ఏఐ గ్రాఫిక్స్‌తో పాక్ పగటి కలలు.. నెట్టింట ట్రోల్స్
రియాలిటీలో భారత్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకపోయినా.. ఊహల్లో మాత్రం తామే 'సూపర్ పవర్' అని నిరూపించుకోవడానికి పాకిస్థాన్ పడే తాపత్రయం చూస్తే ఎవరికైనా నవ్వాగదు.
రియాలిటీలో భారత్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకపోయినా.. ఊహల్లో మాత్రం తామే 'సూపర్ పవర్' అని నిరూపించుకోవడానికి పాకిస్థాన్ పడే తాపత్రయం చూస్తే ఎవరికైనా నవ్వాగదు. తాజాగా పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ (పీఏఎఫ్) తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మైండ్ బ్లాంక్ అయిన పాక్ దళాలు, ఇప్పుడు వాస్తవ యుద్ధ రంగాన్ని వదిలేసి 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) లోకం వైపు అడుగులు వేశాయి.
ఏఐ విజువల్స్.. భారీ క్రియేటివిటీ
ఆ వీడియోలో పాక్ క్రియేటివిటీ మామూలుగా లేదు. ఏకంగా 32 భారత వైమానిక దళ (ఐఏఎఫ్) స్థావరాలపై దాడులు చేసినట్లు రెండు అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను పేల్చేసినట్లు చివరకు భారత పార్లమెంట్ భవనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు ఓ రేంజ్‌లో గ్రాఫిక్స్ రూపొందించారు. హాలీవుడ్ రేంజ్ లో సీన్లు క్రియేట్ చేసినప్పటికీ అవి నిజమైన దృశ్యాలు కావు అని.. ఏఐ జనరేటెడ్ వీడియోలని పసిగట్టడానికి నెటిజన్లకు ఎక్కువ సమయం పట్టలేదు.
అప్పు చేసి ఏఐ క్రెడిట్స్ కొన్నారా?
ఈ ఆర్టిఫిషియల్ డ్రీమ్స్ పై భారత నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. "రియల్ లైఫ్‌లో గెలవలేక డిజిటల్ లైఫ్‌లో సర్దుకుంటున్నారు" అని ఒకరంటే "పాకిస్థాన్ తమ పగటి కలలను కూడా ఏఐ టెక్నాలజీతో ప్రమోట్ చేసుకుంటోంది" అని మరొకరు కామెంట్ చేశారు. ఇక సోషల్ మీడియా ట్రోలర్స్ అయితే ఒక అడుగు ముందుకేసి, "వీడియో క్రియేట్ చేయడానికి వాడిన ఏఐ టూల్స్ క్రెడిట్ల కోసం కూడా తుర్కియేనో, సౌదీ అరేబియానో వెళ్లి అప్పు తెచ్చుకున్నారా?" అంటూ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.
అధికారిక ఖాతాలోనే పప్పులో కాలేసిన పాక్
ఏదో ఒక ప్రైవేట్ యూజర్ పోస్ట్ చేస్తే సరిపెట్టుకోవచ్చు కానీ ఏకంగా ఒక దేశపు అధికారిక వైమానిక దళం పేజీ నుంచి ఇలాంటి కల్పిత వీడియోలను షేర్ చేయడం పాకిస్థాన్ దౌత్య, సైనిక పరిణతికి అద్దం పడుతోంది. నిజమైన యుద్ధంలో చేతులెత్తేసి గ్రాఫిక్స్ గ్రాండ్‌నెస్ వెనుక దాక్కోవడం వారి పరిస్థితికి నిదర్శనం.
ఏది ఏమైనా డిజిటల్ యుగంలో వార్ ఫేర్ అంటే గ్రాఫిక్స్ మార్చడం కాదు.. నిజమైన సామర్థ్యం అని పాకిస్థాన్ ఎప్పుడు గ్రహిస్తుందో? ప్రస్తుతానికి మాత్రం ఈ ఏఐ వీడియో పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను నెట్టింట పెద్ద నవ్వులపాలు చేసింది!