ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా కీలక బాధ్యతలు తీసుకోనున్నారని అంటున్నారు. ఈ నియామకాల వల్ల ఉభయ రాష్ట్రాల్లోని మెగాస్టార్ అభిమానులను మంచి చేసుకునే వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News