జంపింగులపై స్పీకర్‌దే నిర్ణయం: హైకోర్టు
ఈ విషయంలో న్యాయపరంగా కంటే.. కూడా స్పీకర్ నిర్ణయమే సరైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ స్పీకర్‌దేనని స్పష్టం చేసింది.
తెలంగాణలో ప్రస్తుతం రాజుకున్న పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నికల్లో విజయం దక్కించుకుని.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం.. మరింత హీటెక్కింది. ఈ విషయంలో న్యాయపరంగా కంటే.. కూడా స్పీకర్ నిర్ణయమే సరైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ స్పీకర్‌దేనని స్పష్టం చేసింది.
దీంతో బీఆర్ఎస్ తరఫున గెలిచి.. కాంగ్రెస్‌కు మద్దతుగా మారిన వారి విషయంలో స్పీకర్ నిర్ణయం ఫైనల్ కానుంది. ఇక, ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని బీఆర్ ఎస్‌కు సూచించింది. దీంతో గత రెండున్నర సంవత్సరాలుగా ఈ విషయంపై కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. కాగా.. ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది. నిబంధనల ప్రకారం.. ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేలను స్పీకర్ స్వయంగా విచారించారు.
ఎవరూ పార్టీ మారినట్టుగా సంకేతాలు కానీ.. నివేదికలుకానీ.. లేవని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సచివాలయం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఇక, ఇప్పుడు తుది నిర్ణయం స్పీకర్ చేతిలో పెట్టడంతో ఆయన ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీఆర్ ఎస్ కోరుకుంటున్నట్టుగా వేటు పడడం అంత తేలికకాదని అంటున్నారు. పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ ఎస్ పార్టీ కోరుతోంది. కానీ, దానికి తగిన విధమైన భూమిక కనిపించడం లేదని స్పీకర్ స్పష్టం చేస్తున్నారు.
ఇక, ఇప్పుడు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ ఎస్ పక్షాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా కీలక రాజకీయ అంశంగా మారనుంది. దీనిపై బీఆర్ ఎస్ నాయకులు స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా.. పది మంది ఎమ్మెల్యేల వ్యవహారం.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను మరింత వేడెక్కించనుందని తెలుస్తోంది.