5 నెలల టికెట్ ఉన్నా.. అమెరికాలో 2 నెలలే ఉండమన్నారు! అమెరికా వీసా ఉన్నా ఇంతేనా?

అమెరికా వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసా వచ్చిన తర్వాత ఇక తమకు నచ్చినన్ని రోజులు అమెరికాలో ఉండొచ్చని చాలామంది భావిస్తుంటారు.

Update: 2026-09-08 07:26 GMT

అమెరికా వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసా వచ్చిన తర్వాత ఇక తమకు నచ్చినన్ని రోజులు అమెరికాలో ఉండొచ్చని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా విజిటర్ వీసా ఉన్నవారికి సాధారణంగా ఆరు నెలల వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంటుందని తెలుసుకుని.. అదే కాలానికి అనుగుణంగా తమ ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే వీసా ఉండటం.. అమెరికాలో ఉండేందుకు అనుమతి లభించడం రెండూ ఒకటి కాదని తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు అమెరికాలో ఐదు నెలలు ఉండేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం మయామికి వెళ్లారు. భారత్‌కు తిరిగి రావాల్సిన తేదీని నిర్ణయించుకుని.. ఐదు నెలల తర్వాత తిరిగి వచ్చేలా రిటర్న్ టికెట్లను కూడా ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే అమెరికా చేరుకున్న తర్వాత అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్ణయం వారికి ఊహించని పరిస్థితిని తీసుకొచ్చింది.

ఎయిర్‌పోర్టులోనే షాక్

మయామి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత ఈ దంపతులను అధికారులు సెకండరీ ఇన్‌స్పెక్షన్‌కు పంపించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారి అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖ్యంగా భారత్‌లో ఉద్యోగం చేస్తున్న తండ్రి ఐదు నెలల పాటు అమెరికాలో ఎందుకు ఉండాల్సి వస్తుందని అధికారులు ప్రశ్నించినట్లు వారి కుమారుడు సోషల్ మీడియాలో వెల్లడించాడు.

కుటుంబంలో ఓ బిడ్డ పుట్టే సమయంలో అక్కడ ఉండేందుకు అమెరికాకు వచ్చినట్లు వారు వివరించినప్పటికీ ఇమ్మిగ్రేషన్ అధికారులు మాత్రం ఐదు నెలల స్టేకు అనుమతి ఇవ్వలేదు. బదులుగా కేవలం రెండు నెలల వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతించినట్లు కుటుంబం తెలిపింది. దీంతో ఐదు నెలల ట్రిప్‌గా ప్లాన్ చేసుకున్న ప్రయాణాన్ని ఇప్పుడు రెండు నెలలకే పరిమితం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమెరికా వీసా అంటే ఆరు నెలల స్టే కాదు

ఇక్కడే చాలామందికి ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది. అమెరికా విజిటర్ వీసా ఉంటే ఆరు నెలల వరకు ఉండొచ్చని అనుకుంటారు. కానీ వాస్తవానికి అమెరికా వీసా అనేది దేశంలోకి ప్రవేశించేందుకు హామీ ఇచ్చే పర్మిషన్ కాదు.

వీసా ఉన్న వ్యక్తి అమెరికా సరిహద్దు వద్దకు వెళ్లి దేశంలోకి ప్రవేశం కోరవచ్చు. అయితే అతడిని దేశంలోకి అనుమతించాలా? అనుమతిస్తే ఎంతకాలం ఉండేందుకు అనుమతి ఇవ్వాలి? అనే విషయంపై తుది నిర్ణయం అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులదే. అందువల్ల వీసా ఎంతకాలం చెల్లుబాటులో ఉందన్నది.. ఒక్కో ప్రయాణంలో ఎంతకాలం అమెరికాలో ఉండొచ్చన్నది వేర్వేరు విషయాలు.

అసలు గడువు ఎక్కడ తెలుస్తుంది?

అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తికి అనుమతించిన స్టే వివరాలు సాధారణంగా ఐ-94 రికార్డులో కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి అమెరికా వీసా మరో ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉన్నప్పటికీ, అతని ఐ-94లో నవంబర్ 5 వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటే నవంబర్ 5లోపు అతడు దేశం విడిచి వెళ్లాలి.

అంటే వీసా గడువు ఐదేళ్లు ఉందని ఐదేళ్లు అమెరికాలో ఉండొచ్చని అర్థం కాదు. అదే విధంగా ఐదు నెలల తర్వాత భారత్‌కు తిరిగి రావడానికి ముందుగానే రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం వల్ల కూడా ఐదు నెలల స్టేకు ప్రభుత్వ అనుమతి వచ్చినట్లు కాదు.

అధికారుల నిర్ణయమే కీలకం

విజిటర్ వీసాతో అమెరికాకు వెళ్లే వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో ఆరు నెలల వరకు స్టే ఇవ్వవచ్చు. కానీ ప్రతి ప్రయాణికుడికి తప్పనిసరిగా ఆరు నెలల అనుమతి ఇవ్వాలనే నిబంధన లేదు. ప్రయాణ ఉద్దేశ్యం, అమెరికాలో ఎంతకాలం ఉండాలనుకుంటున్నారు, వారి ఆర్థిక పరిస్థితి, భారత్‌లో ఉద్యోగం లేదా కుటుంబ సంబంధాలు వంటి అంశాలను అధికారులు పరిశీలించవచ్చు.

ఈ హైదరాబాద్ దంపతుల విషయంలోనూ అమెరికాలోకి ప్రవేశాన్ని అధికారులు పూర్తిగా నిరాకరించలేదు. అయితే వారు అనుకున్న ఐదు నెలల బదులు కేవలం రెండు నెలల వరకు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇచ్చారు.

దీంతో ఈ ఘటన అమెరికా వెళ్లే భారతీయులకు ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తోంది. వీసా చెల్లుబాటు గడువు, అమెరికాలో ఉండేందుకు లభించే స్టే గడువు ఒకటే కాదు. అమెరికాలోకి ప్రవేశించినప్పుడు ఐ-94లో ఇచ్చిన తేదీనే తమ చట్టబద్ధమైన స్టేకు కీలకమైన గడువుగా పరిగణించాలి. రిటర్న్ టికెట్‌ను బుక్ చేసుకునే ముందు, అమెరికాలో వాస్తవంగా ఎంతకాలం ఉండేందుకు అనుమతి లభిస్తుందో తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.

Tags:    

Similar News