విజయవాడ మేయర్ పీఠంపై కర్చీఫ్ వేసేశారు!
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కీలక పదవి మేయర్. దీనిని దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కర్చీఫ్ వేసేశారు.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కీలక పదవి మేయర్. దీనిని దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కర్చీఫ్ వేసేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు.. తన కుమారుడు సిద్ధార్థ ను ఈ కీలక పదవికి ఎంపిక చేయాలన్నది ఉమా కోరిక. ఈ నేపథ్యం లో ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి బయోడేటా కూడా సమర్పించారు. అయితే.. దీనిపై చంద్రబాబు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
తాజాగా జరుగుతున్న పార్టీ నాయకుల కాన్‌క్లేవ్‌లో చంద్రబాబు ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఎవరికి వారు మేయర్ పీఠాలపై కర్చీఫ్‌లు వేసేసుకుంటున్నారని అన్నారు. ఇది సరైన విధానం కాదని తెలిపారు. స్థానిక ఎన్నికల తర్వాత.. నాయకుల అభిప్రాయం తెలుసుకుని.. మేయర్, మునిసిపల్ చైర్మన్ ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఈ విషయంలో పార్టీ కూడా.. ఎలాంటి నిర్ణయం తీసుకోదని.. స్థానికంగా విజయం దక్కించుకున్న వారి అభిప్రాయాలు, ప్రజా మోదం తప్పని సరి అని పేర్కొన్నారు.
మరో వైపు.. బీసీ నాయకులు కూడా విజయవాడ మేయర్ పీఠంపై దృష్టి పెట్టారు. గతంలో 1995లో విజయ వాడ మేయర్ పీఠాన్ని బీసీకి టీడీపీ ఇచ్చింది. అప్పట్లో పంచుమర్తి అనురాధ మేయర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత.. మళ్లీ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినా.. పార్టీ పెద్దగా లబ్ది పొందలేదు. దీంతో ఇప్పుడు మరోసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని.. కోరుతున్నారు. గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఇదే మంత్రాన్ని పఠించింది. బీసీ మహిళకు విజయవాడ మేయర్ పీఠాన్ని అప్పగించింది.
రాష్ట్రంలోనూ నగరంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నందున.. ఆ వర్గానికి అవకాశం ఇప్పించాలన్నది టీడీపీ బీసీ నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలకు చెందిన వారని.. కీలకమైన విజయవాడలో బీసీలకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. బీసీల ఓటు బ్యాంకు కీల కంగా మారుతున్న నేపథ్యంలో విజయవాడ మేయర్ పీఠాన్ని వారికి ఇవ్వాలన్నది స్థానిక నాయకుల డిమాండ్. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.