47 ఏళ్ల అద్దె వివాదం.. సుప్రీం చారిత్రాత్మక తీర్పుతో సమాప్తం!
రాజీయే రాజమార్గం అంటూ మన న్యాయస్థానాలు చెబుతున్నాయి. చిన్నచిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ సుదీర్ఘంగా కోర్టులు, న్యాయవాదుల చుట్టూతిరగొద్దని, సమస్యలను సామరస్య పూర్వకంగా రాజీ చేసుకోవాలని సూచిస్తున్నాయి.
రాజీయే రాజమార్గం అంటూ మన న్యాయస్థానాలు చెబుతున్నాయి. చిన్నచిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ సుదీర్ఘంగా కోర్టులు, న్యాయవాదుల చుట్టూతిరగొద్దని, సమస్యలను సామరస్య పూర్వకంగా రాజీ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో నెలనెలా లోక్ అదాలత్ నిర్వహిస్తుంటారు. కక్షిదారుల మధ్య రాజీ కుదర్చి సమస్య పరిష్కారానికి న్యాయస్థానాలు చొరవ తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ చాలా మంది వివాదాలను పరిష్కరించుకోవడానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం రాజీ ద్వారా ఎవరో ఒకరు స్వల్పంగా లేదా కొంత ఎక్కువ నష్టపోవాల్సివస్తుందనే భావనే అంటున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిని రాజీకి ఒప్పంచేలా సుప్రీంకోర్టు కొత్త పరిష్కారం కనుగొందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అదే 'సమాధాన్ సమారోహ్' (అందరికీ సమాన న్యాయం). ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 47 ఏళ్ల నాటి సమస్యను తాజాగా పరిష్కరించింది సుప్రీంకోర్టు. దీంతో ప్రస్తుతం సుప్రీం నిర్వహించిన 'సమాధాన్ సమారోహ్' ట్రెండింగ్ అవుతోంది.
న్యాయ వ్యవస్థలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేలా సుప్రీంకోర్టు 'సమాధాన్ సమారోహ్' తీసుకువచ్చిందని అంటున్నారు. జైపూర్‌కు చెందిన ఓ దుకాణానికి సంబంధించి దాదాపు 47 సంవత్సరాలుగా నలుగుతున్న సుదీర్ఘ అద్దె వివాదం సుప్రీంకోర్టు చేపట్టిన 'సమాధాన్ సమారోహ్' ద్వారా సుఖాంతమైంది. ఇరువర్గాల మధ్య పరస్పర అంగీకారంతో కోర్టు వెలుపల రాజీ కుదరడంతో, దశాబ్దాల కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ చారిత్రక కేసు ఎట్టకేలకు ముగిసిందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.
ఈ వివాదానికి సంబంధించిన మూలాలు చాలా కాలం క్రితం నాటివి. 1952లో ప్రారంభమైన ఈ అద్దె వివాదం యజమాని తరఫు నుంచి 1979లో దుకాణం ఖాళీ చేయించాలనే తొలగింపు ప్రక్రియ మొదలవడంతో వివాదాస్పదమైంది. దిగువ న్యాయస్థానాలలో సుదీర్ఘ పోరాటాల అనంతరం, 2017లో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అయితే విశేషమేమిటంటే, ఈ వివాద కాలంలోనే 2003లో యజమాని ఆ దుకాణాన్ని అప్పీలుదారునికి విక్రయించడానికి అంగీకరించి, కొంత మొత్తాన్ని కూడా స్వీకరించారు. అయినప్పటికీ, వివిధ చట్టపరమైన చిక్కులు, అపార్థాల కారణంగా ఈ వివాదం దశాబ్దాల పాటు సాగుతూనే వచ్చింది.
ఇరువర్గాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం చొరవ తీసుకుంది. జస్టిస్ పామిడిగంటం శ్రీ నరసింహ, జస్టిస్ అలోಕ್ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు, 'సమాధాన్ సమారోహ్' కార్యక్రమం ద్వారా దీనిని పరిష్కరించాలని సూచించారు. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) సహకారంతో జరిగిన సమర్థవంతమైన మధ్యవర్తిత్వ చర్చల ఫలితంగా ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ రాజీ ప్రకారం, వివాదాస్పద దుకాణాన్ని ముందే ఒప్పందం కుదిరిన ధర ప్రకారం అప్పీలుదారునికి విక్రయించడానికి ప్రతివాది పూర్తిగా అంగీకరించారు. తద్వారా మరో విడత సుదీర్ఘ విచారణ లేకుండానే ఇరువర్గాల సమ్మతితో 47 ఏళ్ల సమస్య సమసిపోయింది.
న్యాయస్థానాలపై భారాన్ని తగ్గించడంతో పాటు కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించే లక్ష్యంతో సుప్రీంకోర్టు 'సమాధాన్ సమారోహ్' పేరుతో ఈ ప్రత్యేక చొరవను చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ వేదిక ద్వారా సివిల్ వ్యాజ్యాలు, ఆస్తి వివాదాలు, అద్దె తగాదాలు, కుటుంబ సమస్యలు, కార్మిక, బ్యాంకింగ్ రంగానికి చెందిన వేలాది కేసులను పరిష్కారం దిశగా నడిపించారు.
ఈ మూడు రోజుల కార్యక్రమంలో మొత్తం 3,285 కేసులు జాబితా చేయగా, అందులో 1,664 కేసులు విజయవంతంగా సెటిల్ అయ్యాయి. మరో 48 కేసులను మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా సెటిల్ చేసుకున్నారు. జైపూర్ అద్దె వివాదం లాంటి సుదీర్ఘ కేసుల పరిష్కారం ద్వారా, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలు, లోక్ అదాలత్‌లు సామాన్యులకు ఎంతగానో మేలు చేస్తాయని, న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరుస్తాయని ఈ చారిత్రక పరిణామం మరోసారి రుజువు చేసిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.