బొత్స క్యాంప్ లో చక్రం తిప్పేది ఎవరు ?

విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో భారీ షాక్ లాంటి పరిణామం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీని వీడడం అని అంటున్నారు.

Update: 2026-09-08 18:30 GMT

విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో భారీ షాక్ లాంటి పరిణామం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీని వీడడం అని అంటున్నారు. ఉత్తరాంధ్రాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల దాకా తన హవా చలాయిస్తూ వస్తున్న బొత్సకు సొంత జిల్లాలో సొంత వారి నుంచే ఈ విధంగా ఎదురు దెబ్బ తగులుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరుగుతుందన్నది తెలిసిన విషయమే. బొత్సకు అసలైన వారసుడిగా చిన్న శ్రీను జిల్లా రాజకీయల్లో ఎదిగారు. బొత్స సైతం ఆయన్ని గట్టిగానే ప్రోత్సహించారు. అయితే గత కొంతకాలంగా మామా అల్లుళ్ళ మధ్య విభేదాలు పొడసూపాయి. దానికి కారణం బొత్స తన సొంత వారసులను రాజకీయంగా ప్రమోట్ చేయాలనుకోవడమే.

అండగా దండగా :

ఇక జిల్లా రాజకీయాల్లో బొత్సకు అండగా దండగా చిన్న శ్రీను చాలా ఏళ్ళుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన జిల్లాలో ఒక బిగ్ ఫిగర్ గా ఎదిగారు. జిల్లా రాజకీయాలను పూర్తిగా ఔపోసన పట్టేశారు. అణువణువూ ఆయనకు తెలుసు. అంతే కాదు బొత్స మార్క్ రాజకీయ వ్యూహాలు మళ్ళీ చిన్న శ్రీను వద్దనే కనిపిస్తాయని చెప్పుకుంటారు. అంతలా రాజకీయ చతురత ఆయన సొంతం. చిన్న శ్రీను పలుకుబడిని పెంచుకుంటూ అటు పార్టీకి ఇటు బొత్సకు అతి పెద్ద ఆధారంగా నిలిచారు. అలాంటి చిన్న శ్రీను పార్టీని వీడడం వైసీపీకి తీరని లోటు అయితే అదే సమయంలో బొత్సకు అయితే కుడి భుజం తెగినట్లే అని అంటున్నారు.

ఆ స్థాయిలో రాణించగలరా :

ఇక బొత్స తన కుమారుడు సందీప్ ని కుమార్తె అనూషని రాజకీయంగా ముందుకు తేవాలని అనుకుంటున్నారు. ఈ ఇద్దరూ రాజకీయంగా ఇంకా తొలి అడుగులు వేస్తున్నారు. ఇక కుమారుడి సందీప్ కి పూర్తి స్థాయిలో రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా లేదా అన్నది కూడా తెలియదని అంటున్నారు. ఆయన కంటే కూడా కుమార్తె అనూష ఎక్కువగా జిల్లా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. అయితే బొత్స రాజకీయాలను కుమార్తె ఎంతవరకూ ఒంటబట్టించుకున్నారు అన్నది చూడాల్సి ఉంది. పార్టీలో అందరితో కలిసిపోవడమే కాదు బొత్స మాదిరిగా జిల్లాను శాసించే స్థాయికి చేరుకోవాలంటే ఇంకా చాలా శ్రమించాల్సి ఉంటుందని అంటున్నారు.

దూకుడు చేయగలరా :

ఇక చూస్తే బొత్స అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని అంటున్నారు. ఆయన వయోభారంతో కూడా ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి తన వారసులు అందుకోవాలని జిల్లాలో తన మాదిరిగా రాణించాలని ఆలోచిస్తున్నారు. కానీ జిల్లా రాజకీయాల్లో దూకుడు చేయాలంటే ఇపుడున్న పరిస్థితుల్లో కష్టమైన వ్యవహారమే అని అంటున్నారు. టీడీపీ కూడా బీసీలకు పెద్ద పీట వేస్తోంది. అలాగే జనసేన కూడా బలమైన సామాజిక వర్గం మీద ఫోకస్ పెట్టింది. ఇపుడు సొంత మేనల్లుడు చిన్న శ్రీను ఎదురు నిలిచి రాజకీయం చేస్తే బొత్స క్యాంప్ నుంచి ధీటుగా ఎదుర్కొనేవారు ఎవరు అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు బొత్స క్యాంప్ నుంచి చక్రం తిప్పేది ఎవరు అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. చిన్న శ్రీను మాదిరిగా ఇప్పటికిపుడు బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాలంటే కుదిరే వ్యవహారం కాదు. అయితే ఇదే తగిన తరుణం కాబట్టి కుమార్తె కుమారుడు రంగంలోకి దిగి వెన్ను దన్నుగా నిలిస్తే బొత్స శిబిరానికి ఎంతో కొంత స్వాంతన చేకూరుతుందని అంటున్నారు. లేకపోతే బొత్స నాయకత్వం కానీ రాజకీయ వారసత్వం కానీ చిన్న శ్రీను పరం అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

Tags:    

Similar News