మున్సిపల్ ఎన్నికలకు గండం.. ఒకటో తేదీకి భారీ వర్ష సూచన
'అర్నాబ్' తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే కోస్తాంధ్రకు మళ్లీ వాన గండం పొంచివుందన్న సమాచారం ఆందోళన రేకెత్తిస్తోంది.
'అర్నాబ్' తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే కోస్తాంధ్రకు మళ్లీ వాన గండం పొంచివుందన్న సమాచారం ఆందోళన రేకెత్తిస్తోంది. గత మూడు రోజులుగా అర్నాబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటమునిగి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఇలాంటి సమయంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ చేసిన ప్రకటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తాజా బులెటన్ లో వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ, అండమాన్ సముద్రాన్ని ఆనుకుని మరింత బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇది మరింత తీవ్రరూపం దాల్చి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అనేదానిపై 24 నుండి 48 గంటల్లో మరింత స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. కాగా, నవంబరు 1న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజు వర్షం కురిస్తే ఓటింగ్ పై ప్రభావం చూపుతుందని, జాతకాలు తారుమారయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారు.
'అర్నాబ్' దెబ్బ నుంచి కోలుకోకముందే..
ఇప్పటికే 'అర్నాబ్' తుఫాన్ ధాటికి రాష్ట్రం అతలాకుతలమైంది. పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, శనగ, ఇతర ఉద్యానవన పంటలు నీటమునిగాయి. చేతికి అందివచ్చిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతులు ఊసూరుమంటున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు వేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో, మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వార్తలు కోస్తాంధ్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చేలలో ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: అధికారుల హెచ్చరిక
రాబోయే వర్షాల దృష్ట్యా కోస్తా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు అర్నాబ్ తుఫాన్ దాటికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. ముఖ్యంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించి సురక్షిత తాగునీటి సరఫరాకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో అల్పపీడనం ఏర్పడిందనే సమాచారంతో అధికార యంత్రాంగం భయపడుతోంది. మళ్లీ వర్షాలు ప్రారంభమైతే నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.