విజయసాయిరెడ్డితో కలిసి నడిచేదెవరు?
సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారు అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయాల్లోకి వస్తానంటూ చాలా రోజుల క్రితమే విజయసాయిరెడ్డి ప్రకటించారు.
సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారు అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయాల్లోకి వస్తానంటూ చాలా రోజుల క్రితమే విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాజాగా విజయవాడలో మరోసారి ఆ సమయం ఆసన్నమైందని సంకేతాలిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా విజయసాయిరెడ్డి పార్టీలో ఎవరెవరు చేరే అవకాశం ఉంది? గతంలో ఆయన పనిచేసిన వైసీపీ నుంచి కీలక నేతలు ఎవరైనా విజయసాయిరెడ్డితో చేతులు కలిపే అవకాశం ఉందా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. పార్టీ పెడతానంటూ విజయసాయిరెడ్డి స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఏ నేత కూడా ఆయనకు బాసటగా ఇంతవరకు ప్రకటన చేయకపోవడాన్ని పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి టీటీడీ సభ్యుడిగా నియమితులయ్యారు. అప్పటివరకు వైఎస్ కుటుంబానికి ఆడిటర్ గా సేవలు అందించిన ఆయన టీడీపీ బోర్డు మెంబరుగా తొలిసారి ప్రజా జీవితంలోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సన్నిహితుడిగా మారడం, జగన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో నెంబరు టుగా ఎదిగిన స్టోరీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్న విజయసాయిరెడ్డితో ఎవరు చేతులు కలుపుతారనేదే తెలియాల్సివుందని అంటున్నారు. దాదాపు 20 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా పనిచేసిన విజయసాయిరెడ్డితో కలిసి రాజకీయ ప్రయాణం చేయడానికి ఎవరు సిద్ధపడతారన్న ప్రశ్న తీవ్ర ఆసక్తి రేపుతోంది.
వైసీపీలో నెంబరు టుగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా వైసీపీలో అనుబంధ విభాగాలకు నాయకుడిగా విజయసాయిరెడ్డి చాలా ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. ఒక విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తర్వాత ఆ పార్టీలో నేతలకు విజయసాయిరెడ్డితోనే ఎక్కువ అనుబంధం ఉందని అంటున్నారు. కానీ, విజయసాయిరెడ్డి సొంత దుకాణం తెరవాలని నిర్ణయించిన తర్వాత వైసీపీ నుంచి ఏ ఒక్కరు ఆయనకు మద్దతుగా మాట్లాడకపోవడంపైనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా వైసీపీలో పనిచేసిన విజయసాయిరెడ్డి ఆ పార్టీలో ఏ ఒక్కరి విశ్వాసాన్ని పొందలేకపోయారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడితే ఎవరు చేరుతారు? ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నుంచి ఏ ఒక్కరైనా ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధపడతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. అధికారం వదులుకుని ఎవరూ విజయసాయిరెడ్డితో కలిసి నడిచే పరిస్థితులు లేనందున విజయసాయిరెడ్డి ఫోకస్ మొత్తం వైసీపీపై ఉండొచ్చని అంటున్నారు. అయితే ఆ పార్టీలోనూ సాయిరెడ్డితో కలిసి నడిచే వారు కనిపించకపోవడంతోనే పార్టీ ప్రకటనపై ఆలస్యం జరుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత సొంత పార్టీ ప్రకటన చేసినప్పుడు కూడా కొంత ఊగిసలాట జరిగినా, చివరికి ఆమె కొందరు అనుచరులతో కలిసి పార్టీని ప్రకటించారని, కానీ ఇప్పటివరకు విజయసాయిరెడ్డి తన అనుచరులను తెరపైకి తీసుకురాకుండా సొంత పార్టీ ఏర్పాట్లు చేయడమే ఉత్కంఠకు దారితీస్తోందని అంటున్నారు.