12 ఏళ్ల నిర్బంధం తర్వాత ఇండియన్ ముజాహిదీన్ లకు బెయిల్.. ఇదో సంచలనం

ఉగ్రవాద కేసులో దాదాపు 12 ఏళ్లుగా విచారణ ఖైదీలుగా జైల్లో ఉన్న ఇద్దరు 'ఇండియన్ ముజాహిదీన్' కార్యకర్తలకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

Update: 2026-07-30 00:30 GMT

ఉగ్రవాద కేసులో దాదాపు 12 ఏళ్లుగా విచారణ ఖైదీలుగా జైల్లో ఉన్న ఇద్దరు 'ఇండియన్ ముజాహిదీన్' కార్యకర్తలకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుదీర్ఘకాలంగా విచారణ పూర్తికాకుండా జైలుకే పరిమితమైన అహజర్, అన్సారీ అనే ఇద్దరు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

రాజ్యాంగ హక్కులను ప్రస్తావించిన ధర్మాసనం

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కును ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేసు విచారణ (ట్రయల్) అత్యంత నెమ్మదిగా సాగుతోంది. సమీప భవిష్యత్తులో ఇది పూర్తయ్యే సంకేతాలు కనిపించడం లేదు. విచారణ పేరుతో నిందితులను నిరవధికంగా జైలులోనే ఉంచడం రాజ్యాంగబద్ధమైన హక్కులకు విరుద్ధం అని వ్యాఖ్యానించింది.

కేసు నేపథ్యం.. 2011 నాటి ఆరోపణలు

ఈ వ్యవహారం 2011 నవంబర్‌లో ప్రారంభమైంది. ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ ఖతీల్ సిద్ధిఖీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు రాజస్థాన్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీని ఆధారంగా స్పెషల్ సెల్ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని, భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో అహజర్, అన్సారీలను అరెస్టు చేశారు. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లో నమోదైన కేసుల్లో కూడా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్ కేసుల్లో ఇప్పటికే వీరికి శిక్షల అమలుపై స్టే లేదా బెయిల్ లభించింది.

హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు..

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నమోదు చేసిన ప్రధాన కేసులో బెయిల్ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ నిర్బంధ కాలం, విచారణలో తీవ్ర ఆలస్యం, ఇతర సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ రావడం వంటి అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు అత్యున్నత స్థాయిలో బెయిల్ మంజూరు చేసింది.

ఇది నిర్దోషిత్వ ప్రకటన కాదు..న్యాయ నిపుణులు

ఈ తీర్పుపై స్పందించిన న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం అంటే నిందితులను నిర్దోషులుగా ప్రకటించినట్లు కాదని స్పష్టం చేశారు. కేసు విచారణ యథావిధిగా కొనసాగుతుందని.. ఇది కేవలం తాత్కాలిక స్వేచ్ఛ మాత్రమేనని వెల్లడించారు. సకాలంలో న్యాయం జరగాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూనే వ్యక్తిగత స్వేచ్ఛకు, సమగ్ర విచారణకు మధ్య సమతుల్యతను పాటించాలని ఈ తీర్పు సందేశమిస్తోంది.

Tags:    

Similar News